త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nifty 50 | నిఫ్టీ 28,000కు చేరుతుందా? మూడు అంతర్జాతీయ బ్రోకరేజీల అంచనాలివే!

Nifty 50 | భారత స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న ర్యాలీ నేపథ్యంలో నిఫ్టీ 50 మరింత పెరిగే అవకాశాలున్నాయని మూడు ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. సిటీ గ్రూప్ అత్యంత ఆశావహంగా 2027 డిసెంబర్ నాటికి నిఫ్టీ 28,000కు చేరుతుంద‌ని పేర్కొంది. బెర్న్‌స్టీన్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి 26,100, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఈ ఏడాది చివరినాటికి 26,200 లక్ష్యాన్ని కొనసాగిస్తున్నాయి.

S

Business | Published On Nov 11, 2026, 1.45 pm IST

Nifty 50 | నిఫ్టీ 28,000కు చేరుతుందా? మూడు అంతర్జాతీయ బ్రోకరేజీల అంచనాలివే!
Advertisement

Nifty 50 | భారత స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న ర్యాలీ నేపథ్యంలో నిఫ్టీ 50 మరింత పెరిగే అవకాశాలున్నాయని మూడు ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. సిటీ గ్రూప్ అత్యంత ఆశావహంగా 2027 డిసెంబర్ నాటికి నిఫ్టీ 28,000కు చేరుతుంద‌ని పేర్కొంది. బెర్న్‌స్టీన్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి 26,100, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఈ ఏడాది చివరినాటికి 26,200 లక్ష్యాన్ని కొనసాగిస్తున్నాయి.

నిఫ్టీ @28000..?

నవంబర్‌లో ఇప్పటివరకు నిఫ్టీ 50 దాదాపు 11 శాతం ర్యాలీ చేసి బుధవారం 25,400 మార్కును దాటింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ప్రవాహం పెరగడం, సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మార్కెట్లకు సానుకూలంగా మారాయి. ఈ నేపథ్యంలో సిటీ గ్రూప్ గతంలో ప్రకటించిన 26,000 లక్ష్యాన్ని 28,000కు పెంచింది. ప్రస్తుత స్థాయిల నుంచి సుమారు 12 శాతం వృద్ధి ఉంటుంద‌ని అంచనా వేసింది. నిఫ్టీ వాల్యుయేషన్‌ను 17 నుంచి 18 రెట్లకు పెంచడంతోపాటు పెట్టుబడి అంచనా గడువును 2027 డిసెంబర్ వరకు పొడిగించింది. బలమైన రెండో త్రైమాసిక ఫలితాలు, ముడి చమురు ధరల తగ్గుదల, కృత్రిమ మేధ రంగంలో మూలధన వ్యయ వృద్ధి మందగించడం, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం మెరుగుపడడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది.

2026-27 నుంచి 2027-28 ఆర్థిక సంవత్సరాల మధ్య భారతీయ కంపెనీల ఆదాయాలు ఏటా 15 నుంచి 16 శాతం వృద్ధి చెందుతాయ‌ని అంచనా వేసింది. ముడి చమురు ధర బ్యారెల్‌కు 10 డాలర్లు తగ్గితే భారత కరెంట్ అకౌంట్ లోటు 30 నుంచి 40 బేసిస్ పాయింట్లు మెరుగుపడడంతోపాటు ద్రవ్యోల్బణం 50 బేసిస్ పాయింట్లు తగ్గుతుంద‌ని తెలిపింది. దీనివల్ల నిఫ్టీ షేర్ల ఆదాయ అంచనాలు సుమారు 2 శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. 25 శాతానికి పైగా వృద్ధి అవకాశాలు, బలమైన కేటాయింపుల నిధుల కారణంగా బజాజ్ ఫైనాన్స్‌ను తన టాప్ పిక్స్‌లో చేర్చింది.

బెర్న్‌స్టీన్ ప్ర‌కారం ల‌క్ష్యం ఎంత‌..?

బెర్న్‌స్టీన్ సంస్థ కూడా నిఫ్టీ లక్ష్యాన్ని 25,000 నుంచి 26,100కు పెంచింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ స్థాయికి చేరుతుంద‌ని అంచనా వేసింది. 2027-28 ఆర్థిక సంవత్సరం ఆదాయ అంచనాల ఆధారంగా నిఫ్టీ విలువను 18.5 రెట్లుగా లెక్కించింది. సమీప కాలానికి ట్రేడింగ్ బై రేటింగ్‌ను కొనసాగించినప్పటికీ, రాబోయే 12 నెలల భారత ఈక్విటీ మార్కెట్లపై న్యూట్రల్ వైఖరిని కొనసాగించింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గడం, ముడి చమురు ధరలు నియంత్రణలోకి రావడం, బాండ్ ఈల్డ్స్ తగ్గడం, పెట్టుబడుల ప్రవాహం మెరుగుపడడం మార్కెట్ ర్యాలీకి దోహదం చేస్తాయ‌ని అభిప్రాయపడింది. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిఫ్టీ 50 కంపెనీల ఆదాయ వృద్ధి 20 శాతంగా నమోదవడాన్ని సానుకూల అంశంగా పేర్కొంది. అయితే అధిక వాల్యుయేషన్లు, బలహీనమైన డిమాండ్, కంపెనీల ఆదాయ అంచనాల్లో పరిమిత పెరుగుదల దీర్ఘకాలిక ర్యాలీకి అడ్డంకిగా మారుతాయ‌ని హెచ్చరించింది.

బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్ర‌కారం..

మరోవైపు బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ నిఫ్టీ 50 లక్ష్యాన్ని ఈ ఏడాది చివరినాటికి 26,200 వద్ద కొనసాగించింది. ప్రస్తుత స్థాయిల నుంచి సుమారు 4.7 శాతం పెరుగుదలకు అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రధాన రిస్కులు ఇప్పటికే మార్కెట్ వాల్యుయేషన్లలో ప్రతిబింబిస్తున్నాయని, కంపెనీల ఆదాయ వృద్ధి మెరుగుపడడం మరింత లాభాలకు తోడ్పడుతుంద‌ని తెలిపింది. 2026-27 నాలుగో త్రైమాసికంలో నమోదైన 5 శాతం ఆదాయ వృద్ధితో పోలిస్తే రెండో త్రైమాసికంలో అది 18 శాతానికి చేరుతుంద‌ని అంచనా వేసింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో ఆదాయ అంచనాల సవరణలు బలహీనంగా ఉండడం, చిన్న కంపెనీలపై ఒత్తిడి ఉండే అవకాశాల నేపథ్యంలో లార్జ్‌క్యాప్ షేర్లకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆసుపత్రులు, టెలికాం రంగాలపై సానుకూల వైఖరిని అవలంబిస్తూ, టూ వీలర్ రంగంపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మెరుగైన కంపెనీల ఆదాయాలు, తగ్గుతున్న ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం మార్కెట్లకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ, భౌగోళిక రాజకీయ పరిణామాలు, చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, ఎల్‌నినో ప్రభావం, కృత్రిమ మేధ వల్ల సంప్రదాయ వ్యాపార రంగాలకు ఎదురయ్యే సవాళ్లు మార్కెట్లలో మధ్యమధ్యలో ఒడిదుడుకులకు కారణం అవుతాయ‌ని బ్రోకరేజీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

Advertisement
Advertisement