త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ENE Repeat Review | ఈ న‌గ‌రానికి ఏమైంది సీక్వెల్ ఎలా ఉందంటే? – త‌రుణ్ భాస్క‌ర్, విశ్వ‌క్ సేన్ న‌వ్వించారా? లేదా?

ఈ న‌గ‌రానికి ఏమైంది మూవీ సీక్వెల్‌గా వ‌చ్చిన ఈఎన్ఈ రిపీట్ గురువారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. విశ్వ‌క్‌సేన్‌, శ్రీనాథ్ మాగంటి, అభిన‌వ్ గోమ‌టం హీరోలుగా న‌టించిన ఈ సినిమాకు త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పార్ట్ వ‌న్ స్థాయిలో ఈ సీక్వెల్ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా? అంటే?

N

Entertainment | Published On Nov 19, 2026, 12.54 am IST

ENE Repeat Review | ఈ న‌గ‌రానికి ఏమైంది సీక్వెల్ ఎలా ఉందంటే? – త‌రుణ్ భాస్క‌ర్, విశ్వ‌క్ సేన్ న‌వ్వించారా?  లేదా?
Advertisement

ENE Repeat Review |  ఈ న‌గ‌రానికి ఏమైంది...చిన్న సినిమాగా రిలీజై టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. బ‌డ్డీ కామెడీ మూవీకి ఆరేళ్ల త‌ర్వాత సీక్వెల్ వ‌చ్చింది. ఈఎన్ఈ రిపీట్ పేరుతో రూపొందిన ఈ సీక్వెల్‌కు త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విశ్వ‌క్‌సేన్‌, శ్రీనాథ్ మాగంటి, అభిన‌వ్ గోమ‌టం, వెంక‌టేష్ కాకుమాను కీల‌క పాత్ర‌లు పోషించారు. గురువారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సీక్వెల్ ఎలా ఉందంటే?

న‌లుగురు స్నేహితుల క‌థ‌...

వివేక్ (విశ్వ‌క్‌సేన్‌), కౌశిక్ (అభిన‌వ్ గోమ‌టం), కార్తీక్‌(శ్రీనాథ్‌), ఉప్పు (వెంక‌టేష్‌) క‌లిసి ఓ సినిమా చేస్తారు. డిజాస్ట‌ర్ కావ‌డంతో స్నేహితుల మ‌ధ్య దూరం పెరుగుతుంది. ఈ ఫెయిల్యూర్ బాధ‌తో ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌డ‌మే మానేస్తాడు వివేక్‌. కార్తీక్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా సెటిల‌వుతాడు. కౌశిక్ యాక్ట‌ర్‌గా మార‌తాడు. ఉప్పు చిన్న సినిమాల‌కు ఎడిటింగ్ చేస్తూ బ‌తుకుబండిని లాగిస్తుంటారు. ఎంబీబీఎస్ చ‌దివే కీర్త‌న‌ సినిమాల‌పై ఇష్టంతో కార్తీక్ వ‌ద్ద అసిస్టెంట్‌గా జాయిన‌వుతుంది. కీర్త‌న తండ్రి రావు పెద్ద డాక్ట‌ర్‌. సినిమాల‌న్నా, క‌ళాకారుల‌న్నా అస్స‌లు న‌చ్చ‌దు. కీర్త‌న‌కు ఓ డాక్ట‌ర్ సంబంధం కుదుర్చుతాడు ఆమె తండ్రి. కానీ కీర్త‌న‌ను ఇష్ట‌ప‌డ్డ కార్తీక్‌... వివేక్‌, ఉప్పు, కౌశిక్‌ల‌తో క‌లిసి ఆ సంబంధం చెడగొడ‌తాడు. కూతురు పెళ్లి ర‌ద్దు కావ‌డానికి న‌లుగురు స్నేహితులే కార‌ణ‌మ‌ని వారిపై రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తాడు. కూతురు పెళ్లి కోసం తాను ఖ‌ర్చు చేసిన మొత్తం డ‌బ్బును ఇవ్వాల‌ని లేదంటే జైలుకు పంపిస్తామ‌ని వార్నింగ్ ఇస్తాడు.

ఆ డ‌బ్బు కోసం మ‌ళ్లీ వివేక్‌, కౌశిక్‌, కార్తీక్‌, ఉప్పు క‌లిసి ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తారు. స‌ర్వైవ‌ల్ సినిమా తీయ‌డానికి థాయ్‌లాండ్ వెళ‌తారు. అక్క‌డ వారికి ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయి? న‌లుగురు స్నేహితుల మ‌ధ్య గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మేమిటి? డాక్ట‌ర్ రావుతో చేసిన ఛాలెంజ్‌లో వారు గెలిచారా? రావులో మార్పు వ‌చ్చిందా? స్నేహితుల మంచి మ‌న‌సును వివేక్ ఎలా అర్థం చేసుకున్నాడు? అన్న‌దే ఈఎన్ఈ రిపీట్ మిగిలిన క‌థ‌.

సినిమా అంటే వినోద‌మేనా?

సినిమా అంటే కేవ‌లం వినోదానికి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌నే అపోహ చాలా మందిలో క‌నిపిస్తుంది. సినిమా క‌ళ‌ను, క‌ళాకారుల‌ను చిన్న‌చూపు చూస్తుంటారు. స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే శ‌క్తి సినిమాకు ఉంది. క‌ష్టాల్లో ఉన్న వారిని, జీవితంపై ఆశ కోల్పోయిన వారిని కొన్ని సార్లు ధైర్యంగా ముందుకు న‌డిపించే మాధ్య‌మంగా సినిమా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే మెసేజ్‌ను ఈఎన్ఈ రిపీట్ ద్వారా ఇచ్చారు డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్‌. విద్యా, వైద్యం వంటి రంగాల మాదిరిగానే సినిమా ఇండ‌స్ట్రీ కూడా గొప్ప‌దేన‌నే ఈ సినిమాతో చాటిచెప్పారు. ఇదివ‌ర‌క‌టిలా మెసేజ్‌ను లెక్చ‌ర్‌లా చెబితే ఆడియెన్స్ చూడ‌టం లేవు. న‌వ్విస్తూనే సందేశాన్ని ఇవ్వ‌డం ఇప్పుడు ట్రెండ్‌. ఈఎన్ఈ రిపీట్‌తో త‌రుణ్ భాస్క‌ర్ అదే ప‌ని చేశారు.

తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాకు సీక్వెల్‌గా ఈఎన్ఈ రిపీట్‌ను తెర‌కెక్కించారు త‌రుణ్ భాస్క‌ర్‌. పార్ట్ వ‌న్ నుంచి కేవ‌లం హీరోల పాత్ర‌ల‌ను మాత్ర‌మే తీసుకున్నారు. క‌థ‌, క‌థ‌నాల‌ను కొత్త‌గా రాసుకున్నారు.ఓ సినిమా తీసి త‌మ‌న తాము నిరూపించుకునే ప్ర‌య‌త్నంలో న‌లుగురు స్నేహితుల‌కు ఎదురైన ఇబ్బందులు, వారి గొడ‌వ‌లు, ఈగోల‌తో ఈ సీక్వెల్ సాగుతుంది.

