త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | భ‌ట్టి గారూ.. రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవ్‌

Harish Rao | అప్పుల విషయంలో భట్టి విక్రమార్క నిన్న అబద్దాలు, అర్ధ‌ సత్యాలు చెప్పి మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేశార‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవని భ‌ట్టికి చుర‌క‌లంటించారు. అసెంబ్లీలో చెప్పిన దానికి ఇప్పటికీ, ఎప్పటికీ కట్టుబడి ఉంటానన్నారు.

S

Flash news | Published On Jul 4, 2026, 7.56 pm IST

Harish Rao | భ‌ట్టి గారూ.. రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవ్‌
Advertisement
  • బీఆర్ఎస్ చేసిన అప్పు రూ.8,21,651 కోట్లు అని మల్లా అదే కట్టుకథ చెప్పిండు
  • మేం అప్పుల విషయంలో క్లిస్టర్ క్లియర్‌గా ఉన్నం
  • బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.17లక్షల కోట్లే
  • మాది ఎక్క‌డైనా ఒక్క‌టే మాట‌
  • పెట్టండి అసెంబ్లీ.. మాట్లాడుదాం
  • భ‌ట్టి నిగ్గు తేల్చిన మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: అప్పుల విషయంలో భట్టి విక్రమార్క నిన్న అబద్దాలు, అర్ధ‌ సత్యాలు చెప్పి మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేశార‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవని భ‌ట్టికి చుర‌క‌లంటించారు. బీఆర్ఎస్ చేసిన అప్పు 4.17లక్షల కోట్లేన‌ని.. అసెంబ్లీలో చెప్పిన దానికి ఇప్పటికీ, ఎప్పటికీ కట్టుబడి ఉంటానన్నారు. ఇది మా స్టాండ్ అని దీని మీద ఎక్కడ, ఎప్పుడు చర్చకైనా సిద్ధ‌మని చెబుతున్నా అని హ‌రీశ్ పేర్కొన్నారు. శ‌నివారం తెలంగాణ భ‌వన్‌లో ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ భ‌ట్టి, కాంగ్రెస్ స‌ర్కార్‌పై ఫైర‌య్యారు.

తప్పుడు లెక్కలు వండి వార్చారు..

భట్టి గారు చాలా సీనియర్ నాయకులు, ఆర్థిక మంత్రి. వారికి అప్పుల విషయంలో వాస్తవాలు తెలియవని నేను అనుకోను. తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారు. లేని అప్పులను ఉన్నట్లుగా చూపి గోబెల్స్ ప్రచారానికి పాల్పడ్డారు. అప్పుల విషయంలో మంత్రి జూపల్లి సవాళ్లు చేసి తోక ముడిచిన తీరును యావత్ తెలంగాణ సమాజం చూసింది. ఆ అవమానం నుంచి ఎలాగైనా బయటపడాలనే భావనతో, ఆత్మరక్షణలో భాగంగా భట్టి అప్పులపై తప్పుడు లెక్కలు వండి వార్చారు. మేం అప్పుల విషయంలో క్లిస్టర్ క్లియర్‌గా ఉన్నం. వాళ్ల లాగా పూటకో మాట చెప్పడం, ఇష్టం ఉన్నట్లు లెక్కలు చెప్పడం లేదు. మాది అసెంబ్లీలో ఒకటే మాట, బహిరంగ సమావేశాల్లో ఒకటే మాట‌, ప్రెస్ మీట్లలో ఒకటే మాట అని త‌న మార్క్‌ను చాటుకున్నారు.

మీ అపారమైన అనుభవం ఏమైంది?

నేను ఈరోజు మల్లా ఒకసారి భట్టికి, రేవంత్ రెడ్డికి, మంత్రులందరికి, ప్రజలందరికీ ఆధారాలతో సహా అప్పుల విషయంలో స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. ఆదాయాలు సమకూర్చుకోవడంలో అపారమైన అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీకి అప్పులు పెద్ద సమస్య కాదు అన్నరు భట్టి. భ‌ట్టి గారు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా.. మీ అపారమైన అనుభవం ఏమైంది? మేనిఫెస్టోలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు? అప్పులు అప్పులు.. అంటూ ఎందుకు కుంటి సాకులు, సొల్లు పురాణం చెబుతున్నరు? అని హ‌రీశ్‌రావు ఎద్దేవా చేశారు.

మీ బిల్డప్ అంతా ఉత్తదే అని అర్థ‌మైంది..

కరోనా వచ్చినా ఎకానమీ డౌన్ అయినా కేసీఆర్ ఏనాడూ రాష్ట్రం దివాళా తీసింది అనలేదు. మరి ఇప్పుడు కరోనా లేదు, పెద్ద నోట్ల రద్దు లేదు. మీ ముఖ్యమంత్రి ఎందుకు దివాళా దివాళా అని మాట్లాడుతున్నరు? న‌న్నెవ‌రూ న‌మ్ముత‌లేరు, అప్పు పుడ‌త‌లేదు.. అపాయింట్‌మెంట్ దొర‌క‌ట్లేదు.. దొంగ‌ను చూసిన‌ట్టు చూస్తున్నారు.. అని రేవంత్ రెడ్డి ఎందుకు దిగజారి మాట్లాడుతున్నడు. అంటే పాలనలో మీ ముఖ్యమంత్రి, మీ ప్రభుత్వం అట్టర్ ప్లాఫ్‌ అయ్యారని ఒప్పకుంటున్నారా? మీది అస‌మ‌ర్థ ప్రభుత్వం, చేత‌గాని ప్రభుత్వం. ప‌నికిరాని ద‌క్ష‌త లేని పాల‌న అని ఒప్పుకుంటున్నారా? మీ బిల్డప్ అంతా ఉత్తదే అని రెండున్నరేండ్ల పాలనలోనే అర్థమైంది అని ధ్వ‌జ‌మెత్తారు.

మీ అపారమైన అనుభవం కమీషన్లు దండుకోవడానికి తప్ప రాష్ట్ర అభివృద్దికి ఉపయోగపడలేదు. ఎన్నికల సమయంలో అది చేస్తం, ఇది చేస్తం అని చెప్పి అధికారంలోకి వచ్చాక సాకులు చెబుతున్నరు. డైవర్షన్ డ్రామాలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నరు. నమ్మించి నయవంచన చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అని మాజీ మంత్రి అన్నారు.

నిన్న భట్టి హడావుడిగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అప్పుల విషయంలో అర్థరహితంగా మాట్లాడిండు. ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఉండి కూడా చూసుకోకుండా ఎవరో తయారు చేసిన నోట్ చదివిండు. అట్ల అబద్దాలు మాట్లాడొచ్చునా? పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.8,21,651 కోట్లు అని మల్లా అదే కట్టుకథ చెప్పిండు. నేను లేనిది చెప్పడం లేదు. కొత్త డ్యాక్యుమెంట్లు చూపడం లేదు. నిన్న మీడియా సాక్షిగా భట్టి చూపిన డాక్యుమెంట్‌నే చూపించి చెబుతున్నా. ఎంత‌ కంఫర్ట్‌గా ఇది తయారు చేసుకున్నరో ఒకసారి వివరిస్తా...

2-06-2014 నాటికి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న FRBM రుణాలు, SPVs గ్యారంటీ రుణాలు (Government Guaranteed Loans) మొత్తం కలిపి రూ.84, 268 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో చూపారు. 2023, డిసెంబర్ 7 నుంచి 2024, మార్చి 31 వరకు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న FRBM రుణాలు రూ.15,118 కోట్లు. దీన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పుల్లో కలిపారు. (ఆర్బీఐ రిపోర్టు ఆధారం) అంటే రూ.84,268 కోట్లు + రూ.15,118 కోట్లు = రూ.99,386 కోట్లు. ఈ మొత్తాన్ని 7-12-2023 నాటికి ప్రభుత్వంపై ఉన్న మొత్తం బకాయిలు రూ.5,16,881 కోట్ల నుంచి తీసివేస్తే... రూ.5,16,881 కోట్లు − రూ.99,386 కోట్లు = రూ.4,17,495 కోట్లు. ఇదే నేను చెప్పిన లెక్క. మీ డాక్యుమెంట్ ప్రకారమే చెబుతున్నా? ఎన్ని కలిపినా వాళ్లు చెప్పిన రూ.8,21,651 కోట్లు నిండటం లేదని అందులో ఏమేం కలిపారో మీరే చూడండి అని అప్పుల లెక్క‌ల‌ను తేట‌తెల్లం చేశారు.

ప్రభుత్వం గ్యారెంటీ ఉండి, కార్పోరేషన్లు చెల్లించేవి, ప్రభుత్వం గ్యారెంటీ లేకుండా కార్పోరేషన్లే చెల్లించేవి కలిపారు. నిజానికి ఈ రుణాలు వాటికవే చెల్లిస్తాయి. మేం చెబుతున్నది మా సొంత లెక్కలు కావు. నిన్న భట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన డాక్యుమెంట్ ఆధారంగానే వివరిస్తున్నా. ఆర్బీఐ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్‌లోనే ఉంటది ఎవరైనా తెలంగాణ అప్పులు ఎంత తెచ్చిందో చూడొచ్చు. ఇదే కాదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు గురించి కాగ్ రిపోర్టు కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.

2024, మార్చి నాటికి ప్రభుత్వమే చెల్లించే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ 1,20,944 కోట్లు. ఇందులో భట్టి చెప్పిన డాక్యుమెంట్‌లో 2.06.2014 నాటికి ఉన్న ప్రభుత్వం చెల్లించే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూ.11,609 కోట్లు తీస్తే రూ.1,09,335 కోట్లు ఉంటుంది. తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ 2025–26 14వ పేజీలో చెప్పిన దాని ప్రకారం బీఆర్ఎస్ ప్రభుత్వం FRBM పరిధిలో తీసుకున్న రుణాలు 3,01,484 కోట్లు. అంటే 3,01,484 కోట్లు + 1,09,335 కోట్లు = 4,10,819 కోట్లు. ఇది మేం చెబుతున్న లెక్క కాదు కాగ్ చెబుతున్న లెక్క. మిషన్ భగీరథ, కాళేశ్వరం, సీతారామ, స్కీంలకు సంబంధించి.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల రూ.4,10,819 కోట్లు అని కాగ్ స్పష్టం చేసింది.

కాగ్ రిపోర్టు మీరు 2023, డిసెంబర్ వైట్ పేపర్‌లో చెప్పిన ప్రకారం బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు 4.17 లక్షల కోట్లు. ఇష్టం ఉన్నట్లు లెక్కలు కట్టి అప్పుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లకు మళ్లీ చెబుతున్నా..
మీ శ్వేతపత్రం ప్రకారం చూసినా, బడ్జెట్ డాక్యుమెంట్స్ ప్రకారం చూసినా, కాగ్ రిపోర్టు ప్రకారం చూసినా, మీ ఎకనామిక్ సర్వే ప్రకారం చూసినా బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లు దాటలేదు. నేను అసెంబ్లీలో ఇదే చెప్పా కదా.. ముఖ్యమంత్రి, భట్టి ఉన్నప్పుడే అందరి సమక్షంలో చెప్పా. ఇప్పటికీ, ఎప్పటికీ ఈ మాట‌కే కట్టుబడి ఉంటాను. ప్రెస్ మీట్ పెట్టినోళ్లు, సవాళ్లు విసిరిన వాళ్లు టీవీలు చూస్తున్నరనే అనుకుంటున్నా. ఇది మా స్టాండ్ దీని మీద ఎక్కడ, ఎప్పుడు చర్చకైనా సిద్దమని చెబుతున్నా అని హ‌రీశ్ రావు స‌వాల్ విసిరారు.

శ్వేతపత్రంలో ఒక లెక్క, అసెంబ్లీలో ఒక లెక్క, పత్రికా సమావేశాల్లో ఒక లెక్క ఉంటదా?

వీళ్లు చెబుతున్న అప్పుల లెక్క మీద నిలబడతారా అంటే అదీ లేదు. పూటకో మాట, నచ్చినట్లు లెక్కలు మార్చుతూ, అబద్దాలు ప్రచారం చేస్తున్నరు. అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.6,71,757 కోట్లు అని చెప్పారు. ఇందులో కూడా మాకు సంబంధం లేనివి కలిపారు. మొన్న జూపల్లి ఏమన్నరు.. ముందు రోజు 8 లక్షల కోట్ల అప్పు అన్నడు, తెల్లారి 7 లక్షల కోట్ల అప్పు అన్నడు. శ్వేతపత్రంలో ఒక లెక్క, అసెంబ్లీలో ఒక లెక్క, పత్రికా సమావేశాల్లో ఒక లెక్క ఉంటదా? అని నిల‌దీశారు.

ముఖ్యమంత్రి కరెక్టా? భట్టి కరెక్టా?

మీరు ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మ‌ళ్లించ‌డం కోసం, మీరు చేస్తున్న స్కాంల నుంచి డైవర్షన్ చేయడం కోసం అప్పుల పేరుతో డ్రామాలు ఆడుతున్నరు. స్కాంలు బయట పడుతుంటే, ప్రజలు తిరగబడుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నరు. 8.21 లక్షల కోట్ల అప్పు అనేది కట్టు కథ. వాళ్లు తెచ్చిన అప్పుల విషయంలోనూ తలో మాట. నిన్న భట్టి 3,85,600 కోట్ల అప్పు తెచ్చినం అంటే.. 2026 మార్చి 18న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన FRBMతో పాటు, అన్ని రకాల అప్పు, ఫిబ్రవరి 28, 2026 నాటికి చేసిన అప్పు కలిపి రూ.3,47,294 కోట్లు అని స్వయంగా ప్రకటించారు. నాలుగు నెల్లలో అప్పు ఎట్ల తగ్గింది రేవంత్ రెడ్డి, భట్టి గారు? ఇదంతా గారడీ కాదా? ప్రజలను మోసం చేయడం కాదా? ముఖ్యమంత్రి కరెక్టా? భట్టి గారు కరెక్టా? అని క‌డిగిపారేశారు.

రేవంత్ చేసిన మొత్తం అప్పు నాలుగు లక్షల 50 వేల కోట్లు..

జూన్ 30 నాటికి పబ్లిక్ డొమైన్ ఉన్న లెక్కల ప్రకారం, 31 నెలల్లో రేవంత్ రెడ్డి చేసిన మొత్తం అప్పు నాలుగు లక్షల 50వేల కోట్లు. ఎంత దారుణం అంటే.. ఒక దిక్కు బీఆర్ఎస్ అప్పులు చేసింది అని ప్ర‌చారం చేస్తూ వీళ్లు వేల కోట్ల అప్పులు దొంగదారిన లంచాలు ఇస్తూ అప్పు తెస్తున్నరు. వీళ్ల బండారం మొత్తం అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నతోనే బట్టబయలైంది. వేల కోట్ల రూపాయల అప్పులు ఎఫ్ ఆర్బీఎం పరిధిలోకి రాకుండా, వందల కోట్ల రూపాయల లంచాలు (బ్రోకర్ కమీషన్లు) ఇచ్చి తెస్తున్నరు. ప్రభుత్వమే అప్పుల కోసం బ్రోకర్లకు లంచాలు ఇచ్చే పరిస్థితికి దిగజారింది. అందుకే రేవంత్ రెడ్డిని దొంగలాగా చూస్తున్నరు. దేశ చరిత్రలో ఇంత దిక్కుమాలిన పని చేసిన ప్రభుత్వం మరొకటి ఉండదు అని ధ్వ‌జ‌మెత్తారు.

బ్రోకరేజ్ అంటరా? లంచం అంటరా?

టీజీఐఐసీ భూములను కుదువపెట్టి 10వేల కోట్ల అప్పు తేవడానికి ఇచ్చిన బ్రోకరేజ్ చార్జీ ఎంత అంటే వీళ్లు ఇచ్చిన సమాధానం 170 కోట్లు. అదే అసెంబ్లీలో HMDA భూములు కుదువ పెట్టడం ద్వారా ఎంత అప్పు సేకరిచించాలనుకుంటున్నారు అని అడిగితే వచ్చిన సమాధానం.. మరో 20వేల కోట్లు అప్పు తెస్తాం అన్నరు. అంటే 10,000 కోట్ల అప్పుకు 170 కోట్లు బ్రోకర్ చార్జీ చెల్లిస్తే, మొత్తం 30 వేల కోట్లకు బ్రోకర్లకు చెల్లిస్తున్న డబ్బు అక్షరాల రూ.510 కోట్లు. దీన్ని బ్రోకరేజ్ అంటరా? లంచం అంటరా? ఏమంటరో ప్రభుత్వమే సమాధానం చెప్పాలె. ఇది మాత్రమే కాదు ఇట్లనే వందల కోట్ల లంచాలు ఇచ్చి మూడు హైదరాబాద్ కార్పొరేషన్లు, డిస్కంలు, HMWS ద్వారా మరో 70,000 కోట్ల అప్పు తేవాలని టార్గెట్ పెట్టుకున్నరు. అంటే ఈ 70వేల కోట్ల అప్పు కోసం రేవంత్ రెడ్డి బ్రోకర్లకు ఇచ్చే లంచం 1200 కోట్లు. అంటే ఈ 1200 పైనవి ఈ 510 కలిపితే మొత్తం 1710 కోట్లు. లక్ష కోట్ల అప్పు కోసం 1710 కోట్లు బ్రోకర్లకు లంచాలు చెలిస్తున్నది ఈ ప్రభుత్వం. బాండ్ల ముసుగులో ఇదంతా చేస్తున్నరు. బొందల గడ్డకు కూడా జాగ లేకుండా ఖతం పట్టిస్తున్నరు అని హ‌రీశ్ రావు నిగ్గు తేల్చారు.

