త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

హైదరాబాద్‌కు ‘CURE’ మందా.. సామాన్యుడి జేబుకు చిల్లా?

హైదరాబాద్‌ మహానగర పాలనను సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం తెచ్చిన 'క్యూర్‌' (CURE) బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. త్వరలో చట్టం కానున్న ఈ బిల్లులోని అంశాలు నగరానికి ఆధునిక హంగులు అద్దనుండగా, సామాన్యుడిపై పడబోయే పన్నుల భారంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

S

Hyderabad | Published On Sep 12, 2026, 5.55 pm IST

హైదరాబాద్‌కు ‘CURE’ మందా.. సామాన్యుడి జేబుకు చిల్లా?

సంక్షిప్త సారాంశం

సేవలు ఒక్కచోట.. సమస్యలు లెక్కలేనన్ని! టెక్నాలజీతో ఆఫీసుల తిరుగుడు తప్పుతుందంటున్న ప్రభుత్వం, మార్కెట్ విలువల పేరుతో ఆస్తిపన్నును పెంచితే మాత్రం 'CURE' నగర సమస్యలకు మందు కాదు.. సామాన్యుడి జేబుకు పెద్ద చిల్లు!

Advertisement

                                                   హైదరాబాద్‌కు ‘CURE’.. సామాన్యుడికి లాభమా? భారమా?       

   

పాలనలో సమన్వయం..

సేవల్లో వేగం..

ఆస్తిపన్నులో కొత్త లెక్కలు..

కొత్త వ్యవస్థ నగరవాసికి ఏం ఇవ్వబోతోంది?

 

హైదరాబాద్ మారింది. నగరం విస్తరించింది. జనాభా భారీగా పెరిగింది. కానీ నగర పాలనకు ఆధారమైన ప్రధాన చట్టం మాత్రం దాదాపు ఏడు దశాబ్దాల కిందటిది. ఈ అంతరాన్ని తొలగించేందుకే కోర్ అర్బన్ రీజియన్ (Core Urban Region–CURE) సమగ్ర పాలన బిల్లు–2026 ను ప్రభుత్వం తీసుకొచ్చింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. 1955 నాటి చట్టం 10–15 లక్షల జనాభాను దృష్టిలో పెట్టుకుని రూపొందిందని, ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లతో కూడిన CURE ప్రాంత జనాభా దాదాపు 1.30 కోట్లకు చేరిందని ప్రభుత్వం చెబుతోంది. ట్రాఫిక్, వరదలు, చెరువులు, నీరు, రోడ్లు వంటి సమస్యలు అనేక శాఖలతో ముడిపడి ఉండటంతో సమగ్ర పాలన అవసరమన్నది ప్రభుత్వ వాదన. అది అవసరమైన సంస్కరణే కావచ్చు. కానీ సామాన్యుడి కోణంలో అసలు ప్రశ్న—కొత్త వ్యవస్థతో సేవలు ఎంత మెరుగవుతాయి? దానికి అతను చెల్లించాల్సిన మూల్యం ఎంత?

నాలుగు ఆఫీసుల పని.. ఒకేచోటైతే లాభమే

ఒక అండర్‌పాస్‌లో నీరు నిలిచినా కార్పొరేషన్, జలమండలి, ట్రాఫిక్ పోలీసులు, HYDRAA వంటి సంస్థలు కలిసి పనిచేయాల్సి వస్తోందని ప్రభుత్వం ఉదాహరిస్తోంది. ఈ సమన్వయ లోపాన్ని తగ్గించడమే CURE ప్రధాన లక్ష్యం. ఒకే సేవల పోర్టల్, సమగ్ర బిల్లింగ్ (Integrated Billing), డిజిటల్ భవన అనుమతులు, ట్రాఫిక్–రోడ్డు భద్రత, విపత్తుల నిర్వహణ, చెరువుల పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. ఇవి సక్రమంగా పనిచేస్తే ప్రజలకు ప్రయోజనమే. కార్యాలయాల చుట్టూ తిరగడం తగ్గాలి. ఫిర్యాదులకు పరిష్కారం వేగంగా రావాలి.

ఆస్తిపన్ను.. అసలు పరీక్ష ఇక్కడే

ప్రజల జేబును నేరుగా తాకే అంశం ఆస్తిపన్ను. ప్రస్తుతం ఉన్న వార్షిక అద్దె విలువ (Annual Rental Value) ఆధారిత విధానం నుంచి ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానం (Capital Value System) వైపు వెళ్లడం కీలక మార్పు. ఇక్కడే సామాన్యుడి ప్రశ్న మొదలవుతుంది. ఇంటి విలువ పెరిగిందంటే ఇంటి యజమాని ఆదాయం కూడా పెరిగినట్లేనా?
ఇరవై ఏళ్ల క్రితం నగర శివారులో రూ.10 లక్షలకు కొన్న ఇంటి విలువ ఇప్పుడు రూ.కోటికి చేరి ఉండొచ్చు. కానీ యజమాని ఆ ఇంటిని అమ్మలేదు, అద్దెకూ ఇవ్వలేదు. అందులోనే ఉంటున్నాడు. అంటే పెరిగిన ఆస్తి విలువ అతని చేతిలో నగదు కాదు. ముఖ్యంగా పెన్షనర్లు, స్థిర ఆదాయం ఉన్న కుటుంబాలకు ఇంటి విలువ కాగితంపై పెరుగుతుంది.. పన్ను మాత్రం జేబులోని ఆదాయం నుంచే కట్టాలి. అందుకే యజమానే నివసించే ఇళ్లకు (Self-occupied Houses), వృద్ధులు, తక్కువ లేదా స్థిర ఆదాయం ఉన్న కుటుంబాలకు ఎలాంటి రక్షణ ఉంటుందన్నది కీలకం.

