త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Web Series Review | అబ్జెక్ష‌న్ మై లార్డ్ రివ్యూ – జీ 5 ఓటీటీలో రిలీజైన తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

హీరో శ్రీకాంత్‌, ముఖేష్ రిషి, అన‌న్య శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తెలుగు వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?

N

Entertainment | Published On Jul 31, 2026, 3.28 pm IST

Web Series Review |  అబ్జెక్ష‌న్ మై లార్డ్ రివ్యూ – జీ 5 ఓటీటీలో రిలీజైన తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్  వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
Advertisement

Web Series Review |  సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ లీడ్ రోల్‌లో న‌టించిన అబ్జెక్ష‌న్‌ మై లార్డ్ వెబ్‌సిరీస్ శుక్ర‌వారం జీ5 ఓటీటీలో రిలీజైంది. ఈ సిరీస్‌లో ముఖేష్ రిషి, అన‌న్య శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కోర్ట్ రూమ్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ తెలుగు వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

ప‌ర‌శురామ్ వాద‌న‌...

ప‌ర‌శురామ్ (శ్రీకాంత్‌) ఓ లాయ‌ర్‌. న్యాయ‌శాస్త్రంలోని ప్ర‌తి సెక్ష‌న్‌ గురించి అత‌డికి అవ‌గాహ‌న ఉంటుంది. ఎంతో టాలెంటెడ్ అయిన ప‌ర‌శురామ్ ఓ స‌మ‌స్య కార‌ణంగా కోర్టులో వాద‌న‌ల‌కు దూరంగా ఉంటాడు. నోట‌రీగా ప‌నిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఫెయిల్యూర్ లాయ‌ర్‌గా అవ‌మానాలు ప‌డుతుంటాడు. ప‌ర‌శురామ్ ద‌గ్గ‌ర వేద (అన‌న్య శ‌ర్మ‌) అసిస్టెంట్‌గా జాయిన్ అవుతోంది. నారాయ‌ణ అనే వ్య‌క్తి కోర్టు ముందు ఆత్మాహుతి చేసుకుంటాడు. నారాయ‌ణ కేసును ప‌ర‌శురామ్ టేకాప్ చేస్తాడు. నారాయ‌ణ కూతురు స‌మీరా (స్నేహ‌ల్ కామ‌త్‌) కిడ్నాప్‌కు గుర‌వుతుంది. అత‌డి కంప్లైంట్‌ను పోలీసులు స్వీక‌రించ‌క‌పోవ‌డం, లాయ‌ర్లు ప‌ట్టించుకోక‌పోవ‌డంతోనే అత‌డు చ‌నిపోయాడ‌ని ప‌ర‌శురామ్ క‌నిపెడ‌తాడు. అదే టైమ్‌లో ప‌ర‌శురామ్ ఓ మెంట‌ల్ హాస్పిట‌ల్‌లో ప‌ద్దెనిమిదేళ్లు ట్రీట్‌మెంట్ కూడా తీసుకున్నాడ‌నే నిజం కూడా బ‌య‌ట‌ప‌డుతుంది. ఈ కేసులో ప‌ర‌శురామ్‌కు వ్య‌తిరేకంగా ఓట‌మే ఎర‌గ‌ని ఫేమ‌స్ లాయ‌ర్ విశ్వ‌నాథ్ (ముఖేష్ రిషి) వాదిస్తుంటాడు. ఈ కేసు ఇన్వేస్టిగేష‌న్‌లో నారాయ‌ణ‌తో పాటు స‌మీరా గురించి ప‌ర‌శురామ్‌కు ఎలాంటి నిజాలు తెలిశాయి? తండ్రికి స‌మీరా ఎలా దూర‌మైంది? కూతురిని నారాయ‌ణ ఎలాంటి ప‌రిస్థితుల్లో క‌లుసుకున్నాడు? స‌మీరాను కిడ్నాప్ చేసింది ఎవ‌రు? ఈ కేసులో ప‌ర‌శురామ్ విన్న‌ర్ అయ్యాడా? అపోజిష‌న్ లాయ‌ర్ విశ్వ‌నాథ్ నుంచి అత‌డికి ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? అన్న‌దే అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్‌సిరీస్ మిగిలిన క‌థ‌.

చెట్టు కింద ప్లీడ‌ర్‌...

పెద్ద‌గా పేరు ప్ర‌ఖ్యాతులు లేని సాధార‌ణ లాయ‌ర్ ఎలాంటి ఆధారాలు లేని కేసును టేకాప్ ఛేయ‌డం...అత‌డికి వ్య‌తిరేకంగా కోర్టులో పెద్ద లాయ‌ర్ , పొలిటిక‌ల్‌గా అందండ‌లు ఉన్న వ్య‌క్తులు ఉండ‌టం.. ఎన్నో అడ్డంకుల‌ను దాటుకొని చివ‌ర‌కు హీరో గెల‌వ‌డం...ఈ కాన్సెప్ట్‌తో రాజేంద్ర‌ప్ర‌సాద్ చెట్టుకింద‌ప్లీడ‌ర్ నుంచి ఇటీవ‌ల రిలీజైన నాని కోర్టు వ‌ర‌కు చాలానే సినిమాలు వ‌చ్చాయి.
అబ్జెక్ష‌న్ మై లార్డ్ కూడా ఇంచుమించి ఇదే పాయింట్‌తో సాగుతుంది. కోర్టులో వాద‌న‌లు అంటేనే భ‌య‌ప‌డిపోయే నోట‌రీ లాయ‌ర్ మిస్ట‌రీ కేసును ఎలా సాల్వ్ చేశాడ‌నే అంశాల‌తో కోర్ట్ రూమ్ డ్రామా థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు సంతోష్ అయ్య‌ప్ప‌న్ ఈ సిరీస్‌ను తెర‌కెక్కించాడు.