సొంత ఆదాయ వనరులను 13,13,391 కోట్లకు పెంచినం..

ఫైనాన్స్ గ్రాంట్ ఇవ్వడం లేదు మీరు తెచ్చుకోండి అంటే మేం అప్పు తెచ్చుకున్నం, కరోన వల్ల అప్పు లిమిట్ పెంచితే కొంత తెచ్చుకున్నం, ఉదయ్ స్కీం ద్వారా కేంద్రం బలవంతంగా రుద్దిన అప్పు, జీఎస్టీ పరిహారంగా తెచ్చిన అప్పు ఇవన్నీ మేం చెబుతున్న 4.17లక్షల కోట్ల అప్పులో ఉన్నాయి. మేం ఈ 4.17లక్షల కోట్లతో కాలేశ్వరం, మిషన్ భగీరథ, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క సాగర్, రైతు బంధుకు 72,972కోట్లు, రైతు బీమా 6,800 కోట్లు, రైతు రుణమాఫీ 29 వేల కోట్లు, ఉచిత కరెంట్ కు 61వేల కోట్లు, గొర్రెల పంపిణీకి 5వేల కోట్లు, మీరు కూర్చుంటున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం, పటిష్టమైన భద్రత కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ, జిల్లాకు ఒక కలెక్టరేట్ కట్టినం. సొంత ఆదాయ వనరులను పెంచినం జీఎస్డీపీ 4,51,580 కోట్ల నుంచి 13,13,391 కోట్లకు పెంచినం, తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 నుంచి 3,17,117 కోట్లకు పెంచినం. ఇవన్నీ ఎందుకు మాట్లాడరు. ఇవన్నీ కళ్ల ముందే ఉన్నాయి కదా? ఇప్పుడు మీరేం చేస్తున్నరు. కరోనా లేదు, నోట్ల రద్దు లేదు, కేంద్రం మెడ మీద కత్తి పెట్టలేదు అని మాజీ మంత్రి పేర్కొన్నారు.

దొంగకే తనకు తానుగా విచారణ చేసుకోమని చెప్పినట్లుంది..

భట్టి నిన్న సింగరేణి గురించి మాట్లాడారు. 40 లక్షల బొగ్గు మాయంపై సింగరేణి విజిలెన్స్ విచారణ చేస్తదట. దొంగకే తనకు తానుగా విచారణ చేసుకోమని చెప్పినట్లుంది. సింగరేణిలో కుంభకోణాలు జరిగితే, అదే సింగరేణి విజిలెన్స్ అధికారులతో విచారణ చేయిస్తాం అనడంలో అర్థం ఉందా? వెయ్యి కోట్ల సోలార్ పవర్ స్కాం గురించి మాట్లాడలేదు. పాకిస్థాన్ బార్డర్ జైసల్మేర్‌లో సోలార్ ప్లాంట్ పెడతాం అన్నరు. ఆ స్కాం గురించి మాట్లాడరు.
సింగరేణిలో ఎక్స్ ప్లోసివ్ స్కాం గురించి మాట్లాడరు. డీజిల్ స్కాం గురించి మాట్లాడరు. జైపూర్ పవర్ ప్లాంట్ గురించి మాట్లాడరు. ఎక్స్ ప్లోజివ్స్ కుంభకోణంల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు సమాధానం చెప్పడం లేదు? అని ప్ర‌శ్నించారు.

బాంబే, గుజరాత్ బ్రోకర్లు తిరుగుతున్నరు..

చేతనైతే పాలన మీద దృష్టి పెట్టండి. రాష్ట్రానికి అప్పులు ఇప్పిస్తమని సచివాలయం చుట్టూ బాంబే బ్రోకర్లు, గుజరాత్ బ్రోకర్లు తిరుగుతున్నరు. లంచాలు ఇచ్చి అప్పులు తీసుకోవడం సిగ్గుచేటు. దేశంలో ఇలాంటి దుస్థితి ఎక్కడా లేదు. బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా, శాసన సభ్యుడిగా, కేసీఆర్ శిష్యుడిగా, తెలంగాణ ఉద్యమ కారుడిగా చెబుతున్నా.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.17లక్షల కోట్లు మాత్రమే. దీనికి నేను కట్టుబడి ఉన్నా ఏ చర్చకైనా సిద్దం. పెట్టండి అసెంబ్లీ మాట్లాడుదాం అని హ‌రీశ్‌రావు స‌వాల్ విసిరారు.

Advertisement
Advertisement