త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dhandoraa Review | దండోరా రివ్యూ – కుల వివ‌క్ష‌పై వ‌చ్చిన శివాజీ లేటెస్ట్ మూవీ ఎలా ఉందంటే?

కుల వివ‌క్ష కాన్సెప్ట్‌తో రూపొందిన దండోరా మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. శివాజీ, నందు, న‌వ‌దీప్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

N

Entertainment | Published On Dec 25, 2025, 10.19 am IST

Dhandoraa Review | దండోరా రివ్యూ – కుల వివ‌క్ష‌పై వ‌చ్చిన శివాజీ లేటెస్ట్ మూవీ  ఎలా ఉందంటే?

శివాజీ

Advertisement

Dhandoraa Review |  శివాజీ, నందు, న‌వ‌దీప్‌, బిందు మాధ‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ దండోరా. కుల వివ‌క్ష నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ మూవీకి ముర‌ళీకాంత్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శుక్ర‌వారం రిలీజైన దండోరా మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? అంటే?

కుల‌మే బ‌లం...

దండోరా క‌థ 2004 ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నేప‌థ్యంలో సాగుతుంది. మెద‌క్ జిల్లాలోని తుళ్లూరు గ్రామంలో కుల వివ‌క్ష ఎక్కువ‌గా ఉంటుంది. శివాజీ (శివాజీ) అగ్ర కులానికి చెందిన పెద్ద మ‌నిషి. ప్రాణం కంటే ప‌రువు, కుల‌మే ముఖ్య‌మ‌ని న‌మ్ముతుంటాడు. త‌క్కువ కులం వాళ్లు చ‌నిపోతే ఊరికి దూరంగా ద‌హ‌నం చేయాల‌నే క‌ట్టుబాటు ఉంటుంది. శివాజీ కూతురు సుజాత (మ‌ణిక‌) త‌మ ఊళ్లోని త‌క్కువ కులానికి చెందిన ర‌విని (ర‌వికృష్ణ‌) ప్రేమిస్తుంది. అత‌డిని పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌ప‌డుతుంది. ర‌వి హ‌త్య‌కు గుర‌వుతాడు. ప్రియుడి మ‌ర‌ణం త‌ట్టుకోలేక సుజాత కూడా ఆత్మ‌హ‌త్య చేసుకుంది. చెల్లెలు చావుకు తండ్రి కుల‌పిచ్చి కార‌ణ‌మ‌ని శివాజీ కొడుకు విష్ణు (నందు) తండ్రితో మాట్లాడ‌టం మానేస్తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? ర‌విని హ‌త్య చేసింది ఎవ‌రు? శివాజీలో మార్పు తీసుకొచ్చిన శ్రీల‌త (బిందుమాధ‌వి) అనే వేశ్య క‌థేమిటి? శివాజీ చ‌నిపోతే అత‌డి అంత్య‌క్రియ‌ల‌ను కుల సంఘానికి చెందిన స్మ‌శాన వాటిక‌లో జ‌ర‌ప‌ద్ద‌ని ఊరి ప్ర‌జ‌లు ఎందుకు చెప్పారు? ఈ స‌మ‌స్య‌కు ఊరు స‌ర్పంచ్ (న‌వ‌దీప్ ) ప‌రిష్కారం చూపించాడా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

త‌మిళంలో....

కుల వివ‌క్ష, ప‌రువు హ‌త్య‌లు అన్న‌వి చాలా సెన్సిటివ్ ఇష్యూస్‌. ఈ క‌థాంశాల‌తో త‌మిళంలో ఎక్కువ‌గా సినిమాలు వ‌చ్చాయి. పా రంజిత్‌, వెట్రిమార‌న్‌, మారి సెల్వ‌రాజ్‌తో పాటు చాలా మంది ద‌ర్శ‌కులు కుల వివ‌క్ష అంశాన్ని డిఫ‌రెంట్ యాంగిల్స్‌లో చూపించారు. త‌మిళంతో పోలిస్తేతెలుగులో ఈ పాయింట్‌తో సినిమాలు రావ‌డం త‌క్కువే.
దండోరాతో ద‌ర్శ‌కుడిగా తొలి ప్ర‌య‌త్నంలోనే కుల వివ‌క్ష అంశాన్ని ట‌చ్ చేశారు ద‌ర్శ‌కుడు మ‌ణికాంత్‌. సాధార‌ణంగా ఇలాంటి సినిమాల్లో అణ‌గారిన వ‌ర్గాల‌ను బాధితులుగా చూపిస్తుంటారు. అగ్ర వ‌ర్ణాల చేతిలో వారు ప‌డే బాధ‌లు, అణిచివేత‌ను ఆవిష్క‌రిస్తూ ఈ జాన‌ర్ సినిమాల‌కు సాగుతుంటాయి. వాటికి భిన్నంగా దండోరాను కొత్త పాయింట్‌తో ద‌ర్శ‌కుడు రూపొందించారు. కుల అహంకారంతో చేసే కొన్ని త‌ప్పులు మ‌నుషుల‌ను జీవితాంతం ఎలా బాధ‌పెడ‌తాయి? కుటుంబాల‌ను ఎలా చిన్నాభిన్నం చేస్తాయ‌న్న‌ది ఆలోచ‌నాత్మ‌కంగా చూపించారు. అగ్ర కులాలు అంద‌రిని ఒకే తాటిలో చూడ‌లేమ‌ని, వీరిలో వివ‌క్ష‌ను వ్య‌తిరేకించే మంచి మ‌నుషులు ఉంటార‌న్న‌ది దండోరాతో చెప్పారు.