ఏడు ఎపిసోడ్స్‌...

మొత్తం ఏడు ఎపిసోడ్స్‌తో ఈ తెలుగు వెబ్ సిరీస్ సాగుతుంది. ఓ వైపు క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్‌...మ‌రోవైపు కోర్టులో వాద‌న‌ల‌తో చివ‌రి ఎపిసోడ్ వ‌ర‌కు థ్రిల్లింగ్‌ను పంచుతుంది. హీరో పాత్ర ప‌రిచ‌యంతో పాటు అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌డానికి రెండు ఎపిసోడ్స్ తీసుకున్నారు. వేద పాత్ర ద్వారా హీరో తెలివితేట‌ల‌ను గురించి చెప్పించే సీన్లు బాగున్నాయి. నారాయ‌ణ కేసును హీరో చేప‌ట్టే సీన్ నుంచే సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఈ క్ర‌మంలో నారాయ‌ణ అచూకీ గురించి తెలిసే ట్విస్ట్ బాగుంది. అలాంటివి ఇంకొన్ని రాసుకుంటే బాగుండేది.
త‌మ‌కు దొరికిన చిన్న చిన్న ఆధారాల‌ను ప‌ట్టుకొని చివ‌ర‌కు స‌మీరా ఆచూకీని ఏ విధంగా క‌నిపెట్టార‌న్న‌ది థ్రిల్లింగ్‌గా చూపించారు. స‌మీరాకు జ‌రిగిన అన్యాయం...కూతురిని క‌ల‌వాల‌ని అనుకున్న నారాయ‌ణ‌కు క‌ళ్ల‌ముందే ఆమె జీవితం నాశ‌నం అయ్యింద‌ని తెలిసే సీన్ ద‌ర్శ‌కుడు రాసుకున్న తీరు బాగుంది. సినిమా, సిరీస్ ఏదైనా చివ‌ర‌కు హీరో గెల‌వ‌డం కామ‌న్‌. ఇందులోనూ అదే జ‌రిగింది. క్లైమాక్స్ ప్రెడిక్ట‌బుల్‌గా అనిపిస్తుంది. కానీ ఎక్క‌డ ఫైట్ సీన్లు, ఎలివేష‌న్లు, హీరోయిజం ఛాయ‌లు లేకుండా రియ‌లిస్టిక్ అప్రోచ్‌తో క‌థ‌ను న‌డిపించ‌డం ఆక‌ట్టుకుంటుంది.

బ‌ల‌మైన విల‌న్‌

హీరో పాత్ర హైలైట్ అవ్వాలంటే బ‌ల‌మైన విల‌న్ ఉండాలి. ఇందులో అదే మిస్స‌య్యింది. హీరో గెలుపును అడ్డుకోవ‌డానికి విల‌న్లు చేసే ప్ర‌య‌త్నాలు సిల్లీగా అనిపిస్తాయి. ముకేష్ రిషి అనుభ‌వాన్ని డైరెక్ట‌ర్ స‌రిగ్గా వాడుకోలేదు. శ్రీకాంత్‌కు ధీటుగా అత‌డి పాత్ర‌ను డిజైన్ చేసుకుంటే బాగుండేది. స‌మీరా ఎవ‌రు? నిజంగా ఉందా? అనే స‌స్పెన్స్‌ను చివ‌రి వ‌ర‌కు బాగానే హోల్డ్ చేశారు. ఇందుకోసం కొన్ని చోట్ల లాజిక్‌ల‌ను కూడా ప‌క్క‌న‌పెట్టారు. లా గురించి వ‌చ్చే డైలాగ్స్ ఎక్కువ‌గా ఉండ‌టం కూడా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.

లిమిట్స్ దాట‌కుండా...

సామాన్యుడికి న్యాయం చేయాల‌ని త‌పించే లాయ‌ర్ ప‌ర‌శురామ్ పాత్ర‌లో శ్రీకాంత్ ఒదిగిపోయారు. ఈ పాత్ర‌కు ఎంత కావాలో అదే స్థాయిలో న‌ట‌న‌ను క‌బ‌న‌రిచాడు. ఎక్క‌డా లిమిట్స్ దాట‌లేదు. ఫైట్లు, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ లేకుండా సింపుల్‌గా ఈ పాత్ర‌ను చూపించ‌డం బాగుంది. శ్రీకాంత్ అసిస్టెంట్‌గా అన‌న్య శ‌ర్మ‌కు మంచి రోల్ ద‌క్కింది. స్నేహ‌ల్ కామ‌త్, స‌మీర్‌, జెమిని సురేష్‌తో పాటు మిగిలిన వారి న‌ట‌న ఓకే. వెబ్ సిరీస్ అయినా నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయిలో ఉన్నాయి. ద‌ర్శ‌కుడిగానే కాకుండా ఈ సిరీస్‌తో రైట‌ర్‌గా సంతోష్ అయ్య‌ప్ప‌న్ మెప్పించాడు.
డీసెంట్ కోర్ట్ రూమ్ డ్రామా థ్రిల్ల‌ర్ సిరీస్ ఇది. శ్రీకాంత్ యాక్టింగ్ కోసం చూడొచ్చు. కొన్ని ట్విస్ట్‌లు బాగున్నాయి.

 

రేటింగ్ : 3/5

Advertisement
Advertisement