త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan Kumar Ekta Mall | ఏక్తా మాల్ కాదు.. ‘దోపిడీ మాల్’

కేంద్రం ఇచ్చిన రూ.202 కోట్లు, దళితుల 6 ఎకరాల భూమి ప్రైవేట్ బిల్డర్ల పరం? ఏక్తా మాల్ ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్‌ను నిలదీసిన బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్.

J

Telangana | Published On Nov 6, 2026, 2.11 pm IST

Dasoju Sravan Kumar Ekta Mall | ఏక్తా మాల్ కాదు.. ‘దోపిడీ మాల్’

సంక్షిప్త సారాంశం

రాయదుర్గంలో చేపడుతున్న పీఎం ఏక్తా మాల్ ప్రాజెక్టును ప్రైవేట్ బిల్డర్లకు లాభం చేకూర్చేలా మార్చారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. టీజీ లిప్కో (TG LIPCO)కు చెందిన 6.12 ఎకరాల విలువైన భూమి, కేంద్రం విడుదల చేసిన రూ.202 కోట్ల నిధులను ప్రైవేట్ డెవలపర్ల ప్రయోజనాలకు వాడుతున్నారని మండిపడ్డారు. మొత్తం 27 లక్షల చదరపు అడుగుల నిర్మాణంలో డెవలపర్లకే ఏకంగా 66 శాతం (17.82 లక్షల చ.అ.) కట్టబెట్టారని లెక్కలతో సహా వెల్లడించారు. ప్రధాని పేరుతో ఉన్న ప్రాజెక్టులోనే భారీ గోల్‌మాల్ జరుగుతుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ ఎందుకు రంగంలోకి దిగడం లేదని బీజేపీ నాయకత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

Advertisement
  • కేంద్ర నిధులు, దళితుల భూములపై ప్రైవేట్ బిల్డర్ల పెత్తనమా?
  • రేవంత్ సర్కార్‌పై దాసోజు శ్రవణ్ ఫైర్

Dasoju Sravan Kumar Ekta Mall | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ రాయదుర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'పీఎం ఏక్తా మాల్' (యూనిటీ మాల్) వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కేంద్రం ఇచ్చిన నిధులు, దళిత సంస్థకు చెందిన రూ.వందల కోట్ల విలువైన భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేట్ బిల్డర్లకు ధారాదత్తం చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది కళాకారుల సంక్షేమం కోసం పెట్టిన ఏక్తా మాల్ కాదని, ముమ్మాటికీ 'ఏకత్ర దోపిడీ మాల్' అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా విరుచుకుపడ్డారు.

నిధులు కేంద్రానివి.. భూమి దళితులది.. లాభం బిల్డర్లదా?

ప్రధాని పేరుతో కేంద్రం ఇచ్చిన రూ.202 కోట్ల నిధులు, దళిత చేతివృత్తుల సంస్థ 'టీజీ లిప్కో' (TG LIPCO)కు చెందిన 6.12 ఎకరాల విలువైన భూమి, నేతన్నలు-హస్తకళాకారుల భవిష్యత్తు.. ఈ మూడింటినీ కలిపి ప్రభుత్వం వంశీరామ్ బిల్డర్స్, అపర్ణ బిల్డర్స్‌లకు కట్టబెడుతోందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ప్రాజెక్టును వాణిజ్యపరంగా లాభదాయకం చేసేందుకంటూ నిబంధనలు మార్చి, పేద కళాకారుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వ లెక్కలను బయటపెట్టిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ

ఈ ప్రాజెక్టులోని నిర్మాణ విస్తీర్ణ వివరాలను ప్రస్తావిస్తూ దాసోజు శ్రవణ్ ప్రభుత్వ తీరును నిలదీశారు.

మొత్తం నిర్మాణం: 27 లక్షల చదరపు అడుగులు

కళాకారుల ఏక్తా మాల్‌కు: కేవలం 2.13 లక్షల చ.అ. (8% కంటే తక్కువ)

ప్రభుత్వ కార్యాలయాలకు: 7 లక్షల చ.అ. (26%)

ప్రైవేట్ బిల్డర్లకు: ఏకంగా 17.82 లక్షల చ.అ. (66%)

"భూమి దళితులది, పైసలు కేంద్రానివి.. మరి 66 శాతం వాటా, లాభాలు ప్రైవేట్ సంస్థలకు ఎలా ఇస్తారు? దీని వెనుక ప్రభుత్వ పెద్దలకు ముట్టిన అక్రమ కమీషన్లు ఎంత?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

అమిత్ షాకు సూటి ప్రశ్న: ఇందులో 'RR ట్యాక్స్' లేదా?

గతంలో తెలంగాణ గడ్డపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ ప్రస్తావించిన 'RR ట్యాక్స్' (రాహుల్-రేవంత్ ట్యాక్స్) అంశాన్ని శ్రవణ్ మరోసారి తెరపైకి తెచ్చారు. ప్రధాని పేరు మీద కేంద్రం నిధులు కేటాయించిన ప్రాజెక్టులోనే ఇంత బహిరంగ దోపిడీ జరుగుతుంటే బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.

ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ, లోక్‌పాల్‌లతో విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నిస్తూ.. ఢిల్లీలో కొట్లాడుతున్నట్లు నటిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారా అని విమర్శించారు. దళితుల ఆస్తులను కాపాడేందుకు ఈ ప్రాజెక్టుపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement