త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Ponguleti | కేసీఆర్ మాస్ట‌ర్ స్కెచ్ ధ‌ర‌ణి

Minister Ponguleti | పేదల భూములపై కన్నేసి.. ప్రైమ్‌ ప్రాపర్టీలను కొల్లగొట్టేందుకే అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ధరణిని తీసుకువ‌చ్చార‌ని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి ఆరోపించారు. ధరణి పేరుతో వేల ఎకరాల భూములకు తెరలేపారని, భూముల హక్కులను సామాన్యులకు దూరం చేశారని విమ‌ర్శించారు.

P

Telangana | Published On Sep 12, 2026, 4.57 pm IST

Minister Ponguleti | కేసీఆర్ మాస్ట‌ర్ స్కెచ్ ధ‌ర‌ణి
Advertisement
  • ఆయ‌న చేసిన విధ్వంసం చిన్న‌ది కాదు
  • బీఆర్ఎస్ హ‌యాంలో ధరణి పేరుతో పేదల హక్కులకు గండి
  • తప్పు చేసినోడు తలవంచుకుంటాడు.. పాపం చేసినోడు పారిపోతాడు
  • అసెంబ్లీలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి

Minister Ponguleti | పేదల భూములపై కన్నేసి.. ప్రైమ్‌ ప్రాపర్టీలను కొల్లగొట్టేందుకే అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ధరణిని తీసుకువ‌చ్చార‌ని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి ఆరోపించారు. ధరణి పేరుతో వేల ఎకరాల భూములకు తెరలేపారని, భూముల హక్కులను సామాన్యులకు దూరం చేశారని విమ‌ర్శించారు. అసెంబ్లీలో పొంగులేటి మాట్లాడుతూ.. భార‌తీయ సంస్కృతిలో మ‌ట్టికి, మ‌నిషికి విడ‌దీయ‌రాని బంధం ఉంది. భూమి కేవ‌లం ఆస్తి కాదు. అది రైతు చెమ‌ట‌కు ప్ర‌తీక‌. కుటుంబ భ‌విష్య‌త్‌కు భ‌రోసా. ఆత్మ‌గౌర‌వానికి నిలువెత్తు సాక్ష్యం. క‌ష్ట‌ప‌డి కొనుక్కున్న చిన్న స్థ‌లాలు, ప్లాట్‌, త‌ర‌త‌రాలు వార‌స‌త్వంగా వ‌స్తున్న భూములు కావొచ్చు. ప్ర‌తి అంగుళం భూమి వెనుక ఒక కుటుంబం క‌ల‌, జీవిత‌కాల శ్ర‌మ‌దాటి ఉంటుంది. ప్ర‌జ‌ల ఆస్తుల హ‌క్కులు కాపాడ‌టం, ప్ర‌భుత్వ భూములు, ఆస్తుల‌ను సంర‌క్షించ‌డం బాధ్య‌తాయుత‌మైన ప్ర‌భుత్వం ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం. ప‌దేళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన దొర‌ల ప్ర‌భుత్వం ఈ క‌ర్త‌వ్యాన్ని పూర్తిగా విస్మ‌రించింది. భూమికి, మ‌నిషికి ఉన్న అనుబంధాన్ని విఛ్చిన్నం చేసింది. అందుకే ఈనాడు ఈ ప‌రిస్థితి వ‌చ్చిందని మంత్రి ఆరోపించారు.

ప్ర‌జా ఆస్తుల‌కు సంపూర్ణ ర‌క్ష‌ణ‌

‘గ‌త ప్ర‌భుత్వం నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మిస్తూ రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలోని ప్ర‌జాప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆస్తుల‌ను కాపాడుతూనే సంపూర్ణ ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. ఈ ప్ర‌భుత్వం తీసుకునే ప్ర‌తీ నిర్ణ‌యం ఆఖ‌రి వ‌రుస‌లో ఉన్న సామాన్యుడి మొఖంలో చిరున‌వ్వు చూసేందుకే. అది భూభార‌తి చ‌ట్టం, పోర్ట‌ల్‌, ఇంటిగ్రేటెడ్ భూ భార‌తి పోర్ట‌ల్ కావొచ్చు. 125 సంవ‌త్స‌రాల త‌ర్వాత రాష్ట్రంలోని ప్ర‌తీ అంగుళాన్ని రీ స‌ర్వే చేసే కార్య‌క్రం, 22ఏ కావొచ్చు. గ‌డిచిన రెండున్న‌ర సంవ‌త్స‌రాల్లో రెవెన్యూశాఖ‌లో చేప‌ట్టిన ప్ర‌తీ సంస్క‌ర‌ణ వెనుక ఒకే ల‌క్ష్యం తెలంగాణ స‌క‌ల జ‌నుల ఆస్తుల, హ‌క్కుల సంపూర్ణ ర‌క్షణే. ఇందులో ఎలాంటి స్వార్థానికి చోటులేదు. అవినీతికి తావులేదు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల‌కు అంత‌కంటే అవ‌కాశం లేదు’ అని మంత్రి పేర్కొన్నారు.

