khairatabad Ganesh | బడా గణేశ్ దర్శనానికి భారీ ఏర్పాట్లు
khairatabad Ganesh | ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శనివారం జాయింట్ సీపీ (ట్రాఫిక్) డీ జోయల్ డెవిస్, డీసీపీ ట్రాఫిక్ అవినాష్‌కుమార్, అడిషనల్ డీసీపీ రాములు, ఏసీపీ ట్రాఫిక్ ఎస్.మోహన్‌కుమార్‌తోపాటు ఇతర అధికారులు ఖైరతాబాద్ పరిసరాల్లో పర్యటించి ప్రధాన రహదారులు, దర్శన మార్గాలను పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్ ఏర్పాట్లు, మళ్లింపులు, పార్కింగ్ తదితర వివరాలను జాయింట్ సీపీ వెల్లడించారు.
- 30 లక్షల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం
- మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల్లో రావాలని పోలీసుల సూచన
- 23వ తేదీతోనే దర్శనం ముగింపు.. 24న అనుమతి లేదు
- ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ప్రాంతాలపై స్పష్టత
khairatabad Ganesh | ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శనివారం జాయింట్ సీపీ (ట్రాఫిక్) డీ జోయల్ డెవిస్, డీసీపీ ట్రాఫిక్ అవినాష్‌కుమార్, అడిషనల్ డీసీపీ రాములు, ఏసీపీ ట్రాఫిక్ ఎస్.మోహన్‌కుమార్‌తోపాటు ఇతర అధికారులు ఖైరతాబాద్ పరిసరాల్లో పర్యటించి ప్రధాన రహదారులు, దర్శన మార్గాలను పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్ ఏర్పాట్లు, మళ్లింపులు, పార్కింగ్ తదితర వివరాలను జాయింట్ సీపీ వెల్లడించారు.
నాలుగు మార్గాల్లో దర్శనానికి..
ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు నాలుగు ప్రధాన మార్గాల ద్వారా చేరుకోవచ్చని పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, ద్వారకా హోటల్–టెలిఫోన్ భవన్, మింట్ కాంపౌండ్–ఐమాక్స్ ప్రసాద్ వైపు నుంచి ఒక మార్గం, గణేశ్ విగ్రహం వెనుకనున్న బస్తీ వైపు నుంచి మరో మార్గాన్ని ఏర్పాటు చేశారు. పది రోజుల ఉత్సవాల్లో 30 లక్షల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీంతో వ్యక్తిగత వాహనాలతో వచ్చి ట్రాఫిక్ రద్దీ పెంచకుండా మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని సూచించారు. మెట్రో సేవలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఖైరతాబాద్ రూట్‌లో రోజూ సుమారు 2,200 ఆర్టీసీ బస్సులతోపాటు అవసరాన్ని బట్టి ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నట్లు వెల్లడించారు.
ఉదయాన్నే వస్తే సౌకర్యం
మధ్యాహ్నం తర్వాత, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచే దర్శనం ప్రారంభమవుతుందని.. సాయంత్రం రద్దీని తప్పించుకునేందుకు ఉదయం నుంచి మధ్యాహ్నంలోపే దర్శనం పూర్తి చేసుకోవాలని సూచించారు. వీలైన భక్తులు సోమవారం నుంచి శుక్రవారం మధ్య రోజుల్లో రావడం మంచిదని తెలిపారు. వ్యక్తిగత వాహనాల్లో వచ్చే వారు కార్ పూలింగ్ పాటించాలని కోరారు. ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ వైపు వచ్చే వాహనాలకు ఐమాక్స్ గ్రౌండ్, హెచ్‌ఎండీఏ లేక్‌వ్యూ పార్కింగ్, ఎన్టీఆర్ పార్క్ వెనుకనున్న ఈ-రేసింగ్ గ్రౌండ్‌లో పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఇవి నిండిన తర్వాత నెక్లెస్ రోడ్డులోని మక్తా పార్కింగ్‌ను వినియోగించుకోవచ్చని సూచించారు. మెట్రో, వీవీ స్టాచ్యూ వైపు నుంచి వచ్చే వారికి విశ్వేశ్వరయ్య భవన్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వాహనాలు నిలిపిన వారు రోడ్డు దాటాల్సి ఉంటుంది. టెలిఫోన్ భవన్ వైపు పరిమిత పార్కింగ్ మాత్రమే ఉన్నందున.. వీలైనంత వరకు ఎన్టీఆర్ మార్గ్ వైపు ఉన్న పార్కింగ్ ప్రదేశాలను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు.
క్యాబ్‌లు, ఆటోలకు ప్రత్యేక డ్రాపింగ్ పాయింట్
వీవీ స్టాచ్యూ నుంచి నిరంకారీ మధ్య ప్రధాన రహదారిపై ఆటోలు, ఓలా, ఊబర్ వాహనాలు ప్రయాణికులను ఎక్కించడం, దించడం చేయవద్దని పోలీసులు స్పష్టం చేశారు. అక్కడ పికప్, డ్రాపింగ్ చేస్తే ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉన్నందున.. ఎంఎంటీఎస్ స్టేషన్ పక్కనున్న ఓపెన్ గ్రౌండ్‌ను ఇందుకోసం వినియోగించాలని సూచించారు. మెట్రోలో వచ్చే భక్తులు గణేశ్ పండల్ వైపు ఉన్న నిష్క్రమణ ద్వారాన్నే ఉపయోగించాలని పోలీసులు కోరారు. ‘సెవెన్ టెంపుల్స్’ వైపు నుంచి బయటకు వస్తే రోడ్డు దాటాల్సి రావడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. భక్తులకు మార్గనిర్దేశం చేసేందుకు అక్కడ సైనేజ్ బోర్డులు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు
సాధారణ భక్తుల వాహనాలను రాజ్‌దూత్ లేన్, ద్వారకా హోటల్ వైపు నుంచి లోపలికి అనుమతించరు. వాటిని టెలిఫోన్ భవన్ వైపు మళ్లిస్తారు. మింట్ లేన్‌లోకి వాహనాలకు ప్రవేశం ఉండదు.. సెక్రటేరియట్ వైపు మళ్లిస్తారు. ఐమాక్స్ థియేటర్ దాటి బడా గణేష్ వైపు వాహనాలకు అనుమతి ఉండదు. వాటిని నెక్లెస్ రోడ్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు పంపిస్తారు. రాజీవ్‌గాంధీ స్టాచ్యూ నుంచి రైల్వే క్రాసింగ్ దాటి వెళ్లే వాహనాలను నిరంకారీ వైపు మళ్లించనున్నారు. కాలినడకన వచ్చే భక్తుల కోసం ఎంట్రీ, ఎగ్జిట్‌లకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. పాదచారులు వాహనాల క్యారేజ్‌వేపైకి రాకుండా బారికేడింగ్ చేపట్టారు. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో మెష్ బారికేడింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ జంక్షన్, షాదాన్ యూటర్న్, నిరంకారీ ప్రాంతాల్లో మాత్రమే పాదచారులు రోడ్డు దాటేందుకు అవకాశం ఉంటుంది.
500 మంది పోలీసులతో బందోబస్తు
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన జంక్షన్ల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. ఐఆర్ సిబ్బంది, పుషింగ్ టీమ్‌లతో కలిపి సుమారు 500 మంది పోలీసులను వీవీ స్టాచ్యూ, రాజీవ్‌గాంధీ స్టాచ్యూ, షాదాన్, నిరంకారీ, ద్వారకా హోటల్, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి జంక్షన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ తదితర ప్రాంతాల్లో విధుల్లో ఉంచుతున్నారు.
23న దర్శనాలు బంద్
ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనాలు సెప్టెంబర్ 23తో ముగుస్తాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 24న దర్శనానికి భక్తులను అనుమతించబోమని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని ముందుగానే గమనించి తమ దర్శన ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ భక్తులు సహకరించాలని, వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bionic Robot Fish | నీటిలో అచ్చం నిజమైన చేపలా ఈదుతున్న రోబో.. వీడియో వైరల్
- ●Akbaruddin Owaisi | ఆ కంపెనీ చాలా లక్కీ.. అన్ని కాంట్రాక్టులు దానికే దొరుకుతయ్
- ●Dhee Dancer Raju Arrested | పెళ్లి పేరుతో దారుణ మోసం.. కటకటాల పాలైన 'ఢీ' డ్యాన్సర్ రాజు
- ●Komatireddy Venkatreddy | నాగ్‌పూర్ - విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణ పూర్తి
- ●Anupama Parameswaran | పెళ్లి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ - ఫొటోల వెనకున్న అసలు కథ ఇదేనా?
- ●హైదరాబాద్‌కు ‘CURE’ మందా.. సామాన్యుడి జేబుకు చిల్లా?

Bionic Robot Fish | నీటిలో అచ్చం నిజమైన చేపలా ఈదుతున్న రోబో.. వీడియో వైరల్

Akbaruddin Owaisi | ఆ కంపెనీ చాలా లక్కీ.. అన్ని కాంట్రాక్టులు దానికే దొరుకుతయ్

Dhee Dancer Raju Arrested | పెళ్లి పేరుతో దారుణ మోసం.. కటకటాల పాలైన 'ఢీ' డ్యాన్సర్ రాజు

Komatireddy Venkatreddy | నాగ్‌పూర్ - విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణ పూర్తి






