త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | అత్యాధునిక ప‌ద్ధ‌తుల్లో ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ త‌వ్వ‌కాలు : మంత్రి ఉత్త‌మ్

Uttam Kumar Reddy | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర నీటిపారుదల ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

S

Telangana | Published On Jan 11, 2026, 6.23 pm IST

Uttam Kumar Reddy | అత్యాధునిక ప‌ద్ధ‌తుల్లో ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ త‌వ్వ‌కాలు : మంత్రి ఉత్త‌మ్
Advertisement

Uttam Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర నీటిపారుదల ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. యుద్దప్రాతిపదికన పునరుద్దరణ పనులు పూర్తి చేసేందుకు అన్ని వైపులా చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఎస్ఎల్‌బీసీ పునరుద్దరణ పనుల ప్రక్రియపై ఆదివారం రోజున డాక్టర్ బీఆర్ అంబేద్క‌ర్ సచివాలయంలో ఆయన నీటిపారుదల శాఖాధికారులు, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2025 ఫిబ్రవరి 22 న ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటనతో నిలిచి పోయిన పనులను శరవేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. 1983 ప్రాంతంలో ప్రారంభమైన ఎలిమినేటి మాధవ రెడ్డి ప్రాజెక్ట్( AMRP)లో కీలక భాగమైన ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడం ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమన్నారు. శ్రీశైలం ఇన్ లెట్ దేవరకొండ ఔట్ లెట్‌ల‌ ద్వారా నిర్మిత‌మౌతున్న ఈ సొరంగ మార్గం యావత్ ప్రపంచంలోనే 44 కిలోమీటర్ల దూరం పొడవుగా రికార్డు నమోదు చేసుకుందన్నారు. ఇప్పటివరకు ఇన్ లెట్ నుండి 13.94 కిలోమీటర్లు, ఔట్ లెట్ నుండి 20.04 కిలోమీటర్ల దూరం సొరంగ మార్గం పూర్తి అయిందన్నారు. మిగిలిన 9.8 కిలోమీటర్ల దూరం పూర్తి చేయడానికి రెండు వైపుల నుండే ఏక కాలంలో పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఔట్ లెట్ వైపు నుంచి ఉన్న టన్నెల్ బోర్ మిషన్‌ను పూర్తిగా తొలగించామని తద్వారా పనుల పునఃప్రారంభానికి మార్గం సుగమం అయ్యిందని ఆయన తెలిపారు.

అమ‌ల్లోకి 3డీ మానిట‌రింగ్ సిస్ట‌మ్

సొరంగం మార్గం తవ్వకాల సమయంలో ఎదుర‌వుతున్న సవాళ్ళను అధిగమించేందుకు ప్రభుత్వం టీబీఎం విధానానికి స్వస్తి పలికిందని ఆయన వెల్లడించారు. అటువంటి సొరంగ మార్గంలో జరిగిన దుర్ఘటనతో ప్రభుత్వం సొరంగమార్గం తవ్వకాలలో అనుభవజ్ఞులను రప్పించి అన్ని వైపులా అధ్యయనం జరిపి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి పనుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (NGRI)కి చెందిన శాస్త్ర వేత్తలతో హెలికాప్టర్ ఆధారిత ఏలక్ట్రో మాగ్న‌టిక్ సర్వేను పూర్తి చేశాకే పునరుద్ధరణ పనుల ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. గగనతలం నుండి నిర్వహించిన ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే ద్వారా సొరంగ మార్గం నిర్మణానికి అనుకూల మైన్ సమాచారం లభించిందని ఆయన వెల్లడించారు. అంతే గాకుండా ప్రమాదం సంభవించే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించేందుకు గాను అడ్వాన్స్ వార్నింగ్ సిస్టంను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దానికి తోడు భూభౌతిక పరిస్థితి అంచనాలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టడానికి 3D మానిటరింగ్ సిస్టంను అమలులోకి తెస్తున్నట్లు ఆయన తెలిపారు.

సిబ్బందికి అన‌దంగా 25 శాతం జీతాలు పెంపు

ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి అవసరమైన యంత్ర సామాగ్రి, మానవ వనరులను నిర్మాణం చేపట్టిన సంస్థ ఇతర ప్రాంతాల నుండి రప్పించుకోవాలని నిర్మాణదారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. తద్వారా 24 గంటలు మూడు షిఫ్ట్‌లలో పనులు జరిగితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణ డిజైన్‌లను ఇతరత్రా భద్రత చర్యలను పర్యవేక్షించేందుకు గాను అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండాలని ఆయన ఆదేశించారు. అదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణంలో విధులు నిర్వహించే సిబ్బందికి అదనంగా 25 శాతం జీతాలను పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు.

నల్లగొండ జిల్లా సస్యశ్యామలం

ప్రారంభం నుంచే ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్న ఈ ప్రాజెక్టును గడువుకు ముందే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన నిర్లక్ష్యం తోటే ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆయన విమర్శించారు. ఎస్ఎల్‌బీసీ పూర్తి అయితే నల్లగొండ జిల్లా సస్యశ్యామలం కావడంతో పాటు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, సలహాదారు ఆదిత్యా నాథ్‌ దాస్, జాయింట్ సెక్రటరీ కే శ్రీనివాస్, సొరంగ నిపుణులు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, ఇంజినీర్ ఇన్ చీఫ్ అంజద్ హుస్సేన్, నీటిపారుదల రంగ సలహాదారు జనరల్ హరిపాల్ సింగ్ తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement