త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

S. Janaki | జాన‌కి తొలి సినిమా రిలీజ్ కాలేదు – తెలుగులో ఆమె పాడిన సూప‌ర్ హిట్ సాంగ్స్ ఇవే

దిగ్గ‌జ గాయ‌ని ఎస్ జాన‌కి సినీ ప్ర‌యాణం మాతృభాష తెలుగులో కాకుండా త‌మిళ సినిమాతో మొద‌లైంది. మొద‌టి సినిమా రిలీజ్‌కు నోచుకోలేదు. అంతే కాకుండా ఓ తెలుగు సినిమాకు జాన‌కి సంగీత కూడా అందించారు.

N

Entertainment | Published On Jul 11, 2026, 9.51 pm IST

S. Janaki | జాన‌కి తొలి సినిమా రిలీజ్ కాలేదు – తెలుగులో ఆమె పాడిన సూప‌ర్ హిట్ సాంగ్స్ ఇవే
Advertisement

S. Janaki |  దిగ్గ‌జ గాయ‌ని ఎస్ జాన‌కి మ‌ర‌ణంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ నివ్వెర‌బోయింది. తెలుగు సంగీత ప్రియుల‌కు జాన‌కితో విడ‌దీయ‌రాని అనుబంధముంది. ఒక్క తెలుగు భాష‌లోనే ప‌ది నుంచి ప‌న్నెండు వేల వ‌ర‌కు పాట‌ల‌ను ఆల‌పించారు జాన‌కి. ఆమె గొంతును ఓ గంగా ప్రవాహంగా అభిమానులు చెబుతుంటారు.వయసుతో నిమిత్తం లేనిది ఆమె స్వరంగా అభివర్ణిస్తుంటారు.

తొలి సినిమా రిలీజ్ కాలేదు...

టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో వ‌చ్చిన విధియిన్ విళైయాట్ట అనే తమిళ సినిమాలో తొలిసారిగా జాన‌కికి గాయ‌నిగా అవ‌కాశం వ‌చ్చింది. తెలుగు త‌ప్ప త‌మిళ‌మే రాని జాన‌కి కెరీర్ విచిత్రంగా ప‌ర భాష‌తో మొద‌లైంది. ఈ సినిమాలో రెండు పాట‌లు పాడింది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల జాన‌కి పాటల‌ పాడిన తొలి సినిమా విడుద‌ల‌కు నోచుకోలేదు. అదే ఏడాది ఎమ్మెల్యే సినిమాతో సింగ‌ర్‌గా టాలీవుడ్‌లోకి తొలి అడుగు వేసింది. తెలుగులో తొలి పాట ఘంటసాలతో క‌లిసి పాడింది. నీ ఆశ అడియాస చెయి జారే మణిపూస పాట పెద్ద హిట్ట‌వ్వ‌డ‌మే కాకుండా జాన‌కికి ఎన‌లేని పేరు తెచ్చిపెట్టింది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో జాన‌కి పాడిన మొద‌టి పాట‌ల‌న్నీ విషాద గీతాలే కావ‌డం గ‌మ‌నార్హం.

ప‌దిహేడు భాష‌ల్లో పాట‌లు...

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాష‌ల్లో జాన‌కి ఎక్కువ‌గా పాట‌లు పాడింది. ఇవే కాకుండా హిందీ, పంజాబీ, ఒరియా, తులు, కొంకణి, బడగ, సింహళం, ఇంగ్లీషు, సంస్కృతం, జర్మనీ, జపాన్ భాష‌ల్లో కూడా పాట‌లు ఆల‌పించారు.

భ‌క్తి గీతాలు...

శాస్త్రీయ సంగీతం నేర్చుకోక‌పోయినా త్యాగ‌రాజ కృతులు అద్భుతంగా ఆల‌పించి సంగీత ప్రియుల‌ను మెప్పించారు జాన‌కి. అప్ప‌ట్లో ఆమె భ‌క్తి గీతాలు తెలుగులో ఓ ట్రెండ్ సెట్ట‌ర్స్‌గా నిలిచాయి. సూర‌దాస్‌, క‌బీర్ దాస్‌తో పాటు మీరా భ‌జ‌న్స్‌ను  పాడటమే కాకుండా వాటికి సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తిరువయ్యూరులో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల‌కు వరుసగా మూడేళ్ళు గాత్ర కచేరి చేశారు. అన్నమాచార్య సంకీర్తనలు, కృష్ణ రవళి, నాద ప్రవాహం, అయ్యప్ప గీతికాష్టకం, శ్రీ వెంకటేశ్వర్య సుప్రభాతం, శ్రీ షిర్డీ సాయి గీతామాలిక తో పాటు ఎస్ జాన‌కి ఆల‌పించిన ఎన్నో భ‌క్తి గీతాల క్యాసెట్లు భారీగా అమ్ముడుపోయాయి.

సంగీత ద‌ర్శ‌కురాలిగా....

సింగ‌ర్‌గానే కాకుండా తెలుగులో మౌన‌పోరాటం సినిమాకు సంగీత ద‌ర్శ‌కురాలిగా జాన‌కి ప‌నిచేశారు. చందమామ రావే, జడ్జిమెంట్ సినిమాల్లో బేబి సుజిత పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పారు. ఘంటసాల,, వాణి జయరాం, కె.జె. ఏసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, , చిత్ర, , ఇళయరాజా, ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో జాన‌కి ప‌నిచేశారు.

జాన‌కి తెలుగు సూప‌ర్ హిట్ సాంగ్స్‌...

రాధమ్మ పెళ్ళి: ఆడది కోరుకునే వరాలు రెండే రెండు

అంకుశం: ఇది మమతల మేడకు ప్రాకారం

సాయిమహిమ: ఎంతెంత దయనీది ఓ సాయీ

మంచిమనసులు: ఓహో ఓహో పావురమా, జాబిల్లి కోసం ఆకాశమల్లే

బాలమిత్రుల కథ: గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళురెండున్నాయి

నీరాజనం: ఘల్లు ఘల్లున గుండె ఝల్లున

సప్తపది: మరుగేలరా ఓ రాఘవా, నెమలికి నేర్పిన నడకలివి, గోవుల్లు తెల్లన, ఏ కులము నీదంటే

శుభలేఖ: విన్నపాలు వినవలె

కార్తీకదీపం: ఆరనీకుమా ఈ దీపం

శ్రీవారికి ప్రేమలేఖ: తొలిసారి మిమ్మల్ని చూసింది, మనసా తుళ్ళిపడకే, లిపిలేని కంటిబాస

పదహారేళ్ళ వయసు: సిరిమల్లె పువ్వా

ప్రతిఘటన: ఈ దుర్యోధన దుశ్శాసన

సాగర సంగమం: ఓం నమశ్శివాయ, మౌనమేలనోయి ఈ మరుపురానిరేయి

సితార: వెన్నెల్లో గోదారి అందం, జిలి బిలి పలుకుల

అన్వేషణ: ఎదలో లయ ఎగసే లయ, కీరవాణి చిలకల కొలికిరో

భైరవద్వీపం: నరుడా ఓ నరుడా ఏమి కోరికా, అంబా శాంభవి భద్రరాజ గమనా

మరోచరిత్ర: పదహారేళ్ళకూ నీలో నాలో

నిరీక్షణ: ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది

అభినందన: చుక్కలాంటి అమ్మాయి, రంగులలో కలవో, మంచుకురిసే వేళలో

స్వర్ణ కమలం: ఆకాశంలో ఆశల హరివిల్లూ

శంకరాభరణం: సామజ వరగమనా

ముద్దమందారం: అలివేణీ ఆణిముత్యమా

కొండవీటి రాజా: మంచమేసి దుప్పటేసి

ప్రేమయుద్ధం: స్వాతిముత్యపు జల్లులలో

ఆఖరిపోరాటం: స్వాతి చినుకు సందెవేళలో

ఛాలెంజ్: ఇందువదన కుందరదన, ఓం శాంతి ఓం శాంతి

ఇంద్రుడు చంద్రుడు: సంధ్యారాగపు సరిగమలో

జగదేకవీరుడు - అతిలోకసుందరి: అందాలలో అహో మహోదయం, యమహో నీ యమ యమ అందం

మరణ మృదంగం: సరిగమ పదనిస

రాక్షసుడు: ఈడువచ్చాక ఇట్టావచ్చా, మళ్ళి మళ్ళి ఇది రాని రోజు, కోకిల కోకిల

కొండవీటి దొంగ: కోలో కోలమ్మ

ఆత్మబంధువు: పట్టి తెచ్చానులే

 

Advertisement
Advertisement