త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | నాడు ఔరంగ‌జేబు.. నేడు రేవంత్ రెడ్డి.. సికింద్రాబాద్ విభ‌జ‌న‌పై ఎమ్మెల్సీ దాసోజు కీల‌క వ్యాఖ్య‌లు

Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్ : నాడు ఔరంగజేబు కూడా హైదరాబాద్ పేరును ‘దారుల్-జిహాద్’గా మార్చాలని ప్రయత్నించాడు. అది సఫలం కాలేదు. నేడు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ‘మల్కాజిగిరి’ పేరుతో చెరపాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రయత్నం కూడా చరిత్ర ముందే ఓటమి చెందుతుంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

S

Hyderabad | Published On Jan 11, 2026, 5.18 pm IST

Dasoju Sravan | నాడు ఔరంగ‌జేబు.. నేడు రేవంత్ రెడ్డి.. సికింద్రాబాద్ విభ‌జ‌న‌పై ఎమ్మెల్సీ దాసోజు కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్ : నాడు ఔరంగజేబు కూడా హైదరాబాద్ పేరును ‘దారుల్-జిహాద్’గా మార్చాలని ప్రయత్నించాడు. అది సఫలం కాలేదు. నేడు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ‘మల్కాజిగిరి’ పేరుతో చెరపాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రయత్నం కూడా చరిత్ర ముందే ఓటమి చెందుతుంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో సికింద్రాబాద్‌లోని బాలంరాయ్ లీ ప్యాలెస్‌లో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌ కీలకమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా దాసోజు శ్ర‌వ‌ణ్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ వార్డుల విభజన అనేది అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ కాదు. ముఖ్యమంత్రి, మంత్రి, కమిషనర్ వాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా గీతలు గీసి వార్డుల విభజన చేయలేరు. అది ఒక రాజ్యాంగ బద్ధమైన ప్రక్రియ. ప్రజలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నాయకులతో చర్చించిన తర్వాత విభజన చేయాలి. జీహెచ్ఎంసీ వార్డుల విభజన నిరంకుశమైన చర్య. వార్డుల విభజనలో పారదర్శకత లేకుండా, ప్రజలను, ప్రజా ప్రతినిధుల్ని సంప్రదించకుండా, చట్టబద్ధమైన నిబంధనలు పాటించకుండా కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికి రేవంత్ రెడ్డి చేసిన కుట్ర ఇది అని దాసోజు శ్ర‌వ‌ణ్ మండిప‌డ్డారు.

74వ రాజ్యాంగ సవరణను తుంగలో తొక్కి, ఎన్నికల సంఘాన్ని కాదని ప్రైవేట్ సంస్థలకు (ASCI/CGG) వార్డుల విభజన అప్ప‌గించ‌డం దారుణం. రాజకీయ లబ్ధి కోసం ఓటు బ్యాంకులను విచ్ఛిన్నం చేసేలా వార్డుల సరిహద్దుల మార్పు సరికాదు. 2053 చ.కి.మీల జీహెచ్ఎంసీ విస్తరణ వెనుక 'ఫ్యూచర్ సిటీ' పేరుతో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణం ఉందని దాసోజు శ్ర‌వ‌ణ్ ఆరోపించారు.

సికింద్రాబాద్‌కు 220 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. దీనిని మల్కాజిగిరి పేరుతో సమాధి చేయాలని చూడటం చారిత్రక తప్పిదం. లష్కర్ బోనాలు, ఉజ్జయిని మహంకాళి ఆలయం, సెయింట్ మేరీస్ చర్చి, క్లాక్ టవర్ వంటి చిహ్నాలు సికింద్రాబాద్ గుర్తింపు. నాడు ఔరంగజేబు సైతం హైదరాబాద్ పేరును 'దారుల్-జిహాద్'గా మార్చాలని చూసి విఫలమయ్యాడని, నేడు రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చెరపాలని చూస్తున్నారని, ఆయ‌న‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌ని శ్ర‌వ‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

వార్డుల విభజన మ్యాపులు మరియు ముసాయిదా సమాచారాన్ని వెంటనే బహిర్గతం చేయాలని, ప్రతి వార్డులో పౌరులు మరియు ప్రజాప్రతినిధులతో బహిరంగ విచారణ జరపాలి. సికింద్రాబాద్‌ను ఒక ప్రత్యేక పరిపాలనా, చారిత్రక విభాగంగానే కొనసాగించాలని, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే విభజన ప్రక్రియ జరగాలి. నగర వారసత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పౌరులందరూ ఏకమై ఈ నిరంకుశ పోకడలపై పోరాడాలని డాక్టర్ శ్రవణ్ దాసోజు పిలుపునిచ్చారు.

Advertisement

తాజావార్తలు

Advertisement