త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP VC Sajjanar | చైనీస్ మాంజా విక్ర‌యించినా.. నిల్వ చేసినా క్రిమిన‌ల్ కేసులే.. హెచ్చ‌రించిన సీపీ స‌జ్జ‌నార్‌

CP VC Sajjanar | సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో నిషేధిత చైనీస్‌ మాంజా విక్రయాలు, వాడకంపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు హైద‌రాబాద్ న‌గర పోలీసు కమిషనర్‌ సజ్జనర్ స్ప‌ష్టం చేశారు. పక్షుల స్వేచ్ఛకు, వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న మాంజాను ఎవ‌రైనా ర‌హ‌స్యంగా విక్రయించినా, నిల్వ ఉంచినా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు.

A

Hyderabad | Published On Jan 5, 2026, 5.51 pm IST

CP VC Sajjanar | చైనీస్ మాంజా విక్ర‌యించినా.. నిల్వ చేసినా క్రిమిన‌ల్ కేసులే.. హెచ్చ‌రించిన సీపీ స‌జ్జ‌నార్‌
Advertisement

CP VC Sajjanar | సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో నిషేధిత చైనీస్‌ మాంజా విక్రయాలు, వాడకంపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు హైద‌రాబాద్ న‌గర పోలీసు కమిషనర్‌ సజ్జనర్ స్ప‌ష్టం చేశారు. పక్షుల స్వేచ్ఛకు, వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న మాంజాను ఎవ‌రైనా ర‌హ‌స్యంగా విక్రయించినా, నిల్వ ఉంచినా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన వారిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసి.. చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. చైనీస్‌ మాంజా నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి అధికారులకు సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. పండుగ స‌మ‌యంలో గాలిపటాలు ఎగురవేయడం సంప్రదాయమే అయినా.. అది ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదన్నారు.

చైనీస్ మాంజా పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తోందని, ఇది మట్టిలో కలిసిపోక ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం ప్రభుత్వం చైనీస్ మాంజా తయారీ, విక్రయం, నిల్వ, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించిందని గుర్తుచేశారు. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు నగరవ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీపీ చెప్పారు. నగరంలోని అన్ని జోన్లలోని కైట్స్ విక్రయ కేంద్రాలు, చిన్న కిరాణా దుకాణాలు, అనుమానిత గోదాములపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహిస్తారని స్పష్టం చేశారు. కేవలం విక్రయదారులే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి అక్రమంగా ఈ నిషేధిత మాంజాను రవాణా చేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలు, పార్సిల్ సర్వీసులపైనా నిఘా పెంచామని, వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే ఏజెన్సీ యజమానులపైనా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. చైనీస్ మాంజాలో ప్లాస్టిక్, ఇతర సింథటిక్ పదార్థాలతో పాటు గాజు పెంకుల మిశ్రమం పూతగా ఉంటుందని, దాంతో ద్విచక్ర వాహనదారుల మెడలు తెగిపోవడంతో పాటు, పిల్లల వేళ్లు తెగిపోయే ప్రమాదం ఉందని వివరించారు. మెటాలిక్ పదార్థాల వల్ల విద్యుత్ తీగలకు తగిలినప్పుడు షాక్ కొట్టి పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంప్రదాయ నూలు దారాలను మాత్రమే ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. పౌరులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సీపీ కోరారు. ఎవరైనా చైనీస్ మాంజా విక్రయిస్తున్నట్లుగా, నిల్వ చేసిన‌ట్లుగా తెలిస్తే డయల్ 100, హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నెంబర్ +91 94906 16555, స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వివ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement