త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Election Commission | స‌ర్‌పై ఈసీలో అంత‌ర్గ‌త విభేదాలు.. జ్ఞానేశ్ కుమార్ నిర్ణ‌యాల‌పై ఇద్ద‌రు క‌మిష‌న‌ర్లు అభ్యంతరాలు

Election Commission | భారత ఎన్నికల సంఘంలో (ECI) అంతర్గత విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌నర్ జ్ఞానేశ్ కుమార్ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లు ఇద్ద‌రు క‌మిష‌న‌ర్లు ఆరోపించారు. ఈ విష‌యంపై వారు గత 10 నెలల్లోనే కనీసం 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు 'ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' సంచ‌ల‌న‌ కథనం వెలువ‌రించింది.

D

National | Published On Sep 23, 2026, 12.42 pm IST

Election Commission | స‌ర్‌పై ఈసీలో అంత‌ర్గ‌త విభేదాలు.. జ్ఞానేశ్ కుమార్ నిర్ణ‌యాల‌పై ఇద్ద‌రు క‌మిష‌న‌ర్లు అభ్యంతరాలు
Advertisement
  • సీఈసీ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌పై.. 10 నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు
  • ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంచ‌ల‌న‌ కథనం
  • భ‌గ్గుమ‌న్న ప్ర‌తిప‌క్షాలు
  • జ్ఞానేశ్ కుమార్ దేశ శత్రువు : అభిజీత్‌
  • ఓటర్ల జాబితా నియంత్రణ ఎవరి చేతిలో ఉంది
  • సీఈసీని ప‌ద‌వి నుంచి తొల‌గించాలి.. కాంగ్రెస్ డిమాండ్‌
  • సీఈసీ తొల‌గింపు కోసం రాజ్యసభలో 65 మంది ఎంపీల తీర్మానం

Election Commission | త్రినేత్ర న్యూస్ : దేశంలోనే అత్యున్నత స్వయంప్రతిపత్తి కలిగిన భారత ఎన్నికల సంఘంలో (ECI) అంతర్గత విభేదాలు మరోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈసీ దేశ‌వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేప‌డుతున్న 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్ర‌క్రియ‌కు సంబంధించి ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌పై ముగ్గురు సభ్యుల కమిషన్‌లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌నర్ జ్ఞానేశ్ కుమార్ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లు ఇద్ద‌రు క‌మిష‌న‌ర్లు ఆరోపించారు. ఈ విష‌యంపై వారు గత 10 నెలల్లోనే కనీసం 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు 'ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' సంచ‌ల‌న‌ కథనం వెలువ‌రించింది. బీహార్‌లో జూన్ 2025లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ SIR ప్రక్రియ.. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది. అయితే ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి ఏకంగా 13 కోట్ల మందికిపైగా పేర్లు గ‌ల్లంతైన‌ట్లు స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది. దీంతో ఓట‌ర్ల జాబితా రూప‌క‌ల్ప‌న‌లో ఎన్నిక‌ల సంఘం పాత్ర‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

మా ఆమోదం లేకుండానే..

SIR ప్రక్రియ దేశవ్యాప్త అమలు ముగ్గురు కమిషనర్ల పర్యవేక్షణలోనే జరిగింది. అయితే, ప్రక్రియకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తమకు తెలియకుండా, తమ ఆమోదం లేకుండానే జరిగాయని ముగ్గురు సభ్యుల కమిషన్‌లోని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీ ఆరోపించారు. ముఖ్యంగా ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపు, పునరుద్ధరణ, అప్పీళ్ల దాఖలు, ఓటర్ల జాబితా భద్రత వంటి కీలక అంశాలపై వీరు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ విష‌య‌మై గ‌త 10 నెలల్లో అధికారికంగా కనీసం 14 సార్లు రాతపూర్వక అభ్యంతరాలు తెలిపారు.

కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన 'ఫామ్ 6' (Form 6) లో చేసిన మార్పులపై ఈ ఇద్ద‌రు కమిషనర్లు అభ్యంతరం తెలిపారు. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం నుంచే ERONet నియంత్రణలను కేంద్రీకరించడాన్ని తప్పుబట్టారు. పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల తొలగింపులపై ECI తరఫున సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేయడం వెనుక ఎవరి అనుమతి ఉందనే అంశంపై అధికారులను ప్రశ్నించారు. ఎలక్టోరల్ రోల్స్ ఐటీ విభాగానికి సంబంధించిన పనుల కేటాయింపులో మార్పులపై సంధు, జోషీ వేర్వేరుగా కేబినెట్ కార్యదర్శికి లేఖలు కూడా రాశారు. తమ ప్రమేయం లేకుండా జరిగిన ఈ మార్పులను వారు తీవ్రంగా తప్పుబ‌ట్టారు.

