త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Euphoria Review | యుఫోరియా రివ్యూ – ధురంధ‌ర్ హీరోయిన్ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్‌ మూవీ ఎలా ఉందంటే?

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన యుఫోరియా మూవీ శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 6న ) థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ సినిమాలో భూమిక‌, సారా అర్జున్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా ఎలా ఉందంటే?

a

Entertainment | Published On Feb 6, 2026, 12.30 am IST

Euphoria Review | యుఫోరియా రివ్యూ – ధురంధ‌ర్ హీరోయిన్ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్‌ మూవీ ఎలా ఉందంటే?
Advertisement

Euphoria Review |  ఒక్క‌డు, చూడాల‌ని ఉంది, అర్జున్ వంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌. భారీత‌నానికి, వైవిధ్య‌త‌కు ఆయ‌న సినిమాలు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచాయి. కానీ ఫామ్ కోల్పోవ‌డంతో గ‌త కొన్నాళ్లుగా గుణ‌శేఖ‌ర్ చేసిన సినిమాలేవి స‌రైన విజ‌యాల‌ను అందుకోలేదు. కొంత గ్యాప్ త‌ర్వాత యుఫోరియా మూవీతో ద‌ర్శ‌కుడిగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు గుణశేఖర్. భూమికా చావ్లా, సారా అర్జున్, విఘ్నేష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ శుక్ర‌వారం రిలీజైంది. యాక్ష‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన సినిమాను గుణ‌శేఖ‌ర్ కూతురు నీలిమ గుణ  నిర్మించారు. యుఫోరియాతో గుణ‌శేఖ‌ర్ డైరెక్ట‌ర్‌గా రీఎంట్రీ ఇచ్చారా? అత‌డికి విజ‌యం ద‌క్కిందా ? లేదా? అంటే?

వికాస్ అండ్ గ్యాంగ్ క‌థ‌....

చైత్ర (సారా అర్జున్‌) సివిల్స్ ప్రిపేర్ అవుతుంటుంది. ఐఏఎస్ అవ్వాల‌నే డ్రీమ్‌తో ఉంటుంది. స్నేహితురాలి బ‌ల‌వంతంతో ఓ ప‌బ్‌లో జ‌రిగే పార్టీకి వెళుతుంది. ఆ పార్టీలో ప‌రిచ‌య‌మైన వికాస్‌తో (విఘ్నేష్‌) పాటు అత‌డి న‌లుగురు స్నేహితులు చైత్ర‌ను రేప్ చేస్తారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై పోలీసుల‌కు కంప్లైంట్ ఇస్తుంది చైత్ర‌. పోలీస్ ఆఫీస‌ర్ జ‌య‌దేవ్ (గౌత‌మ్ మీన‌న్‌) ఈ కేసు ఇన్వేస్టిగేష‌న్ చేసే బాధ్య‌త‌ను తీసుకుంటాడు. ఐదుగురు కుర్రాళ్ల‌ను అరెస్ట్ చేస్తాడు. వికాస్ తండ్రి చ‌క్ర‌వ‌ర్తి (రోహిత్‌) రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. త‌ల్లి వింధ్యా (భూమిక‌) ఓ స్కూల్ ప్రిన్సిపాల్‌. మిగిలిన న‌లుగురు కుర్రాళ్ల తండ్రులు పొలిటిక‌ల్‌గా ప‌లుకుబ‌డి క‌లిగిన వ్య‌క్తులు కావ‌డంతో ఈ రేప్‌ కేసు సంచ‌ల‌నంగా మారుతుంది. ఐదుగురు స్నేహితుల‌కు వ్య‌తిరేకంగా సాక్ష్యాలు సంపాదించి వారికి యావ‌జ్జీవ శిక్ష ప‌డేలా చేస్తాడు జ‌య‌దేవ్. ఆ త‌ర్వాత ఏమైంది? జైలుకు వెళ్లిన కొడుకులో మార్పు కోసం వికాస్ త‌ల్లి వింధ్యా ఏం చేసింది? త‌ల్లి ప్రేమ వికాస్‌లో మార్పు తీసుకొచ్చిందా? త‌న‌కు శిక్ష వేయాల‌ని స్వ‌యంగా కోర్టును వింధ్యా ఎందుకు ఆశ్ర‌యించింది అన్న‌దే ఈ మూవీ యుఫోరియా మూవీ క‌థ‌.

ట్రెండ్ ప‌ట్టుకోవ‌డం ఈజీ కాదు...

మారుతున్న ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు అనుగుణంగా ట్రెండ్‌ను ప‌ట్టుకొని సినిమాలు తీయ‌డం ద‌ర్శ‌కుల‌కు తెలిసి ఉండాలి. లేదంటే ఔట్‌డేటెడ్ అయిపోతారు. అందులోనూ జెన్‌జీ ఆడియెన్స్ టేస్ట్‌లు వేగంగా మారిపోతున్నాయి. జెన్‌జీ ఆలోచ‌ల‌ను అందుకోవాలంటే ద‌ర్శ‌కులు కూడా వారి కంటే ఓ అడుగు ముందుగానే ఉండాలి. క‌థ‌లో మాత్ర‌మే కాకుండా టేకింగ్‌, మేకింగ్‌తో పాటు అన్నింటిలో కొత్త‌గా ప్ర‌య‌త్నించాలి. అదంతా ఈజీ కాదు.

టైటిల్ వ‌ర‌కే...

ఒక్క‌డు, చూడాల‌ని ఉందితో పాటు ప‌లు సినిమాల‌తో ఒక‌ప్పుడు స్టార్ హీరోలుకు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇచ్చాడు గుణ‌శేఖ‌ర్‌. ఆ త‌ర్వాత మూస ఫార్ములాల కార‌ణంగా అత‌డి గ‌త సినిమాలు స‌రైన విజ‌యాల‌ను సాధించ‌లేదు. దాంతో కెరీర్‌కు రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకొని యుఫోరియా సినిమా చేశాడు గుణ‌శేఖ‌ర్‌. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో తాను చాలా అప్‌డేట్ అయ్యానంటూ గుణ‌శేఖ‌ర్ పేర్కొన్నాడు. ఆయ‌న అప్‌డేట్ టైటిల్ వ‌ర‌కే ఆగిపోయింది. మేకింగ్‌లో అవే పాత వాస‌న‌లు క‌నిపించాయి.

యూత్ ఆడియెన్స్‌ను మెప్పించే సినిమా చేయాల‌నే ఆలోచ‌న మంచిదే. కానీ డ్ర‌గ్స్ వాడే సీన్లు, మ‌ద్యం, సిగెర‌ట్లు తాగుతూ క‌నిపించ‌డం...విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తించే క్యారెక్ట‌ర్లు ఇవి ఉంటేనే యూత్  సినిమా చూస్తార‌ని అనుకోవ‌డం చూస్తుంటే గుణ‌శేఖ‌ర్ మీద జాలి క‌ల‌గ‌క‌మాన‌దు.
అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారిన‌ జూబ్లీహిల్స్ రేప్ కేసు, దిశా ఎన్ కౌంటర్ తో పాటు న్యూస్ పేప‌ర్ల‌లో, టీవీల్లో వ‌చ్చిన కొన్ని క్రైమ్ సంఘ‌ట‌న‌ల‌ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి యుఫోరియా క‌థను గుణ‌శేఖ‌ర్‌ రాసుకున్న‌ట్లుగా అనిపిస్తుంది. పోనీ  తాను ఎంచుకున్న కథను  కట్రెస్టింగ్‌గా చెప్పారా అంటే అదీ లేదు.
యుఫోరియా ఫ‌స్ట్ హాఫ్ నేరం చేసి అరెస్ట్ అయిన వారిని పోలీసులు ఎలా విచారిస్తార‌నే ప్రొసీజ‌ర్‌ను చూపించే ఓ డాక్యుమెంట‌రీలా సాగుతుంది. క్రైమ్ రీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ సీన్, హాస్పిట‌ల్‌లో వికాస్ అండ్ గ్యాంగ్‌కు టెస్ట్ చేసే సీన్ల‌ను చూసి న‌వ్వాలో ఏడ‌వాలో అర్థం కాదు.

 సీరియస్ కాదు సిల్లీ...

క‌నీసం సెకండాఫ్‌లోనైనా గుణ‌శేఖ‌ర్ మార్కు క‌నిపిస్తుంది కావ‌చ్చు అని ఎదురుచూసిన ఆడియెన్స్‌కు అస‌లు తీసింది గుణ‌శేఖ‌రేనా అని అనుకునేలా చేశారు. అస‌లు తెర‌పై ఏం జ‌రుగుతుందో...డైరెక్ట‌ర్ ఏం చెప్పాల‌ని అనుకుంటున్నారో అంతు ప‌ట్ట‌దు. కొడుకులో మార్పు కోసం వింధ్యా చేసే ప్ర‌య‌త్నాల్లో సీరియ‌స్‌నెస్ సంగ‌తి ప‌క్క‌న‌పెడితే చాలా సిల్లీగా అనిపిస్తాయి.  కొడుకు లో మార్పు కోసం తల్లి కూడా డ్రగ్స్, మందు తాగడం అలవాటు చేసుకోవడం  అనే ఆలోచనే విడ్డూరంగా అనిపిస్తుంది. డ్రగ్స్  దందా అంటూ గౌత‌మ్ మీన‌న్ అండ్ గ్యాంగ్ చేసే హ‌డావిడి సినిమా ర‌న్‌టైమ్ పెర‌గ‌డానికి త‌ప్ప ఎందుకు ఉప‌యోగ‌ప‌లేదు. పోనీ ఆ సీన్ల‌కు క‌థ‌కు ఏమైనా లింక్ చేశారా అంటే ఆ ప్ర‌య‌త్నం చేయ‌లేదు ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా నిండా మైన‌స్‌లే క‌నిపిస్తాయి.  టైటిల్ కు సినిమాకు సంబంధం లేదు. దానికి తోడు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో సినిమా అంతా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది.

ఈ సినిమాలో ధురంధ‌ర్ ఫేమ్ సారా అర్జున్ హీరోయిన్ అన్నారు. కానీ సినిమా ఆరంభ‌మైన అర‌గంట త‌ర్వాత ఆమె పాత్ర క‌నిపించ‌దు. ఒక ర‌కంగా ఆమెది గెస్ట్ రోల్ అనుకోవ‌చ్చు. భూమిక చావ్లా తో పాటు వికాస్ పాత్ర‌చేసిన న‌టుడి యాక్టింగ్ ప‌ర్వాలేద‌నిపిస్తాయి. ఔట్‌డేటెడ్ క‌థ‌కు న్యాయం చేయ‌డానికి చాలానే క‌ష్ట‌ప‌డ్డారు. వారి శ్రమ వృథాగా మారిపోయింది. సీనియ‌ర్ హీరో రోహిత్ తండ్రి పాత్ర‌లో క‌నిపించాడు. ఎమోష‌న‌ల్ సీన్ల ఆక‌ట్టుకున్నాడు. గౌత‌మ్ మీన‌న్ పాత్ర‌, న‌ట‌న రెండు రొటీన్‌గా ఉన్నాయి.కాల‌భైర‌వ మ్యూజిక్ బాగున్నా క‌థ‌కు సంబంధం లేకుండా సాగిన‌ట్లుగా అనిపిస్తుంది.
యుఫోరియా టైటిల్‌లో ఉన్న క్రియేటివిటి సినిమాలో లేదు. ఈ సినిమాతో గుణ‌శేఖ‌ర్ అప్‌డేట్ సంగ‌తి ప‌క్క‌న‌పెడితే...మ‌రింత ఔట్‌డేట్ అయిన‌ట్లుగా అనిపిస్తుంది.

Advertisement
Advertisement