త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Leaders | 18న ఛ‌లో స‌రూర్‌న‌గ‌ర్‌.. నిరుద్యోగులు దండులా త‌ర‌లి రావాలి

BRS Leaders | ప్రియాంకా గాంధీ ఇచ్చిన హామీల‌పై ప్ర‌భుత్వ మెడ‌లు వంచేందుకు ఈనెల 18న ఛలో సరూర్‌నగర్‌కు పిలుపునిస్తున్న‌ట్లు బీఆర్ఎస్ నేత‌లు ప్ర‌క‌టించారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు.

S

Hyderabad | Published On Jul 13, 2026, 6.41 pm IST

BRS Leaders | 18న ఛ‌లో స‌రూర్‌న‌గ‌ర్‌.. నిరుద్యోగులు దండులా త‌ర‌లి రావాలి
Advertisement
  • ప్రియాంక హామీల‌పై ప్ర‌భుత్వ మెడ‌లు వంచేందుకే స‌భ పెడుతున్నం
  • యువ సంగ్రామ సదస్సు పోస్టర్ ఆవిష్కరణలో బీఆర్ఎస్ నేత‌ల పిలుపు

త్రినేత్ర‌.న్యూస్‌: ప్రియాంకా గాంధీ ఇచ్చిన హామీల‌పై ప్ర‌భుత్వ మెడ‌లు వంచేందుకు ఈనెల 18న ఛలో సరూర్‌నగర్‌కు పిలుపునిస్తున్న‌ట్లు బీఆర్ఎస్ నేత‌లు ప్ర‌క‌టించారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ స‌భ‌కు కేటీఆర్ హార‌వుతున్నార‌ని.. రాష్ట్రంలోని నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావాలి పిలుపునిచ్చారు. సోమ‌వారం యువ సంగ్రామ స‌ద‌స్సు పోస్ట‌ర్ల‌ను బీఆర్ఎస్ నేత‌లు మాజీ మంత్రులు త‌ల‌సాని శ్రీ‌నివాస్, సబితా ఇంద్రా రెడ్డి, యాద‌వ్‌, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడారు.

రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేశాం: తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే

ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, రైతులకు, మహిళలకు బేడీలు వేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అంతా 18వ తేదీన సరూర్‌నగర్ స‌భ‌కు రావాలి. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే. మేం అధికారంలో ఉన్నప్పుడు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసాం. రాష్ట్ర డీజీపీని అడుగుతున్నా.. సీఎం చేస్తున్న వాఖ్యలు నేరపూరితమైనవి కాదా? సీఎం చట్టానికి అతీతమా? ఛలో సరూర్‌నగర్‌కు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావాలి. ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి ఈ సభ ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది.

ఉరి వేసుకోవాల‌న్న‌ట్లు సీఎం మాట్లాడుతుండు: సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి

ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా.. నిరుద్యోగులు ఉరి వేసుకోండి అన్నట్ల సీఎం మాట్లాడుతుండు. నిరుద్యోగులను డిక్లరేషన్ పేరిట మోసం చేశారు. సరూర్‌నగర్‌లో జరిగే సభతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగాలను భర్తీ చేసేలా చేస్తాం. పోలీసు శాఖలో 20 వేలు, విద్యా శాఖలో 20 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లే ఇస్త‌లేరు. అయిన‌ప్ప‌టికీ మేం ఉద్యోగాలు ఇస్తామంటే నిరుద్యోగులే వొద్దు అంటున్నారని ముఖ్యమంత్రి అంటున్నాడు. బాధ్యత కలిగిన‌ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? నోటిఫికేషన్ ఇవ్వండి అంటే అరెస్ట్ చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు మద్దతుగా బీఆర్ఎస్‌ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టబోతోంది.

హామీలు గుర్తు చేసేందుకే స‌భ‌: శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ

ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ఏ రకంగా మోసం చేసిందో చూశాం. అన్ని వర్గాలను మోసం చేసినట్లే యువతను మోసం చేశారు. ప్రియాంక గాంధీతో సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ పేరుతో సభ పెట్టారు. యూత్ డిక్లరేషన్‌లో యువతకు అనేక హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు అయింది. అయినా యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఇదే గ్రౌండ్ నుంచి కాంగ్రెస్ హామీలు గుర్తు చేసే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు అవుతారు.

ప్రియాంక‌ క‌ళ్ల‌బొల్లి మాట‌లు చెప్పారు: దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే

ఈ నెల 18న సరూర్‌నగర్ స్టేడియంలో నిరుద్యోగులతో సభ ఏర్పాటు చేస్తున్నాం. బీఆర్ఎస్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 2023లో ప్రియాంక గాంధీ నిరుద్యోగులకు కళ్ల‌బొల్లి మాటలు చెప్పారు. విద్యార్థులకు ఫీజు రియింబ‌ర్స్‌మెంట్‌, నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వకుండ విస్మరిస్తుంది. యూత్ డిక్లరేషన్ పేరిట అనేక రకాలుగా వంచన చేసింది. అందుకే అదే గ్రౌండ్లో నిరుద్యోగుల తరుఫున పోరాటానికి బీఆర్ఎస్‌ సిద్ధమైంది.

Advertisement
Advertisement