త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Song Lyrics | స‌ద్ది గ‌ట్టి…సెల‌క‌ల తొవ్వ బ‌ట్టి – తెలంగాణ ప‌ల్లె ప‌దాల‌తో చంద్ర‌బోస్ మ్యాజిక్ – ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్‌ ఇవిగో…

శ‌ర్వానంద్ భోగి సినిమాలోని  ‘ఏగిలివారంగ’ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. అచ్చ తెలంగాణ మాండ‌లికంతో గేయ ర‌చ‌యిత చంద్ర‌బోస్ పాట‌ను రాశారు. సేను, సెల‌క‌ల‌తో కూడిన తెలంగాణ ప‌ల్లె సౌంద‌ర్యాన్ని....మేద‌రి, కుమ్మ‌రి, సాక‌లి లాంటి కుల వృత్తుల గొప్పత‌నాన్ని పాట‌లో అద్భుతంగా ఆవిష్క‌రించారు.

N

Entertainment | Published On Oct 9, 2026, 8.11 pm IST

Song Lyrics | స‌ద్ది గ‌ట్టి…సెల‌క‌ల తొవ్వ బ‌ట్టి – తెలంగాణ ప‌ల్లె ప‌దాల‌తో చంద్ర‌బోస్ మ్యాజిక్ – ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్‌ ఇవిగో…
Advertisement

Song Lyrics |  మేద‌రి న‌ర‌స‌న్న బుట్ట‌లు తేవంగా...కుమ్మ‌రి గంగ‌న్న‌... క‌త్తులు తేవంగా... స‌ద్ది గ‌ట్టి...సెల‌క‌ల‌ తొవ్వ‌బ‌ట్టి...ఎదురువ‌డ్డోళ్ల‌తోని పారాశాకాలాడి...మా ఊరి ప‌టేలుకు నైవేద్యం పెడ‌తాముల్లా...ఇలాంటి స్వ‌చ్ఛ‌మైన తెలంగాణ ప‌దాలు తెలుగు సినిమా పాట‌ల్లో విని చాలా కాల‌మే అయ్యింది. తెలంగాణ‌ ప‌ల్లె ప‌దాల‌తో భోగి సినిమాలోని ‘ఏగిలివారంగ’ పాట‌ను రాశారు గేయ ర‌చ‌యిత చంద్ర‌బోస్ (Lyricist Chandrabose).

బడుగు జీవుల పోరాటం...

సేను సెల‌క‌ల‌తో కూడిన తెలంగాణ  ప‌ల్లె సౌంద‌ర్యాన్ని, బ‌డుగు జీవులు బ‌తుకు పోరాటాన్ని త‌న సాహిత్యంతో అందంగా పాటలో ఆవిష్క‌రించారు. రెక్క‌లు ముక్క‌లు చేసిన త‌మ క‌ష్టాన్ని ప‌టేండ్లు ఎలా దోచుకుంటున్నారో చూపించారు. మేద‌రి, కుమ్మ‌రి, సాక‌లి లాంటి కుల వృత్తుల గొప్ప‌త‌నాన్ని చ‌ర్చించారు.

ప‌ల్లె వీధుల్లో

శుక్ర‌వారం రిలీజైన భోగి సినిమాలోని ఎలిగివారంగా పాట మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. పాట వింటుంటే తెలంగాణ‌, యాస‌, భాష‌ల‌కు మ‌ళ్లీ ప్రాణం వ‌చ్చిన అనుభూతి క‌లుగుతుంద‌ని అంటున్నారు. అల‌నాటి ప‌ల్లె వీధుల్లో మ‌ళ్లీ తిర‌గాడిన అనుభూతిని పాట క‌లిగించింద‌ని చెబుతున్నారు.

చాలా రోజుల త‌ర్వాత‌...

