త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRICS Summit 2026 | భవిష్యత్తు మనదైతే.. నిర్ణయించే హక్కూ మనదే

BRICS Summit 2026 | బ్రిక్స్‌ దేశాల ఐక్యత, ఏకాభిప్రాయాన్ని ఇకపై ప్రపంచ వేదికపై స్పష్టమైన ఫలితాలుగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ రాబోయే 20 ఏళ్లకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యాచరణను రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో ప్రారంభమైన 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన మోదీ.. ప్రపంచ పాలనా వ్యవస్థలో సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు.

P

National | Published On Sep 12, 2026, 3.59 pm IST

BRICS Summit 2026 | భవిష్యత్తు మనదైతే.. నిర్ణయించే హక్కూ మనదే
Advertisement
  • ప్రపంచ వేదికపై ఐక్యతను కార్యాచరణగా మార్చాలి
  • యూఎన్‌ఎస్‌సీ సంస్కరణలకు ఇదే సమయం
  • గ్లోబల్‌ సౌత్‌ బలపడాలి
  • ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ
  • బ్రిక్‌లో శిఖ‌రాగ్ర స‌ద‌స్సులో ప్రారంభోప‌న్యాసం చేసిన ప్ర‌ధాని

BRICS Summit 2026 | బ్రిక్స్‌ దేశాల ఐక్యత, ఏకాభిప్రాయాన్ని ఇకపై ప్రపంచ వేదికపై స్పష్టమైన ఫలితాలుగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ రాబోయే 20 ఏళ్లకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యాచరణను రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో ప్రారంభమైన 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన మోదీ.. ప్రపంచ పాలనా వ్యవస్థలో సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. బ్రిక్స్‌ ఏర్పడి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రస్తుత సదస్సు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. రెండు దశాబ్దాల్లో బ్రిక్స్‌ అంతర్జాతీయ వేదికపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని చెప్పారు. సభ్య దేశాలు పరస్పరం అభిప్రాయాలను గౌరవించుకుంటూ.. ఏకాభిప్రాయంతో ముందుకు సాగడం బ్రిక్స్‌ ప్రధాన బలమని తెలిపారు.

20 ఏళ్లకు కొత్త కార్యాచరణ

బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలు ఏటా మారుతున్నప్పటికీ.. సంస్థాగతంగా చేపట్టిన నిర్ణయాలు, కార్యక్రమాల్లో నిరంతరత్వం కొనసాగాలని మోదీ సూచించారు. అధ్యక్ష బాధ్యతలు మారినా సంస్థాగత పురోగతికి ఆటంకం కలగకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ బ్రిక్స్‌ అధ్యక్షతలో స్థిరత్వం, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరతకు ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. బ్రిక్స్‌ సహకారం కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాకుండా సామాన్య ప్రజలకు చేరేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందులో భాగంగా 350కి పైగా సమావేశాలు నిర్వహించామని, సభ్య దేశాల బృందాలకు దేశంలోని దాదాపు 30 నగరాల్లో ఆతిథ్యం ఇచ్చామని వివరించారు. అధ్యక్షత సమయంలో సహకరించిన అన్ని సభ్య దేశాలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచ పాలనలో సంస్కరణలు

ప్రస్తుత ప్రపంచ పాలనా వ్యవస్థ కొద్దిమంది దేశాలు, సంస్థల చేతుల్లో అధికారం కేంద్రీకృతమైన పిరమిడ్‌ తరహాలో ఉందని మోదీ వ్యాఖ్యానించారు. నిర్ణయాల ప్రభావాన్ని నేరుగా ఎదుర్కొనే అనేక దేశాలకు వాటి రూపకల్పనలో తగిన ప్రాతినిధ్యం లభించడం లేదన్నారు. అందువల్ల అన్ని దేశాల స్వరాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా ప్రపంచ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచ పాలనా సంస్కరణల కోసం 10 ప్రతిపాదనలను రూపొందించి.. వచ్చే బ్రిక్స్‌ సదస్సు నాటికి వాటిని సంస్కరణల రోడ్‌మ్యాప్‌గా రూపొందించాలని సూచించారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పన అనే మూడు అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

యూఎన్‌ఎస్‌సీ సంస్కరణ అనివార్యం

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో ప్రాతినిధ్య పరంగా సంస్కరణలు ఇక తప్పనిసరి అని మోదీ స్పష్టం చేశారు. ఆర్థిక సంస్థల్లో ఓటింగ్‌ హక్కులు, ఆర్థిక విధానాల రూపకల్పన ప్రస్తుత ప్రపంచ వాస్తవాలకు అనుగుణంగా ఉండాల‌న్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్న దేశాలకు తగిన పాత్ర కల్పించాలని సూచించారు. ప్రపంచ సంస్థలపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సమష్టి స్పందనపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో సీఫేరర్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారి కోసం అత్యవసర వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

భవిష్యత్తు మనదైతే.. నిర్ణయించే హక్కూ మనదే..

భవిష్యత్‌ విధానాలు, నిబంధనలను ప్రభావితం చేస్తున్న కృత్రిమ మేధ (ఏఐ), కీలక సాంకేతికతల వంటి రంగాల్లో గ్లోబల్‌ సౌత్‌ దేశాలు కూడా నిబంధనల రూపకర్తలుగా ఎదగాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. భవిష్యత్‌ నియమాల రూపకల్పనలో ప్రపంచంలోని అన్ని దేశాలకు భాగస్వామ్యం కల్పించడం కీలకమన్నారు. దక్షిణ–దక్షిణ సహకార దినోత్సవం రోజునే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యమైనదని పేర్కొంటూ.. ఈ దిశగా నాయకత్వం వహించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు. ‘భవిష్యత్తు మనదైతే.. దాన్ని నిర్ణయించే హక్కు కూడా మనదే’ అనే స్పష్టమైన సందేశాన్ని ఈ బ్రిక్స్‌ సదస్సు ఇవ్వాలని మోదీ ఆకాంక్షించారు.

Advertisement
Advertisement