త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lipfendra | అధిక కొలెస్ట్రాల్ బాధితుల‌కు శుభ‌వార్త‌.. ఇంజెక్ష‌న్‌కు బ‌దులుగా టాబ్లెట్‌..

Lipfendra | గుండె జబ్బులు, స్ట్రోక్స్‌కు ప్రధాన ప్రమాద కారకాలలో అధిక కొలెస్ట్రాల్ ఒకటిగా మారింది. గత కొన్ని దశాబ్దాలుగా అధిక కొలెస్ట్రాల్ చికిత్సలో స్టాటిన్స్ ఔషధాల‌నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇవి ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ప్రయోజనం ఇవ్వవు. కొందరిలో కండరాల నొప్పి వంటి దుష్ప్రభావాలు కనిపించడం వల్ల చికిత్సను కొనసాగించడం కూడా కష్టమవుతోంది.

S

Health | Published On Jul 18, 2026, 1.15 pm IST

Lipfendra | అధిక కొలెస్ట్రాల్ బాధితుల‌కు శుభ‌వార్త‌.. ఇంజెక్ష‌న్‌కు బ‌దులుగా టాబ్లెట్‌..
Advertisement

Lipfendra | గుండె జబ్బులు, స్ట్రోక్స్‌కు ప్రధాన ప్రమాద కారకాలలో అధిక కొలెస్ట్రాల్ ఒకటిగా మారింది. గత కొన్ని దశాబ్దాలుగా అధిక కొలెస్ట్రాల్ చికిత్సలో స్టాటిన్స్ ఔషధాల‌నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇవి ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ప్రయోజనం ఇవ్వవు. కొందరిలో కండరాల నొప్పి వంటి దుష్ప్రభావాలు కనిపించడం వల్ల చికిత్సను కొనసాగించడం కూడా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) లిప్‌ఫెండ్రా (ఎన్‌లిసిటైడ్) అనే తొలి మౌఖిక పీసీఎస్‌కే9 ఇన్హిబిటర్‌కు ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు పీసీఎస్‌కే9 ఔషధాలు ఇంజెక్షన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే లిప్‌ఫెండ్రా రోజుకు ఒక్కసారి తీసుకునే టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారు, అలాగే వారసత్వంగా వచ్చే హెటెరోజైగస్ ఫ్యామిలియల్ హైపర్‌కొలెస్టెరోలీమియా (హెచ్‌ఈఎఫ్‌హెచ్) ఉన్నవారికి ఇది కొత్త చికిత్సా ఎంపికగా మార‌నుంది.

లిప్‌ఫెండ్రా అంటే..

లిప్‌ఫెండ్రా అంటే శరీరంలో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు రూపొందించిన ప్రిస్క్రిప్షన్ ఔషధం. ఎల్‌డీఎల్‌ను సాధారణంగా చెడు కొలెస్ట్రాల్‌గా పిలుస్తారు. అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్య‌క్తులు, అలాగే హెచ్‌ఈఎఫ్‌హెచ్ వంటి వారసత్వ వ్యాధి కారణంగా చాలా ఎక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నవారికి ఎఫ్‌డీఏ ఈ మందును ఆమోదించింది. ఈ టాబ్లెట్‌ను రోజుకు ఒకసారి నోటి ద్వారా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతోపాటు దీనిని ఉపయోగించాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో స్టాటిన్స్‌తో కలిసి ఈ మందును వైద్యులు సూచించే అవకాశం ఉంటుంది. అంటే ఇది స్టాటిన్స్‌కు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాదు. స్టాటిన్స్ కాలేయంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అయితే లిప్‌ఫెండ్రా మాత్రం పీసీఎస్‌కే9 అనే ప్రోటీన్‌పై పనిచేస్తుంది. ఈ ప్రోటీన్ రక్తంలోని ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను శరీరం ఎంత సమర్థవంతంగా తొలగిస్తుందో ప్రభావితం చేస్తుంది.

కొలెస్ట్రాల్‌ను అధికంగా త‌గ్గించే లివ‌ర్‌..

సాధారణంగా పీసీఎస్‌కే9 కాలేయ కణాల్లో ఉండే ఎల్‌డీఎల్ రిసెప్టర్ల సంఖ్యను తగ్గిస్తుంది. ఈ రిసెప్టర్లు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. లిప్‌ఫెండ్రా పీసీఎస్‌కే9 చర్యను అడ్డుకోవడం ద్వారా ఎక్కువ ఎల్‌డీఎల్ రిసెప్టర్లు పనిచేసేలా చేస్తుంది. దీంతో కాలేయం మరింత ఎక్కువ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను తొలగించి, రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ విధానాన్ని ఇప్పటికే ఇంజెక్షన్ రూపంలోని పీసీఎస్‌కే9 ఔషధాల్లో విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇదే విధానాన్ని టాబ్లెట్ రూపంలో అందించిన తొలి ఔష‌ధం లిప్‌ఫెండ్రానే కావ‌డం విశేషం. ఇక క్లినికల్ అధ్యయనాల్లో లిప్‌ఫెండ్రా ఆస‌క్తిక‌ర‌మైన ఫలితాలను చూపించింది. ఈ మందు తీసుకున్న రోగుల్లో సుమారు ఆరు నెలల చికిత్స తర్వాత ప్లాసీబోతో పోలిస్తే ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ సగటున దాదాపు 60 శాతం వరకు తగ్గింది. దీర్ఘకాల ఫాలోఅప్‌లో కూడా ఈ ఫలితాలు కొనసాగినట్లు పరిశోధనలు వెల్లడించాయి. దీర్ఘకాలికంగా కొలెస్ట్రాల్ నియంత్రణకు ఇది ఆశాజనకంగా నిలుస్తుంద‌ని నిపుణులు భావిస్తున్నారు.

