త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kaleshwaram Project Barrages | ఆ మూడు బ్యారేజీల్లో నీళ్లు నింపితే కొట్టుకుపోవడమే..!

కాళేశ్వరం బ్యారేజీల్లో నీళ్లు నింపితే అవి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. దేవాదుల ప్రాజెక్టుపై ఆయన కీలక ప్రకటన చేశారు.

J

Telangana | Published On Jul 13, 2026, 6.25 pm IST

Kaleshwaram Project Barrages | ఆ మూడు బ్యారేజీల్లో నీళ్లు నింపితే కొట్టుకుపోవడమే..!

సంక్షిప్త సారాంశం

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ప్రస్తుతం నీళ్లు నింపడం అత్యంత ప్రమాదకరమని డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సంపూర్ణంగా రిపేర్లు పూర్తయ్యే వరకు ఆ బ్యారేజీల గేట్లు మూసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనుల కోసం తక్షణమే రూ.146 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చని ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మంత్రులు మండిపడ్డారు.

Advertisement
  • విపక్షాలవి గాలి మాటలు
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • దేవాదుల ప్రాజెక్ట్ పెండింగ్ పనుల కోసం రూ.146 కోట్ల నిధులు విడుదల

Kaleshwaram Project Barrages | త్రినేత్ర.న్యూస్ : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో (Barrages) ప్రస్తుత పరిస్థితుల్లో నీళ్లు నింపితే అవి పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఆయన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల, సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) ప్రాజెక్టులను పరిశీలించారు.

ప్రమాదపు అంచున కాళేశ్వరం బ్యారేజీలు

బ్యారేజీల్లో నీళ్లు నింపడం ప్రస్తుతానికి అత్యంత ప్రమాదకరమని జాతీయ డ్యామ్ సేఫ్టీ అధికారులు (National Dam Safety Authority), సీడబ్ల్యూసీ (CWC) హెచ్చరించాయని భట్టి తెలిపారు. కాబట్టి, సంపూర్ణంగా రిపేర్లు (Repairs) పూర్తయ్యే వరకు గేట్లు మూసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. కన్నెపల్లి పంప్ హౌస్ (Pump house) నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చని ప్రతిపక్షాలు 'గోబెల్స్ ప్రచారం' చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. నీటిని లిఫ్ట్ చేయాలంటే మేడిగడ్డలో 5, అన్నారంలో 10, సుందిళ్లలో 8 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని.. పంపుల లెవెల్స్ అందుకోవాలంటే గేట్లు మూయాలని, కానీ అలా చేస్తే బ్యారేజీలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. గత పాలకుల అవినీతి, అనాలోచిత నిర్ణయాల వల్లే మూడేళ్లకే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు.

దేవాదులకు నిధుల వరద

దేవాదుల ప్రాజెక్ట్ పెండింగ్ పనుల కోసం తక్షణమే రూ.146 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు భట్టి ప్రకటించారు. ఇందులో భూసేకరణకు రూ.58 కోట్లు, వర్క్స్ కోసం రూ.74 కోట్లు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (O&M) కోసం రూ.14 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే పెండింగ్ లో ఉన్న రూ.194 కోట్ల బిల్లులను కూడా వెంటనే విడుదల చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

ఎల్‌నినోను ఎదుర్కొనేలా యాక్షన్ ప్లాన్

ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో (El Nino) ప్రభావం పొంచి ఉన్న నేపథ్యంలో, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ముందుగానే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పక్కా యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తోందని మంత్రులు చెప్పారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితిలో మొత్తం 22 రిజర్వాయర్లను (Reservoirs) పూర్తిస్థాయిలో నింపుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేవాదులలో ఉన్న 10 పంపుల్లో ఇప్పటికే 7 పనిచేస్తున్నాయని, మరో ఒకటి రెండు రోజుల్లో మొత్తం 10 పంపులను నిరంతరాయంగా నడుపుతూ దేవాదుల కింద ఉన్న 12 జిల్లాలకు నీరందిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందిస్తామని వారు భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement