Telangana ACB | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో అవినీతి తిమింగలాల వేటలో ఏసీబీ అధికారులు ఈ ఏడాది దూకుడు పెంచారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యులను ఇబ్బంది పెడుతూ లంచాలకు అలవాటు పడిన అధికారుల భరతం పట్టడంలో అధికారులు ఈ ఏడాది సరికొత్త రికార్డులను సృష్టించారు. 2025లో రాష్ట్రవ్యాప్తంగా 199 ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో మొత్తం 273 మంది నిందితులను అరెస్టు చేశారు. ముఖ్యంగా ఇరిగేషన్, రెవెన్యూ శాఖల్లోనే లంచం కేసులు ఎక్కువగా వెలుగుచూశాయి. 157 ట్రాప్ కేసుల్లో 224 మంది అరెస్ట్ చేయగా, వీరిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు. 15 అక్రమ ఆస్తుల కేసుల్లో రూ.96.13 కోట్లను ఏసీబీ వెలికి తీసింది. 54 ఆకస్మిక తనిఖీలు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీఏ చెక్ పోస్టులపై దాడులు నిర్వహించారు. 115 మందిపై కేసులు పెట్టేందుకు ప్రభుత్వ అనుమతులు పొందింది ఏసీబీ. 2025లో ట్రాప్ కేసుల్లో రూ.57.17 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బాధితులకు రూ.35.89 లక్షలు తిరిగి చెల్లించారు. డిసెంబర్ 3 నుంచి 9 వరకు అవినీతి నిరోధక వారోత్సవాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ వారోత్సవాలను ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా ఆధ్వర్యంలో కొనసాగాయి. అవినీతి ఫిర్యాదుల కోసం QR కోడ్ కంప్లైంట్ సిస్టమ్ ప్రారంభించినట్లు తెలిపారు. దూర ప్రాంతాల ప్రజలకు సులభంగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ డీజీ స్పష్టం చేశారు. వాట్సాప్ నెంబర్: 9440446106, ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్) ద్వారా కూడా ఫిర్యాదు అవకాశం