త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | సెన్సెక్స్ 773 పాయింట్లు జంప్.. 25,250 దాటిన నిఫ్టీ..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు నవంబర్ ర్యాలీని కొనసాగిస్తూ బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 772.75 పాయింట్లు పెరిగి 81,879.40 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 210.40 పాయింట్లు లాభపడి 25,255.05 వద్ద ముగిసింది. విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు, ముడి చమురు ధరలు తగ్గడం, దేశీయ డిమాండ్ బలంగా ఉండడం మార్కెట్లకు ప్రధానంగా అండగా నిలిచాయి.

S

Business | Published On Nov 11, 2026, 4.21 pm IST

Stock Markets | సెన్సెక్స్ 773 పాయింట్లు జంప్.. 25,250 దాటిన నిఫ్టీ..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు నవంబర్ ర్యాలీని కొనసాగిస్తూ బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 772.75 పాయింట్లు పెరిగి 81,879.40 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 210.40 పాయింట్లు లాభపడి 25,255.05 వద్ద ముగిసింది. విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు, ముడి చమురు ధరలు తగ్గడం, దేశీయ డిమాండ్ బలంగా ఉండడం మార్కెట్లకు ప్రధానంగా అండగా నిలిచాయి.

భారీ లాభాల్లో సూచీలు..

భారత స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 772.75 పాయింట్లు (0.95 శాతం) పెరిగి 81,879.40 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 210.40 పాయింట్లు (0.84 శాతం) లాభపడి 25,255.05 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ ఉదయం 82,248.68 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 82,520.40 గరిష్ఠ స్థాయిని, 81,417.39 కనిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టీ 25,337.80 వద్ద ప్రారంభమై 25,424.35 గరిష్ఠ స్థాయికి చేరింది. ఆటోమొబైల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, కెమికల్స్, మెటల్స్, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ షేర్లలో మహీంద్రా అండ్ మహీంద్రా 5.25 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలవగా, ఇండిగో 4.37 శాతం, ట్రెంట్ 3.02 శాతం, టాటా స్టీల్ 2.22 శాతం, ఐటీసీ 2.15 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.14 శాతం లాభపడ్డాయి. మరోవైపు అదానీ పోర్ట్స్ 1.66 శాతం, టెక్ మహీంద్రా 1.29 శాతం నష్టపోయాయి.

బ్యాంకింగ్ షేర్ల‌లో ర్యాలీ..

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 2.94 శాతం పెరిగి 9,167.20 వద్ద ముగిసి అగ్రస్థానంలో నిలిచింది. నిఫ్టీ ఆటో 2.14 శాతం, నిఫ్టీ కెమికల్స్ 2.10 శాతం, నిఫ్టీ బ్యాంక్ 1.76 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 1.14 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.13 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మెటల్ 0.96 శాతం, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.03 శాతం పెరిగాయి. అయితే నిఫ్టీ ఐటీ 0.53 శాతం, నిఫ్టీ ఫార్మా 0.41 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.42 శాతం నష్టపోయాయి. విస్తృత మార్కెట్లలోనూ కొనుగోళ్ల జోరు కనిపించింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 1.61 శాతం, స్మాల్‌క్యాప్ 50 సూచీ 1.47 శాతం, మైక్రోక్యాప్ 250 సూచీ 1.92 శాతం పెరిగాయి. మిడ్‌క్యాప్ సూచీలు కూడా లాభాలతో ముగిశాయి.

కొన‌సాగుతున్న విదేశీ పెట్టుబ‌డులు..

మార్కెట్ల ర్యాలీకి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్లు ప్రధాన కారణంగా నిలిచాయి. నవంబర్ 2 నుంచి 9 వరకు వరుసగా ఆరు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్లో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఈ సమయంలో రూ.53,171.99 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఇదే సమయంలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.32,069.36 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర రెండు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయి బ్యారెల్‌కు 89.16 డాలర్లకు చేరింది. అమెరికా అధికారులు ఇరాన్‌పై అదనపు సైనిక చర్యల అవకాశాలను తగ్గించి మాట్లాడడంతో చమురు సరఫరాపై ఆందోళనలు కొంత తగ్గాయి. అయితే బుధవారం ధర తిరిగి 92.40 డాలర్ల స్థాయికి చేరింది. భారత్ అధికంగా చమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ధరలు తగ్గడం దిగుమతి బిల్లు, ద్రవ్యోల్బణం, రూపాయిపై ఒత్తిడిని తగ్గించేందుకు దోహదపడుతుంది. కృత్రిమ మేధ ఆధారిత పెట్టుబడులపై ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ధోరణులు, దేశీయ వినియోగ డిమాండ్ పటిష్టంగా ఉండడం, ఈక్విటీ పన్నుల్లో తగ్గింపుపై అంచనాలు కూడా విదేశీ పెట్టుబడుల ప్రవాహానికి మద్దతునిస్తాయ‌ని జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది.

Advertisement
Advertisement