త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RGV on NEET | విద్యావ్యవస్థను చంపేయండి.. అసలు నీట్‌కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు?: ఆర్జీవీ సంచలన పోస్ట్

కేంద్ర మంత్రి రాజీనామా తర్వాత నీట్, విద్యావ్యవస్థపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత చదువులను ఆపేసి AI నేర్చుకోవాలని సూచించారు.

J

Entertainment | Published On Jul 28, 2026, 10.03 am IST

RGV on NEET | విద్యావ్యవస్థను చంపేయండి.. అసలు నీట్‌కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు?: ఆర్జీవీ సంచలన పోస్ట్

సంక్షిప్త సారాంశం

నీట్ వివాదం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో విద్యావ్యవస్థపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు. పదేళ్లు కష్టపడి డాక్టర్లు నేర్చుకునేది.. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చిటికెలో చెప్పేస్తుందని అన్నారు. ప్రస్తుతమున్న ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను చంపేయాలని, లేదంటే యువత భవిష్యత్తు నాశనమవుతుందని ఆయన హెచ్చరించారు. యువతకు కేవలం AI మాత్రమే నేర్పించాలని తల్లిదండ్రులకు, టీచర్లకు ఆయన సూచించారు.

Advertisement

RGV on NEET | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత.. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దేశంలోని విద్యావ్యవస్థపై, ముఖ్యంగా మెడికల్ కోర్సులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం శరవేగంగా దూసుకొస్తున్న ఈ తరుణంలో పాతకాలపు చదువులకు స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు.

"ఎడ్యుకేషన్‌ను చంపేయాలి"

నీట్ పేపర్ లీక్ (NEET paper leaks), ఇతర పరీక్షల అక్రమాలపై 'కాక్రోచ్ జనతా పార్టీ' (Cockroach Janta Party) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఎక్స్ వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. "ఎడ్యుకేషన్‌ను చంపేయాలి" (EDUCATION SHOULD BE KILLED) అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మెడికల్ చదువుల గురించి మాట్లాడుతూ.. ఒక మెడికల్ స్టూడెంట్ ఎంబీబీఎస్ (MBBS), పీజీ, స్పెషలైజేషన్ అంటూ పదేళ్ల పాటు చదివి నేర్చుకునే విషయాన్ని, జేబులో ఉండే AI అప్పటికే తెలుసుకుని ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

డాక్టర్లు టెస్టులు చేసి, డేటాను విశ్లేషించి ట్రీట్‌మెంట్ ఇస్తారని, కానీ AI ఎలాంటి అలసట లేకుండా ఇంతకంటే వేగంగా, కచ్చితత్వంతో అదే పని చేస్తోందని వర్మ అన్నారు. ఆధునిక AI పితామహుడు జెఫ్రీ హింటన్ (Geoffrey Hinton) కూడా ఇదే విషయాన్ని ఘోషిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. డయాగ్నోసిస్ అల్గారిథమ్ ద్వారా, సర్జరీలు రోబోల ద్వారా జరుగుతున్నప్పుడు మనుషులు కేవలం మధ్యవర్తులుగా మిగిలిపోతారని, దీనికోసం పదేళ్లు చదవాల్సిన అవసరం లేదని అన్నారు. రాబోయే ఒకటి రెండేళ్లలో డాక్టర్లు చేసే పనిని AI తీసుకుంటుందని నిపుణులు చెబుతుంటే.. విద్యార్థులు ఇంకా నీట్ కోసం ఎందుకు ప్రిపేర్ అవుతున్నారని ఆర్జీవీ ప్రశ్నించారు.

డిగ్రీలన్నీ కాగితాలుగా మిగిలిపోతాయి..

పాత విద్యావ్యవస్థ ఇప్పటికే మార్చురీలో ఉందని, దాన్ని పాతిపెట్టడానికి మనం ఎందుకు అంగీకరించడం లేదని ఆర్జీవీ నిలదీశారు. మొబైల్ ఫోన్‌కు తెలిసిన విషయాలను తాను ఎందుకు బట్టీ పట్టాలని అడిగే యువకుడిని పిచ్చివాడిగా చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. తల్లిదండ్రులు, టీచర్లు పాత సిలబస్‌ను పట్టుకుని వేలాడుతూ పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దని హెచ్చరించారు. AI ఉపయోగించడం నేర్పించని ఏ కోర్సు చదివినా వృథానే అని, ఇంజనీరింగ్, మెడిసిన్, లా, సీఏ (CA), ఎంబీఏ (MBA) లాంటివి పూర్తి చేసే సమయానికి ఆ డిగ్రీలన్నీ కేవలం కాగితాలుగా మిగిలిపోతాయని స్పష్టం చేశారు.

నెటిజన్ల రియాక్షన్.. బాలీవుడ్ మద్దతు

వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆన్‌లైన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోబోటిక్ సర్జరీల గురించి వర్మ చెప్పింది అబద్ధమని, ఎఫ్‌డీఏ (FDA) అప్రూవల్స్ చూసుకోవాలని ఒక యూజర్ విమర్శించగా.. దేశంలో ఎడ్యుకేషన్ అనేది అతిపెద్ద స్కామ్ అని, ఎల్‌కేజీ (LKG) కే 4 లక్షలు కడుతున్నారని, జాబ్ మార్కెట్ డిగ్రీలకు అతీతంగా మారాలని మరొకరు మద్దతు పలికారు. పేద విద్యార్థులకు ఈ చదువులే ఆధారమని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

కాగా, విద్యాశాఖ మంత్రి రాజీనామాకు ముందు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పేపర్ లీక్‌ను తీవ్రమైన సమస్యగా పేర్కొన్నారు. నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా, అభయ్ డియోల్, సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్‌ముఖ్ తదితర ప్రముఖులు కూడా విద్యార్థుల పోరాటానికి బహిరంగంగా మద్దతు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement