త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Assembly | ధరణితో భూముల ‘బందీ’.. కేసీఆర్‌ పాలనపై పొంగులేటి తీవ్ర ఆరోపణలు

TG Assembly | ధరణి పోర్టల్‌ ఏర్పాటుతో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా పేదలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ధరణి వల్ల ఎదురైన సమస్యలను అప్పటి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు పలుమార్లు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు.

P

Telangana | Published On Sep 12, 2026, 5.11 pm IST

TG Assembly | ధరణితో భూముల ‘బందీ’.. కేసీఆర్‌ పాలనపై పొంగులేటి తీవ్ర ఆరోపణలు
Advertisement

TG Assembly | ధరణి పోర్టల్‌ ఏర్పాటుతో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా పేదలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ధరణి వల్ల ఎదురైన సమస్యలను అప్పటి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు పలుమార్లు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. ధరణి అద్భుతమైన చట్టమంటూ చెప్పడమే తప్ప.. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించే ప్రయత్నం చేయలేదన్నారు. శాసనసభలో ధరణి అంశంపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

55 మాడ్యూళ్లతో సమస్యలు

ధరణి పోర్టల్‌ను సుమారు 55 మాడ్యూళ్లతో రూపొందించారని మంత్రి తెలిపారు. ఏదైనా సమస్య తలెత్తితే ఒక మాడ్యూల్‌ నుంచి మరో మాడ్యూల్‌కు పంపుతూ ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పారని ఆరోపించారు. ధరణి రికార్డులను పోర్టల్‌లోకి అప్‌లోడ్‌ చేసే సమయంలో అనేక తప్పులు జరిగాయని, పట్టా భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లడం, వివిధ సెక్షన్ల కింద ప్రొహిబిటెడ్‌ లిస్ట్‌లో నమోదవడం వంటి సమస్యలు తలెత్తాయని చెప్పారు. ప్రజలు అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయారని.. ధరణి ఉన్నంతకాలం అప్పటి ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలు సైతం సమస్యలపై పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారని గుర్తుచేశారు. అయినా అప్పటి ప్రభుత్వం చట్టాన్ని సవరించేందుకు, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు చొరవ చూపలేదని విమర్శించారు.

ధరణి సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు

ధరణి వల్ల ఎదురైన ఇబ్బందులతో పలువురు తీవ్రంగా నష్టపోయారని పొంగులేటి పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లికి చెందిన కుంటా రాజేశ్‌ (42) తన భూమిని విక్రయించాలనుకున్నా.. ధరణి రికార్డుల్లో తన పేరు మారకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. అధికారులకు వాట్సాప్‌ ద్వారా తన సమస్యను తెలియజేసి.. 2022 ఆగస్టు 7న ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వికారాబాద్‌ జిల్లా పూడూరులో ఖలీల్‌పాషా కొనుగోలు చేసిన ఆరు ఎకరాల భూమి ధరణి పోర్టల్‌లోని సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్‌ కాలేదని మంత్రి తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఏళ్ల తరబడి తిరిగిన ఆయన 2022 జనవరి 31న కలెక్టరేట్‌ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన దళిత రైతు మద్దెల కృష్ణయ్య కూడా ధరణి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. విజయేందర్‌రెడ్డి నుంచి కొనుగోలు చేసిన భూమిని తన పేరుపై మార్చుకునేందుకు పలుమార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేకపోవడంతో 2023 జనవరి 17న ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనలకు సంబంధించి అప్పట్లో మీడియాలో వచ్చిన వార్తలే ఆధారమని మంత్రి చెప్పారు.

‘సీక్రెట్‌ లాక్‌’లతో పారదర్శకతకు గండి

ధరణి పోర్టల్‌లో ‘సీక్రెట్‌ లాక్‌’ వ్యవస్థ ఉండేదని పొంగులేటి ఆరోపించారు. ఒకరి భూమి వివరాలు మరొకరికి కనిపించకుండా చేసిన వ్యవస్థ వెనుక దురుద్దేశం ఉందని వ్యాఖ్యానించారు. వేలాది ఎకరాల ప్రైమ్‌ ప్రాపర్టీల బదలాయింపులు బయటకు కనిపించకుండా ఉండేందుకే ఈ విధానం ఉపయోగపడిందని ఆరోపించారు. ధరణిలో సమస్యలు ఎదురైనప్పుడు కొందరు ప్రజాప్రతినిధుల జోక్యంతో వాటిని ఆగమేఘాలపై పరిష్కరించేవారని.. సాధారణ ప్రజలకు మాత్రం సమస్యలు పరిష్కారం కాకుండా ఉండేవని విమర్శించారు. చట్టం, నిబంధనల కంటే వ్యక్తిగత పరిచయాలకే ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు.

రైతులు, సామాన్యులకు తీవ్ర నష్టం

ధరణి సమస్యల కారణంగా అనేక మంది రైతులు, భూయజమానులు రోడ్డున పడ్డారని మంత్రి చెప్పారు. భూములు అమ్ముకోలేక, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు వంటి అవసరాలకు డబ్బులు సమకూర్చుకోలేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రజల సమస్యలను అప్పటి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. ధరణి వ్యవస్థపై ప్రజల్లో, ప్రజాప్రతినిధుల్లో వ్యక్తమైన అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టమని పొంగులేటి వ్యాఖ్యానించారు. ధరణి పేరుతో జరిగిన వ్యవహారాలపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని.. గతంలో జరిగిన తప్పులను సరిదిద్ది, ప్రజల భూములు, ఆస్తుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement