త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Student Wing Protest | మా రక్తంతో దప్పిక తీర్చుకో రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా బీఆర్ఎస్వీ తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. ఆ రక్తాన్ని సీఎంకు ఇచ్చేందుకు వెళ్తుండగా ఉద్రిక్తత.

J

Hyderabad | Published On Jul 13, 2026, 5.40 pm IST

BRS Student Wing Protest | మా రక్తంతో దప్పిక తీర్చుకో రేవంత్
Advertisement
  • పంటలకు బీఆర్ఎస్ నేతల రక్తం చల్లాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్వీ తీవ్ర ఆగ్రహం
  • సీఎం దప్పిక తీర్చేందుకంటూ తెలంగాణ భవన్‌లో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన నేతలు
  • రక్తపు ప్యాకెట్లతో సీఎం నివాసానికి బయలుదేరిన బీఆర్ఎస్వీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
  • తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పలువురు కీలక నేతల అరెస్ట్, పోలీస్ స్టేషన్లకు తరలింపు

BRS Student Wing Protest | త్రినేత్ర.న్యూస్ : పంటలకు బీఆర్ఎస్ నేతల రక్తం చల్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో (Telangana Politics) తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, ఆ రక్తాన్ని సీఎం ఇంటికి తీసుకెళ్లే క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సీఎం దప్పిక తీర్చేందుకే బ్లడ్ డొనేషన్ క్యాంప్

"మా రక్తంతోనైనా సీఎం దప్పిక తీర్చుకోవాలి" అంటూ బీఆర్ఎస్వీ నేతలు తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను (Blood donation camp) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ కె. సంజయ్, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, బాల్క సుమన్, కర్నె ప్రభాకర్‌తో పాటు బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు తుంగ బాలు, కడారి స్వామియాదవ్ తదితర నేతలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ వాడుతున్న హంతక భాషపై వారంతా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరసనలో భాగంగా దాదాపు 50 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు.

పోలీసుల ఎంట్రీ.. తోపులాట

రక్తదానం పూర్తయిన తర్వాత, సేకరించిన బ్లడ్ ప్యాకెట్లతో (Blood packets) బీఆర్ఎస్వీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లేందుకు బయలుదేరాయి. అయితే, ముందస్తు సమాచారంతో తెలంగాణ భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి (High tension) ఏర్పడింది.

పోలీస్ స్టేషన్లకు నేతల తరలింపు

పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు బలవంతంగా బీఆర్ఎస్వీ ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని రెండు ప్రత్యేక పోలీస్ వాహనాల్లో అంబర్‌పేట్, ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్లకు (Police stations) తరలించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, దానికి ప్రతిగా బీఆర్ఎస్ చేపట్టిన ఈ వినూత్న నిరసనతో నగరంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Advertisement
Advertisement