పాపాల‌కు స‌మాధానం చెప్ప‌లేక‌..

‘ప్ర‌జాశ్రేయ‌స్సే ప‌ర‌మావ‌ధిగా, పార‌ద‌ర్శ‌క‌తే మార్గంగా ప‌ని చేస్తుంది. మ‌న పెద్ద‌లు ఒక మాట అంటారు. త‌ప్పుచేసినోడు త‌ల‌వంచుకుంటాడు.. పాపం చేసినోడు పారిపోతాడు. ఈ రోజు ఈ ప‌విత్ర‌మైన శాస‌న‌స‌భ సాక్షిగా అది అక్ష‌రాల నిజ‌మైంది. ప‌దేళ్లు అధికారంలో ఉండి 22ఏ భూముల పేరుతో ఏ విధంగా పేద‌ల క‌డుపుకొట్టారో.. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను అడ్డంపెట్టుకొని ఏ విధంగా వేల ఎక‌రాల‌కు తెర‌లేపారు. ఈ పాపాల‌కు ఈ రోజు స‌మాధానం చెప్పాల్సి వ‌స్తుంద‌ని.. మాట్లాడే ధైర్యం లేక ఉద్దేశ‌పూర్వ‌కంగానే స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టించి ప్లాన్ ప్ర‌కారం పారిపోయారు. చ‌ర్చ‌కు మొఖం చాటేయ‌డం బీఆర్ఎస్ నాయ‌కుల‌కు కొత్తేమీ కాదు. కానీ, ఈ రోజు ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారు. రెవెన్యూశాఖ‌లో వారు చేసిన విధ్వంసం చిన్న‌ది కాదు. అడ్డ‌గోలుగా నొక్కిన భూములు, లెక్క‌లు చిన్న‌వి కావు. స‌భ నుంచి పారిపోతే పారిపోవ‌చ్చు కానీ.. 4కోట్ల ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాల‌ను వివ‌రించాల్సిన బాధ్య‌త మా ప్ర‌భుత్వంపై ఉంది’ అని పొంగులేటి పేర్కొన్నారు.

న‌మ్మి ముఖ్య‌మంత్రిగా ఎన్నుకుంటే..

‘తెలంగాణ రాష్ట్రం కావాల‌ని ద‌శాబ్దాలుగా అనేక మంది ఆత్మ‌బ‌లిదానాల ఫ‌లితంగా ఆనాడు యూపీఏ ప్ర‌భుత్వం, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. రాష్ట్రం ఏర్పాటు త‌ర్వాత తెలంగాణ‌కు తొలి ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప్ర‌జ‌లు ఎన్నుకున్నారు. ఆనాడు ప్ర‌జ‌లు అనుకున్న‌ట్లు తెలంగాణ రాష్ట్రానికి మంచి చేస్తార‌ని న‌మ్మి.. రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఎన్నుకుంటే.. ఎన్నుకున్న లాగాయితు వారి దొర‌పోక‌డ‌తో, సొంత నిర్ణ‌యాల‌తో ఏ తెలంగాణ వ‌స్తే పేద‌వాడి క‌ష్టాలు తీరుతాయ‌ని, పేద‌వాడికి పూర్తి హ‌క్కులు వ‌స్తాయ‌ని క‌ల‌లు క‌న్నారో.. వ‌చ్చిన తెలంగాణ‌లో కేవ‌లం వారి స్వార్థం కోసం, స్వ‌ప్ర‌యోజ‌నాల కోస‌మే వ‌చ్చిన తెలంగాణ‌లో రెండు ప‌ర్యాయాలు ముఖ్య‌మంత్రి అయి కూడా వ‌న్‌సైడ్‌గా ఆస్తులు పెంచుకునేందుకు, బంధువుల ఆస్తులు పెంచేందుకు, పింక్ క‌ల‌ర్ ష‌ర్ట్ వేసుకున్నవారి ఆస్తుల‌ను పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డ్డ‌దే త‌ప్పా తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య ప్ర‌జ‌ల ఏదైతే.. తెలంగాణ రాష్ట్రం వ‌స్తే బాగుప‌డుత‌ద‌న్న క‌ల క‌ల‌లాగే మిగిలిపోయింది’ అన్నారు.