సినిమా ఇండ‌స్ట్రీపై సెటైర్లు

త‌రుణ్ భాస్క‌ర్‌లో మంచి డైలాగ్ రైట‌ర్ ఉన్నాడు. ఇందులో సినిమా ఇండ‌స్ట్రీపై చాలానే సెటైర్లు వేశాడు. టాలీవుడ్‌లో సెంటిమెంట్ల‌కు ఎలాంటి వాల్యూ ఇస్తార‌నే దానిపై అత‌డు వేసిన పంచ్‌లు బాగ పేలాయి. డూప్‌ల వాడ‌కం ఎలా ఉంటుంద‌న్న‌ది చూపించారు.
ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ఎంచుకున్న క‌థ‌లో కామెడీని పండించే స్కోప్ చాలానే ఉంది. కానీ ఆ సిట్యూవేష‌న్స్‌ను స‌రిగ్గా వాడుకోలేదు. ఫ‌స్ట్ హాఫ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈఎన్ఈ రిపీట్ సాఫీగా సాగిపోతుంది. పెళ్లి చెడ‌గొట్టేందుకు కార్తీక్‌, కౌశిక్‌, ఉప్పు వేసిన ప్లాన్‌, రావు ఇంట్లో వారు చేసే అల్ల‌రి తాలూకు ఎపిసోడ్ బాగుంది. సినిమా తీయ‌డానికి ఎప్పుడైతే ఫ్రెండ్స్ గ్యాంగ్ థాయ్‌లాండ్ బ‌యలుదేరుతారో అక్క‌డి నుంచే కామెడీ డ్రాప్ అవుతూ వ‌చ్చింది.
స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ పేరుతో వివేక్, కౌశిక్ చేసే కామెడీ అస్స‌లు న‌వ్వించ‌లేదు. ఆ సీన్లు మొత్తం ఆడియెన్స్ ఓపిక‌కు ప‌రీక్ష‌లా మారుతాయి. న‌లుగురు ఫ్రెండ్స్ అర్థ‌ప‌ర్థం లేకుండా చీటికిమాటికి గొడ‌వ‌లు ప‌డ‌టం చిరాకును తెప్పిస్తుంది. పోనీ వారు తీసే సినిమాలోనైనా ఏదైనా వెరైటీ ఉంటుందా అంటే అదీ లేదు. హాలీవుడ్ సినిమాకు కాపీగా వ‌చ్చే ఆ సీన్ల‌ను భ‌రించ‌డం క‌ష్ట‌మే.
సినిమా పేరు ఎత్తితేనే కోపం ప‌ట్ట‌లేని రావు... వివేక్ చెప్పే ఒక్క డైలాగ్‌తో మారిపోవ‌డం సిల్లీగా అనిపిస్తుంది. స్నేహితులు తీసిన సినిమా హిట్ట‌వ్వ‌డం, వారు ఫేమ‌స్ అయిపోవ‌డం లాజిక్‌లెస్ ఫీలింగ్ క‌లిగిస్తుంది. ఇలా ఈ సీక్వెల్‌లో క‌థ ప‌రంగా చాలానేలోపాలు క‌నిపించాయి. త‌రుణ్ భాస్క‌ర్ కెరీర్‌లో క‌థ ప‌రంగా వీకెస్ట్ ఫిల్మ్ ఇదే అనిపిస్తుంది.

గెస్ట్‌లు....

ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లు చాలా మంది గెస్ట్‌లుగా క‌నిపించారు. సందీప్ వంగా, అనిల్ రావిపూడి, సుజీత్‌, అనుదీప్‌, నందినిరెడ్డి అతిథి పాత్ర‌ల్లో త‌ళుక్కున మెరిశారు. న‌లుగురు ఫ్రెండ్స్‌లో అభిన‌వ్ గోమ‌టం బాగా న‌వ్వించాడు. విశ్వ‌క్‌సేన్, శ్రీనాథ్ మాగంటి పాత్ర‌లు సెకండ్ పార్ట్‌తో తేలిపోయాయి. సినిమా మొత్తం విశ్వ‌క్‌సేన్ ఒకే ఎక్స్‌ప్రెష‌న్‌లో క‌నిపించాడు. శ్రీనాథ్ మాగంటి కామెడీ ప‌రంగా త‌డ‌బ‌డిపోయాడు. వెంక‌టేష్ కాకుమాను ఒకే. శివాత్మిక హీరోయిన్ మెటీరియ‌ల్‌లా అనిపించ‌దు.

రైట‌ర్‌గా...

డైరెక్ట‌ర్‌గా ఫెయిలైనా డైలాగ్ రైట‌ర్‌గా మాత్రం త‌రుణ్ భాస్క‌ర్ మెప్పించాడు. సినిమా ఇండ‌స్ట్రీపై త‌రుణ్ రాసిన డైలాగ్స్ ఆలోచింప‌జేస్తాయి. వివేక్ సాగ‌ర్ పాట‌ల్లో బ‌తుక‌మ్మ సాంగ్ పిక్చ‌రైజేష‌న్‌, సాహిత్యం బాగున్నాయి.

ఈ న‌గ‌రానికి ఏమైంది స్థాయిలో సీక్వెల్ న‌వ్వించ‌లేక‌పోయింది.

Advertisement
Advertisement