ఇలాంటి కాన్సెప్ట్‌ల‌ను క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో చెప్ప‌డం అంటే క‌త్తి మీద సామే. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు. ఫ‌స్ట్ హాఫ్‌లో ర‌వి, సుజాత‌ల‌ ప్రేమ‌క‌థ‌ను రొమాంటిక్‌గా చూపించారు. సీరియ‌స్ సిట్యూవేష‌న్‌లో న‌వ‌దీప్‌, స‌త్త‌న్న పాత్ర‌లు వేసే పంచ్‌లో న‌వ్విస్తాయి. సెకండాఫ్ కంప్లీట్ ఎమోష‌న‌ల్‌గా ఈ మూవీ సాగుతుంది. కుల‌మే మిన్న‌గా భావించే శివాజీలో కూతురి మ‌ర‌ణం ఎలాంటి ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అత‌డిలో ప‌రివ‌ర్త‌న‌కు శ్రీల‌త ఎలా కార‌ణ‌మైంద‌న్న‌ది ఉద్వేగ‌భ‌రితంగా చూపించారు. ఈ స‌న్నివేశాల్లో వ‌చ్చే డైలాగ్స్ అర్థ‌వంతంగా సాగుతాయి.
కాన్సెప్ట్ బాగున్నా సినిమాలో కొన్ని చిన్న చిన్న లోపాలున్నాయి. క‌మ‌ర్షియ‌ల్‌ యాంగిల్ కోసం జోడించిన ప్రేమ‌క‌థ‌, పాట‌లు క‌థాగ‌మ‌నానికి కొంత అడ్డంకిగా అనిపిస్తాయి. స్లో ఫేజ్‌లో సాగ‌డం కూడా ఇబ్బంది పెడుతుంది.

పోటాపోటీగా...

దండోరా క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా టాలెంటెడ్ ఆర్టిస్ట్‌ల‌ను ఎంచుకోవ‌డంలో బాగా ప్ల‌స్స‌య్యింది. శివాజీ, న‌వ‌దీప్‌, నందు ఎవ‌రికి వారే పోటీప‌డి న‌టించారు. కుల అహంకారం న‌ర‌న‌రాన పేరుకు పోయిన వ్య‌క్తిగా శివాజీ మ‌రోమారు అద‌ర‌గొట్టాడు. నెగెటివ్ షేడ్స్‌తో మొద‌లై అత‌డి క్యారెక్ట‌ర్‌ను పాజిటివ్‌గా ఎండ్ చేశారు డైరెక్ట‌ర్‌. న‌వ‌దీప్‌, నందుల‌కు చాలా రోజుల త‌ర్వాత మంచి పాత్ర‌లు ప‌డ్డాయి. నాచుర‌ల్ యాక్టింగ్‌తో మెప్పించారు. న‌టుడిగా ర‌వికృష్ణ‌ను ఈ సినిమా ఓ మెట్టు ఎక్కించింది. వేశ్య పాత్ర‌లో బిందు మాధ‌వి న‌ట‌న ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ముర‌ళీధ‌ర్ గౌడ్‌, మ‌ణిక‌, మౌనిక‌రెడ్డితో పాటు మిగిలిన వారి న‌ట‌న మెప్పిస్తుంది.
మార్క్ కే రాబిన్ మ్యూజిక్ క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా సాగింది. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బాగున్నాయి. సోష‌ల్ ఎలిమెంట్‌తో బ‌ల‌మైన క‌థ‌ను ఎంచుకొని ద‌ర్శ‌కుడిగా తొలి సినిమాతోనే మ‌ణికాంత్ ప్ర‌తిభ‌ను చాటుకున్నారు.
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో కూడిన సినిమాలు తెలుగులో రావ‌ని అనుకునే వారికి మంచి స‌మాధానంగా దండోరా నిలుస్తుంది. నిజాయితీతో కూడిన మంచి ప్ర‌య‌త్న‌మిది.

రేటింగ్ : 3/5

Advertisement

తాజావార్తలు

Advertisement