రూ.100 పన్ను.. కొత్త లెక్కలో ఎంత?

ప్రస్తుతం రూ.100 పన్ను ఉన్న ఇంటికి కొత్త విధానంలో నిర్ణయించే ప్రమాణ ఆస్తిపన్ను (Benchmark Property Tax) రూ.200గా వచ్చిందని ఉదాహరణకు అనుకుందాం. గరిష్ఠంగా 20 శాతం వార్షిక పెంపు వర్తిస్తే ఒక్కసారిగా రూ.200 కాకుండా మొదట రూ.120, తర్వాత రూ.144, ఆపై రూ.172.80గా పెరుగుతూ నిర్ణయించిన స్థాయికి చేరుతుంది. ఇక్కడ రూ.200 కేవలం ఉదాహరణ మాత్రమే. ప్రతి ఇంటి పన్ను రెట్టింపు అవుతుందని కాదు; 20 శాతం కూడా పన్ను రేటు కాదు.అసలు ప్రశ్న—ఆస్తి విలువను ఎలా నిర్ణయిస్తారు? తప్పుగా విలువ కడితే సామాన్యుడి పరిస్థితి ఎంటి? అలాంటి తప్పుడు విలువను సరిదిద్దే యంత్రాంగం ప్రభుత్వం ఏం  ఏర్పాటు చేయనుంది?   ఈ యంత్రాంగం ద్వారా నగర వాసి ఎంత సులభంగా  తన సమస్యను పరిష్కరించుకోగలడు? అన్నేదే ఇక్కడ కీలక ప్రశ్న.

ఒకే బిల్లు.. మొత్తం భారం ఎంత?

ఆస్తిపన్ను, నీరు, మురుగునీరు, పారిశుధ్య ఛార్జీలను ఒకే సమగ్ర బిల్లులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇది చెల్లింపులో సౌకర్యమే. అయితే సమగ్ర బిల్లింగ్ అంటే ఛార్జీల పెంపు అని కాదు. కొత్త వ్యవస్థలో ఒక కుటుంబం ఏడాదికి పౌర సేవల కోసం మొత్తం ఎంత చెల్లించాల్సి వస్తుందో పారదర్శకంగా కనిపించాలి. మరోవైపు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (Occupancy Certificate–OC) లేకుండా యుటిలిటీ కనెక్షన్లు ఇవ్వకుండా నిబంధనలు రూపొందించనున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం అవసరమే. కానీ దశాబ్దాల నాటి ఇళ్లు, చిన్న నిర్మాణ వ్యత్యాసాలు (Building Deviations), పత్రాల సమస్యలు ఉన్న సాధారణ కుటుంబాలకు పరిష్కార మార్గం ఏమిటన్నదీ స్పష్టం కావాలి.

అధికారాలు పెరిగితే.. జవాబుదారీతనం కూడా పెరగాలి

వార్డు స్థాయి వికేంద్రీకరణ కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. అదే సమయంలో CURE స్థాయిలో కొత్త సమన్వయ సంస్థలు వస్తున్నాయి. మరి మేయర్, కార్పొరేటర్ వంటి ఎన్నికైన ప్రజాప్రతినిధుల పాత్ర ఎంత? డ్రైనేజీ పొంగితే ఎవరిని అడగాలి? రోడ్డు పాడైతే ఎవరిని నిలదీయాలి? సమన్వయం పెరిగి జవాబుదారీతనం తగ్గకూడదు.

చివరకు.. CURE ఎవరికీ ‘క్యూర్’?

హైదరాబాద్‌కు ఆధునిక పాలనా వ్యవస్థ అవసరం. శాఖల సమన్వయం, డిజిటల్ సేవలు, ట్రాఫిక్–వరదల నిర్వహణ మెరుగైతే CURE ప్రజలకు ప్రయోజనమే. కానీ ఆస్తిపన్ను లెక్క పారదర్శకంగా ఉండాలి. సొంతింట్లో నివసించే వృద్ధులు, పెన్షనర్లు, స్థిర ఆదాయ కుటుంబాలకు అవసరమైన రక్షణ ఉండాలి. పన్నులు, ఛార్జీలకు తగ్గట్టుగా సేవల్లోనూ మార్పు కనిపించాలి. ప్రజల తిరుగుడు తగ్గి, సేవలు మెరుగై, బాధ్యత స్పష్టమైతే CURE హైదరాబాద్‌కు అవసరమైన సంస్కరణ. సేవలు మారకుండా సామాన్యుడి జేబుపై భారం మాత్రమే పెరిగితే మాత్రం ‘CURE’ నగర సమస్యలకు మందు కాకుండా, సామాన్యుడికి మరో సమస్యగా మారుతుంది.

Advertisement
Advertisement