చాలా రోజుల త‌ర్వాత పూర్తి స్థాయి తెలంగాణ (Telangana) మాండ‌లికంలో చంద్ర‌బోస్ రాసిన పాట ఇది. ఆయ‌న సాహిత్యానికి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఈ పాట‌కు ఫోక్ స్టైల్‌లో భీమ్స్ మ్యూజిక్ అందించారు. మట్టివాసన ...మంచితనపు సువాసన ..ఇది పాట మాత్రమే కాదు ప్రతీ పల్లె ఆత్మను పలకరించే ఓ మధురమైన జ్ఞాపకం  ఈ పాట అంటూ  డైరెక్ట‌ర్ సంప‌త్ నంది  పేర్కొన్నారు. ఆదిలాబాద్ - మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దులో జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది (Sampath Nandi) ఈ సినిమాను తెర‌కెక్కించారు. ప‌టేల్‌దారి వ్య‌వ‌స్థ‌ను ఎదురించి పోరాడిన క‌మ్మ‌రోళ్ల గంగ అనే యువ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

ఏగిలివారంగ సాంగ్ లిరిక్స్

ఏగిలివారంగ లేసి
ఇల్లలికి పూధిచ్చి
ఇల్లలికి పూధిచ్చి
దేగుట్ల దేవతలకు దీపాలు ముట్టించి
దీపాలు ముట్టించి
కొట్టంలో బర్లు గొడ్లకు కుడితీనే దాపించి
కుడితీనే దాపించి
పజ్జొన్న గటకలోకి సల్లానీళ్లే పోసి
సల్లానీళ్లే పోసి
బుత్తంతా నోట్లోబెట్టి కడుమాది సద్ది గట్టి
కడుమాది సద్ది గట్టి
సెలకల్లో తొవ్వబట్టి
సేను తొవ్వబట్టి
సేను తొవ్వబట్టి
ఎదురువడ్డోళ్లతోని పారాషాకాలాడి
పారాషాకాలాడి
కండ్లపడ్డోళ్లతోని
కారెడ్డాలాడుతూ
ఈరెడ్డాలాడుతూ
బండ్ల బాటల్లా పోతు
ముండ్ల బాటల్లా పోతు
లొందల్లా పోతు పోతు
లొందల్లా పోతు పోతు
భూదేవి కడుపులోనా
భూలచ్చిమి గడపలోనా
భూదేవి కడుపులోనా భూలచ్చిమి గడపలోనా
రెక్కలు ముక్కలు జేసే బక్కజీవులం బడుగు జీవులం
బక్కజీవులం బడుగు జీవులం
రామ రామ రామ రామ ...రామొజ్జ రామ రామ ..
రామొజ్జ రామ రామ ... రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ ...రామొజ్జ రామ రామ
ఆరె ఉంటే పొటు లేదు
రామొజ్జ రామ రామ
నాగలుంటే ఎద్దు లేదు
రామొజ్జ రామ రామ
రాగడుంటే నీళ్లు లేవు
రామొజ్జ రామ రామ
చెమట నీళ్ల సేద్యము
రామొజ్జ రామ రామ
రక్తమే పెట్టుబడి
రామొజ్జ రామ రామ
అటు తిప్పి ఇటు తిప్పి
అబంతా పండించి
కల్లాలు ఉడిపించి బండ్ల మీదికెక్కించి
గుమ్మిలోన నింపించి కుంచమన్ని దీపించి
కుండలోన ఉడికించి
రామా... రామొజ్జ రామ రామ .... రామొజ్జ రామ రామ ... రామొజ్జ రామ రామ ... రామొజ్జ రామ రామ .. రామొజ్జ రామ రామ .
మేధారి నరసన్నా బుట్టాలు తేవంగా తట్టాలు తేవంగా
కమ్మారి గంగన్నా కత్తులు తేవంగా కొడవండ్లు తేవంగా
సాకాలి సమ్మన్నా బట్టాలు చుట్టంగా బట్టాలు చుట్టంగా
మాదిగా ఐలన్నా డప్పులు కొట్టంగా సప్పుడు చేయంగా
గొల్లోల్ల సులోచనా మోదుగాకు తేవంగా విస్తర్లు కుట్టంగా
నలుగురి చేతులతోటి నైవేద్యం తియ్యంగా నైవేద్యం తియ్యంగా
పోశమ్మ కానే కాదు
మైసమ్మ కానే కాదు
శివుడికి కానే కాదు
రాముడికి కానే కాదు
మావూరి దేవుడు
మాగుట్ట దేవుడు
బొగ్గుట్ట దేవుడు
మావూరి పటేలుకు నైవేద్యం బెడతాముల్లా
మావూరి పటేలుకు నైవేద్యం బెడతాముల్లా
రామ రామ రామ రామ రామొజ్జ రామ రామ రామ రామ రామ రామ రామొజ్జ రామ రామ...

Advertisement
Advertisement