స్టాటిన్స్ క‌న్నా ఎక్కువ ప్ర‌భావం..

కాగా స్టాటిన్స్ మందుల‌తో చాలా మందికి త‌గ్గే కొలెస్ట్రాల్ స్థాయి క‌న్నా ఈ మందుతోనే ఇంకా ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ త‌గ్గిన‌ట్లు గుర్తించారు. అయితే స్టాటిన్స్ తీసుకున్నప్పటికీ కొలెస్ట్రాల్ నియంత్రణలోకి రాని వారు లేదా ఇతర చికిత్సలను తట్టుకోలేని వారి కోసం ఈ మందును ప్రధానంగా ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక లిప్‌ఫెండ్రా పూర్తిగా భిన్నమైన విధానంలో పనిచేస్తుంది కాబట్టి, చాలా సందర్భాల్లో స్టాటిన్స్‌తో పోలిస్తే ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను మరింతగా తగ్గించగలుగుతుంది. అయితే దీన‌ర్థం స్టాటిన్స్ ప్రాధాన్యం తగ్గిపోయిందని కాదు. స్టాటిన్స్‌పై ఎన్నో సంవత్సరాలుగా విస్తృత పరిశోధనలు జరిగాయి. అవి తక్కువ ఖర్చుతో లభిస్తాయి. అలాగే గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని ఇప్పటికే నిరూపితమైంది. అందువల్ల వైద్యులు ఇప్పటికీ మొదటి చికిత్సగా స్టాటిన్స్‌కే ప్రాధాన్యం ఇస్తారు. లిప్‌ఫెండ్రా ప్రధానంగా స్టాటిన్స్‌తోపాటు అదనపు చికిత్సగా లేదా లక్ష్య స్థాయికి కొలెస్ట్రాల్ తగ్గని వారికి ఉపయోగించే అవకాశం ఉంటుంది. అంటే చాలా మంది రోగుల విషయంలో లిప్‌ఫెండ్రా స్టాటిన్స్‌కు ప్రత్యామ్నాయం కాకుండా, వాటికి తోడ్పడే ఔషధంగా ఉపయోగపడుతుంద‌న్న‌మాట‌.

ఇంజెక్ష‌న్ల‌కు బ‌దులుగా టాబ్లెట్‌..

స్టాటిన్స్ తీసుకున్నప్పటికీ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అధికంగానే ఉండేవారికి, హెచ్‌ఈఎఫ్‌హెచ్ వంటి వారసత్వ కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి, ఇంజెక్షన్ రూపంలోని పీసీఎస్‌కే9 మందులకు బదులుగా ప్రత్యామ్నాయం కోరుకునేవారికి, తరచూ ఇంజెక్షన్లు తీసుకోవడం కంటే రోజుకు ఒక్క టాబ్లెట్ తీసుకోవడాన్ని ఇష్టపడేవారికి లిప్‌ఫెండ్రా ఉపయోగకరంగా ఉంటుంది. వ్యక్తిగత వైద్య చరిత్ర, కొలెస్ట్రాల్ స్థాయిలు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పరిశీలించిన తర్వాతే ఈ మందు సరిపోతుందో లేదో వైద్యులు నిర్ణయిస్తారు. కాగా క్లినికల్ ట్రయల్స్ ప్రకారం లిప్‌ఫెండ్రాను చాలా మంది బాగా తట్టుకున్నారు. కొందరిలో విరేచనాలు, తల తిరగడం వంటి స్వల్ప దుష్ప్రభావాలు మాత్రమే కనిపించాయి. ఇవి ప్లాసీబో తీసుకున్న వారిలో కనిపించిన స్థాయికి సమానంగానే ఉన్నాయని పరిశోధనలు తెలిపాయి. వైద్యుల సూచనల ప్రకారం ఈ టాబ్లెట్‌ను ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఉత్తమ ఫలితాల కోసం వైద్యులు సూచించిన విధంగానే మందును వాడాలని నిపుణులు చెబుతున్నారు. లిప్‌ఫెండ్రా కొలెస్ట్రాల్‌ను సమర్థవంతంగా తగ్గిస్తున్నప్పటికీ, దీర్ఘకాలంలో గుండెపోటు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధిత ఘటనలను ఎంతవరకు తగ్గిస్తుందో ఇప్పుడే నిర్దారించ‌లేమ‌ని, ఇందుకు మ‌రిన్ని ప‌రిశోధ‌నలు అవ‌స‌ర‌మ‌ని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement