త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Scene Movie Review | సూర్య సీన్ రివ్యూ – అంధుడైన హీరో… వంద హ‌త్య‌లు చేసిన‌ కిల్ల‌ర్‌ను ఎలా ప‌ట్టుకున్నాడంటే?

వైక‌ల్యాల‌ను చూసి అధైర్య‌ప‌డొద్దు. బ‌ల‌హీన‌త‌ల‌ను బ‌లాలుగా మార్చుకొని ముందుకు సాగితే జీవితంలో ఎలాంటి అద్భుత‌మైన చేయ‌చ్చు. సీన్ సినిమాతో హీరో సూర్య‌ (Suriya), డైరెక్ట‌ర్ జీతూ మాధ‌వ‌న్ ఇదే మెసేజ్ ఇచ్చారు. సూర్య హీరోగా న‌టిస్తూ నిర్మించిన ఈ మూవీ ఎలా ఉందంటే?

N

Entertainment | Published On Nov 6, 2026, 2.11 pm IST

Scene Movie Review | సూర్య సీన్ రివ్యూ – అంధుడైన హీరో… వంద హ‌త్య‌లు చేసిన‌ కిల్ల‌ర్‌ను ఎలా ప‌ట్టుకున్నాడంటే?
Advertisement

Scene Movie Review | హీరో అంటే ఫైట్లు చేయాలి...హీరోయిన్‌తో పాట‌లు పాడాలి..ఎలివేష‌న్లు, బిల్డ‌ప్పులు స‌రేస‌రి. ఈ క‌మ‌ర్షియ‌ల్ హంగులు లేకుండా ఈ రోజుల్లో స్టార్ హీరో సినిమా ఊహించ‌డం క‌ష్ట‌మే. మాస్ మ‌సాలా క‌థ‌ల‌తో హీరోల‌ను ఇమేజ్ ఛ‌ట్రంలో బందీల‌ను చేశారు ద‌ర్శ‌కులు. వాటికి భిన్న‌మైన ప్ర‌య‌త్నాలు చాలా అరుదుగా వ‌స్తాయి. సీన్ అలాంటి ప్ర‌య‌త్న‌మే. ఇందులో హీరో ఉంటాడు. కానీ ఇందులోని మిగిలిన పాత్ర‌ల‌కు ఓ దిక్సూచిలా మాత్ర‌మే క‌నిపిస్తాడు.

ప్రేమ్‌రాజ్‌...

ప్రేమ్‌రాజ్ (సూర్య‌) క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేస్తుంటాడు. ఎంతో మంది క్రిమిన‌ల్స్‌ను ప‌ట్టుకుంటాడు. అత‌డి కింద డ్యూటీ చేయ‌డ‌మంటే టార్చ‌ర్‌లా చాలా మంది ఫీల‌వుతుంటారు. స‌డెన్‌గా ఓ రోజు ప్రేమ్‌రాజ్ త‌న జాబ్‌కు రిజైన్ చేస్తాడు. అదే టైమ్‌లో సిటీలో వ‌రుస హ‌త్య‌లు జ‌రుగుతుంటాయి. ఓ కిల్ల‌ర్ ఒకే తీరులో కొంద‌రిని చంపుతుంటాడు. ఈ కేసును ఎలాగైన సాల్వ్ చేయ‌మ‌ని ప్రేమ్‌రాజ్‌ను క్రైమ్ బ్రాంచ్ హెడ్ స్టీఫెన్ (లాల్‌) కోరుతాడు. అదే టైమ్‌లో విక్ట‌ర్ (టోవినో థామ‌స్‌) అనే కిల్ల‌ర్ ద్వారా ప్రేమ్‌రాజ్ గుడ్డివాడ‌నే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. త‌న‌కు కంటిచూపు లేద‌నే నిజాన్ని దాచిపెట్టి అత‌డు డ్యూటీ చేశాడ‌ని తెలుసుకున్న స్టీఫెన్ జాబ్ నుంచి తీసేస్తాడు.

పోలీస్‌లా కాకుండా సాధార‌ణ పౌరుడిలా ఈ సీరియ‌ల్ కిల్ల‌ర్ కేసును సాల్వ్ చేయాల‌ని ఫిక్స‌వుతాడు ప్రేమ్‌రాజ్‌. ఈ కేసు ఇన్వేస్టిగేష‌న్‌లో ధైర్య‌వంతురాలైన మాయ (న‌జ్రియా న‌జీమ్‌) అనే యువ‌తి సాయాన్ని తీసుకుంటాడు. వారి ఇన్వేస్టిగేష‌న్‌లో ఈ హ‌త్య‌లు చేస్తుంది ఈశ్వ‌ర్ (న‌స్లీన్‌) అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. వందకుపైగా మర్డర్లు చేశాడని కనిపెడతారు. అస‌లు ఈశ్వ‌ర్ ఎవ‌రు? త‌మిళ‌నాడు నుంచి అత‌డు హైద‌రాబాద్ ఎందుకువ‌చ్చాడు? కంటిచూపు లేని ప్రేమ్‌రాజ్...మాయ సాయంతో ఈశ్వ‌ర్‌ను ఎలా ప‌ట్టుకున్నాడు? అన్న‌దే మిగిలిన క‌థ‌.

ప్ర‌తిభ‌కు ప‌దును పెడితే

వైక‌ల్యాల‌ను చూసి అధైర్య‌ప‌డితే జీవితం అక్క‌డే ఆగిపోతుంది. వాటికి అధిగ‌మిస్తూ త‌మ‌లో దాగివున్న ప్ర‌తిభ‌కు ప‌దును పెడితే ఎలాంటి అద్భుత‌మైన చేయ‌చ్చు. సీన్ సినిమాతో అంత‌ర్లీనంగా అదే మెసేజ్ ఇచ్చారు ద‌ర్శ‌కుడు జీతూ మాధ‌వ‌న్‌. త‌న‌లోని బ‌ల‌హీన‌త‌ల‌నే బ‌లాలుగా మార్చుకొని ఓ పోలీస్ ఆఫీస‌ర్ పెద్ద క్రైమ్‌ను ఎలా సాల్వ్ చేశాడ‌న్న‌ది చూపించారు.

ఫాలో కాలేదు...

సీరియ‌ల్ కిల్ల‌ర్ క‌థ‌ల ట్రెండ్ ప్ర‌స్తుతం బాగా న‌డుస్తోంది. ఇలాంటి క‌థ‌ల‌తో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయ‌డంలో మ‌ల‌యాళ ద‌ర్శ‌కులు సిద్ధ‌హ‌స్తులు. జీతూ మాధ‌వ‌న్ ఆ ట్రెండ్‌ను ఫాలో కాలేదు. దానిని తిర‌గ‌రాసే ప్ర‌య‌త్నం చేశాడు.

లాజిక్‌ల‌కు అంద‌దు...

ఓ సీరియ‌స్ క్రైమ్ క‌థ‌ను ఎంట‌ర్‌టైనింగ్‌గా సీన్ సినిమాలో ఆవిష్క‌రించారు. ఇందులో హీరోతో క‌లిసి ట్రావెల్ చేసే ప్ర‌తి క్యారెక్ట‌ర్ చాలా ఇంట‌లెక్చువ‌ల్‌గా క‌నిపిస్తారు. కానీ అంద‌రికి ఏదో ఒక స‌మ‌స్య‌, వైక‌ల్యం ఉంటాయి. వారంతా క‌లిసి ఓ కిల్ల‌ర్‌ను ఎలా ప‌ట్టుకుంటార‌నే క్యూరియాసిటీని చివ‌రి వ‌ర‌కు మెయింటేన్ చేశారు.
ద‌ర్శ‌కుడు రాసుకున్న పాయింట్ చాలా బాగుంది. పేప‌ర్‌పై ఉన్న కొత్త‌ద‌నం స్క్రీన్‌పై క‌నిపించ‌లేదు. వైక‌ల్యాల‌పై వ‌చ్చే కామెడీ సీన్లు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. ఒక్క క్లూ లేకుండా వంద‌కుపైగా మ‌ర్డ‌ర్లు చేసిన కిల్ల‌ర్ ఈజీగా హీరోకు దొర‌క‌డం లాజిక్‌ల‌కు అంద‌దు. ఇలాంటి సీన్లు సినిమాలో చాలానే ఉంటాయి.

అభినంద‌నీయం...

క‌మ‌ర్షియ‌ల్ లెక్క‌లు, ఇమేజ్‌ల గురించి ఆలోచించ‌కుండా అంధుడి పాత్ర చేయ‌డానికి సూర్య లాంటి స్టార్ హీరో అంగీక‌రించ‌డం నిజంగా అభినంద‌నీయ‌మే. త‌న వ‌ర‌కు బెస్ట్ ఇచ్చాడు. స్టైలిష్‌గా న‌టించాడు. న‌జ్రియా (Nazriya Nazeem) త‌క్కువ మేక‌ప్‌తో నాచుర‌ల్‌గా క‌నిపించింది. హీరోయిన్ అనే భావ‌న ఎక్క‌డ క‌ల‌గ‌దు. ఆమెపై సినిమాలో పెద్ద ఫైట్ ఉంది.
విల‌న్ రోల్ కోసం న‌స్లీన్ ఎంపిక రాంగ్‌ఛాయిస్‌. కిల్ల‌ర్ పాత్ర‌కు త‌గ్గ ర‌ఫ్‌నెస్ అత‌డిలో క‌నిపించ‌లేదు. జ్యోతిక కొద్ది క్ష‌ణాలు స్క్రీన్‌పై త‌ళుక్కున మెరిసింది. సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా టోవినో థామ‌స్ గెస్ట్‌గా న‌టించారు. ఫ‌స్ట్ హాఫ్‌లో ఓ ట్విస్ట్ .....ఆ త‌ర్వాత‌ సెకండ్ పార్ట్ లీడ్ కోసం అత‌డి పాత్ర‌ను ద‌ర్శ‌కుడు బాగా వాడుకున్నారు.

క‌మ‌ర్షియ‌ల్ కోణంలో చూస్తే సీన్ న‌చ్చ‌క‌పోవ‌చ్చు. కానీ ప్ర‌యోగంగా భావించి చూస్తే మాత్రం ఆక‌ట్టుకుంటుంది.

 

Advertisement
Advertisement