Pawan Kalyan | ఏపీ ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టు అంజనేయస్వామిని దర్శించుకున్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు, పూజారులు పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. భక్తుల వసతి సౌకర్యాల కోసం విశ్రాంతి గదులు, ధర్మశాలతో పాటు దీక్ష విరమణ మండపానికి 35.19 కోట్లు టీటీడీ నిధులు మంజూరు చేసింది. ఈ అభివృద్ధి పనులకు సంబంధించిన భూమి పూజా పనులు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరిగాయి. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గతంలో తనకు ఓ విద్యుత్ ప్రమాదం జరిగిందని, ఆ సంఘటన నుంచి కొండగట్టు అంజనేయస్వామి దయతోనే తాను క్షేమంగా బయటపడ్డానని చెప్పారు. కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందని తెలిపారు. దేవుడి దయ వల్లే ఈ అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టామని పేర్కొన్నారు. గతంలో కొండగట్టును దర్శించుకున్న సమయంలో దీక్ష విరమణ సత్రం గదులు కావాలని భక్తులు కోరారు. వాటి నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరయ్యేలా చేస్తానని మాటిచ్చాను. టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకుల కృషి వల్లే అభివృద్ధి పనులు మొదలుపెట్టాగలిగామని పవన్ కళ్యాణ్ చెప్పారు. వంద గదులతో... 100 గదులతో గదులతో కూడిన అతిథి గృహం, 2000 మంది భక్తులకు సరిపోయేలా దీక్ష విరమణ మండపం నిర్మించబోతున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి తన ఇష్టదైవమని పలుమార్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. డిప్యూటీ సీఏంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా కొండగట్టును దర్శించుకున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన తర్వాత తెలంగాణలోని జనసేన నాయకులు, కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.