పేరుకే మంత్రి..

‘ముఖ్యంగా భూముల విష‌యంలో. ఎందుకు చెబుతున్నానంటే.. రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత రెవెన్యూ మంత్రిగా ఒక‌రిని కొద్దిరోజులు నియ‌మించారు. పేరుకే మంత్రి అయితే ఉన్నారు కానీ.. ఆ రెవెన్యూశాఖ‌ను అంతా కూడా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే న‌డిచేది. దాని ఫ‌లిత‌మే ముఖ్య‌మంత్రిగా రెవెన్యూను ఒక మంత్రిని ఉంచినా కూడా మొద‌టి విడ‌త పూర్తిగా త‌న క‌నుసైగ‌ల్లోనే న‌డిచేది. రెండోప‌ర్యాయంలో వేరేవారికి ఇవ్వ‌లేదు. రెండుప‌ర్యాయాలు పూర్తిగా ఆ రెవెన్యూశాఖ‌ను సీఎం త‌న వ‌ద్ద‌నే ఉంచుకొని ఒక మాస్ట‌ర్ గేమ్‌తో తెలంగాణ‌లో ఎక్క‌డైతే ప్రైమ్ ప్రాప‌ర్టీస్ ఉన్నాయో.. పేద‌వారికి చెందాల్సిన ఆస్తుల‌పై క‌న్నేసి.. ఎలా కొల్ల‌గొట్టొచ్చో.. వాట‌న్నింటికి ఒక మాస్ట‌ర్ స్కెచ్ వేశారు. అందులో భాగ‌మే ధ‌ర‌ణి. ఆ నాటి ముఖ్య‌మంత్రి ధ‌ర‌ణి వ‌స్తే మీ స‌మ‌స్య‌లు అన్నీ ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని న‌మ్మ‌బ‌లికారు’ అని ఆరోపించారు.

ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం..

‘న‌లుగురు వ్య‌క్తులు నాలుగు గోడ‌ల మ‌ధ్య అర్ధ‌రాత్రిపూట ధ‌ర‌ణి అనే ఒక చ‌ట్టాన్ని ప్ర‌జ‌ల అభిప్రాయాలు తెలుసుకోకుండా, ప్ర‌జ‌ల్లో చ‌ర్చించ‌కుండా ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకొని ధ‌ర‌ణిని తీసుకువ‌చ్చారు. ధ‌ర‌ణి త‌ర్వాత క‌ష్టాలు, బాధ‌లు, ఇబ్బందులు, పేద‌లు ఎలా ఇబ్బందిప‌డ్డారో తెలియంది కాదు. ఈ ధ‌ర‌ణిని తీసుకువ‌చ్చాక నిర్వ‌హించే కాంట్రాక్ట్ సైతం వారి తొత్తుల‌కే వ‌చ్చేవిధంగా ఓ దివాళాకోరు సంస్థ‌, విదేశీ సంస్థ‌కి తెలంగాణ రాష్ట్ర ఆస్తులు.. 2.49కోట్ల ఎక‌రాల భూమిని ఒక విదేశీ సంస్థ‌కు, విదేశాల్లో తాక‌ట్టుపెట్టిన ఘ‌న‌త ఆనాటి ముఖ్య‌మంత్రిది. తాక‌ట్టుపెట్ట‌డ‌మే కాకుండా ఆ సంస్థ నుంచి మ‌రోసారి ఇంకో కంపెనీకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసి వారి సొంత ఆస్తిలా ఈ తెలంగాణ రాష్ట్రంలోని భూముల‌ను వారి తాత ఆస్తిలాగ‌నే వారు ఇష్టం వ‌చ్చిన‌ట్లు, ఇష్టం వ‌చ్చిన వారికి అర్ధ‌రాత్రిపూట రిజిస్ట్రేష‌న్లు చేసిన సంద‌ర్భాలు కూడా కోకొల్ల‌లు ఉన్న‌య్‌’ అన్నారు.

Advertisement
Advertisement