త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Danam Nagender | ‘దానం’ ప‌దోసారి పోటీ..! ఈ ఉప ఎన్నిక క‌లిసొచ్చేనా..?

Danam Nagender | అన‌ర్హ‌త వేటు విష‌యంలో దానం నాగేంద‌ర్‌కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు కావ‌డంతో.. ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వ‌ర‌లో జ‌ర‌గబోయే ఉప ఎన్నిక‌లో దానం నాగేంద‌ర్ ఏ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా ఉంది.

S

Hyderabad | Published On Sep 24, 2026, 3.48 pm IST

Danam Nagender | ‘దానం’ ప‌దోసారి పోటీ..! ఈ ఉప ఎన్నిక క‌లిసొచ్చేనా..?
Advertisement

Danam Nagender | త్రినేత్ర న్యూస్ : అన‌ర్హ‌త వేటు విష‌యంలో దానం నాగేంద‌ర్‌( Danam Nagender )కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు కావ‌డంతో.. ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వ‌ర‌లో జ‌ర‌గబోయే ఉప ఎన్నిక‌లో దానం నాగేంద‌ర్ ఏ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా ఉంది. ఈ విష‌యంపై దానంను మీడియా ప్ర‌శ్నించ‌గా.. పోటీ చేసిన‌ప్పుడు చెబుతాన‌ని స‌మాధానం దాట‌వేశారు. ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎవ‌రు పోటీ చేస్తార‌నేది కూడా సీఎం నిర్ణ‌యిస్తార‌ని దానం చెప్పారు. ఒక వేళ దానం నాగేంద‌రే ఈ ఉప ఎన్నిక‌లో పోటీ చేస్తే.. ఆయ‌న ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం పదోసారి అవుతుంది.

1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు

దానం నాగేంద‌ర్ త‌న రాజ‌కీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభించారు. తొలిసారిగా ఆసిఫ్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1994 ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలుపొందారు. ఈ స్థానంలో ఎంఐఎం అభ్య‌ర్థిని ఓడించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999లోనూ కాంగ్రెస్ త‌ర‌పున ఆసిఫ్‌న‌గ‌ర్ నుంచి రెండోసారి విజ‌యం సాధించారు. 2004లోనూ ఆసిఫ్‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా గెలుపొంది.. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.

2004లో గెలిచారు.. కానీ ఉప ఎన్నిక‌లో ఓట‌మి

అయితే 2004 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో దానంకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ నిరాక‌రించింది. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయాల‌ని సూచించింది. కానీ దానం ఎంపీగా పోటీ చేసేందుకు నిరాక‌రించారు. దీంతో నామినేష‌న్ల గ‌డువు చివ‌రి రోజు టీడీపీలో చేరి.. 2004 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. కానీ 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డంతో.. వైఎస్సార్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరొందిన దానం.. తిరిగి సొంత గూటికి చేరారు. ఈ క్ర‌మంలో టీడీపీ పార్టీ, ఎమ్మెల్యే ప‌ద‌వికి దానం రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌గా, దానం ఓటమి పాల‌య్యారు.

2014లో 'చింత‌ల' చేతిలో చిత్తు

శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో 2009లో ఖైర‌తాబాద్ నుంచి దానం పోటీ చేసి గెలుపొందారు. వైఎస్సార్ కేబినెట్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ప‌ని చేశారు. 2014లో కాంగ్రెస్‌ తరఫున అదే నియోజకవర్గం నుంచి బరిలో నిలవగా.. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓట‌మి చ‌విచూశారు.

2018లో గులాబీ గూటికి..

తెలంగాణ ఏర్పాటు అనంతరం జరిగిన మొదటి ఎన్నికల్లో ఓటమి తర్వాత నాగేందర్‌ కొన్నాళ్లు మౌనంగా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాల్లోనూ అంత చురుకుగా పాల్గొనలేదు. 2018 జూన్‌లో దానం గులాబీ గూటికి చేరారు. అదే ఏడాది డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా నాటి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2023లోనూ బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచారు.

2024లో కాంగ్రెస్ పార్టీలోకి

కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో 2024 మార్చి 17న కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం అదే ఏడాది మేలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు.

2026 సెప్టెంబ‌ర్‌లో అన‌ర్హ‌త వేటు

పార్టీ ఫిరాయింపుల నేప‌థ్యంలో దానం నాగేంద‌ర్‌పై అన‌ర్హ‌త వేటు వేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. చివ‌ర‌కు సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ప్ప‌టికీ అక్క‌డ కూడా చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును స‌మ‌ర్థించింది. దీంతో ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక అనివార్య‌మైంది.

Advertisement
Advertisement