2023 చ‌ట్టం ప్ర‌కారం ఎంపికైన ఈ ముగ్గురు ఉన్న‌తాధికారుల‌ను ఎన్డీయే ప్ర‌భుత్వ‌మే నియ‌మించింది. ప్ర‌భుత్వంచే నియ‌మితులైన ఈ ముగ్గురి మ‌ధ్య ఏకాభిప్రాయం లేక‌పోవ‌డం ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంతేకాదు, SIRపై ఇప్పటికే రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతున్న వేళ ఎన్నిక‌ల సంఘంలో తాజా పరిణామాలు ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియపై మరిన్ని అనుమానాల‌కు తావిస్తోంది.

విభేధాల‌ను ఖండించిన ఈసీ వ‌ర్గాలు

ఈసీలో విభేదాల‌పై వ‌స్తున్న వార్త‌ల‌ను ఎన్నికల సంఘం వర్గాలు కొట్టిపారేశాయి. కమిషనర్లు లేవ‌నెత్తిన అభ్యంత‌రాల‌ను చర్చల సమయంలో పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపాయి. SIR సహా అన్ని నిర్ణయాలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఇతర కమిషనర్ల సంతకాలతో ఏకగ్రీవంగానే జరిగాయని స్ప‌ష్టం చేశాయి.

ఓటర్ల జాబితా నియంత్రణ ఎవరి చేతిలో ఉంది..?

ఎన్నిక‌ల సంఘంలో నెల‌కొన్న అంత‌ర్గ‌త‌ విభేదాల‌పై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ క‌థ‌నంతో ఈసీ తీరుపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. దేశంలో ఎన్నికల నిర్వహణ పేరుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసీ తీరుపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఈ మేర‌కు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు తమకు ఎలాంటి సమాచారం లేదని, అంతా చీకట్లోనే జరిగిందని బహిరంగంగా చెబుతున్న‌ట్లు పేర్కొంది. అసలు ఓటర్ల జాబితా నియంత్ర‌ణ ఎవ‌రి చేతుల్లో ఉంది అంటూ ప్ర‌శ్నించింది.

జ్ఞానేశ్ కుమార్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదు

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు నడుచుకుంటున్నార‌ని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. రాజ్యాంగ బద్ధమైన తోటి అధికారులను పక్కనపెట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆయ‌నకు ఇక‌పై ఆ ప‌ద‌విలో కొన‌సాగే నైతిక హ‌క్కు లేద‌ని విమ‌ర్శించారు. ఓటు అనేది ప్ర‌తి పౌరుడికి రాజ్యాంగం క‌ల్పించిన ప్రాథ‌మిక హ‌క్కు అని అన్నారు. ఆ హ‌క్కును ఏక‌ప‌క్షంగా తొల‌గించ‌డం ప్ర‌జాస్వామ్యానికే ముప్పు అని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేశ వ్యాప్తంగా ఓట్ల చోరీకి జ్ఞానేశ్ కుమార్ ప్ర‌ధాన సూత్ర‌ధారిగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను పూర్తిగా దెబ్బతీసిన జ్ఞానేశ్ కుమార్‌ను వెంట‌నే ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిష్పాక్షిక‌మైన ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. జ్ఞానేశ్ కుమార్ త‌న ప‌ద‌విలో కొన‌సాగితే.. దేశ ప్ర‌జాస్వామ్యాన్నా కాపాడుకునేందుకు ప్ర‌జ‌లే స్వ‌యంగా రంగంలోకి దిగాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

ఆయ‌న దేశ శత్రువు

జ్ఞానేశ్ కుమార్ దేశ శత్రువు అని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే విమ‌ర్శించారు. స‌ర్‌ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 12 కోట్లకు పైగా పేర్లు గ‌ల్లంతైన‌ట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో ఉన్న సుమారు 97 కోట్ల మంది నమోదిత ఓటర్లతో పోలిస్తే, ఇది దాదాపు 12.4 శాతానికి సమానమ‌ని పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి, ప్రతిపక్షాలకు మధ్య కేవలం 2 శాతం ఓట్ల వ్యత్యాసం మాత్ర‌మే ఉంద‌ని గుర్తు చేశారు. ఇప్పుడు ఇంత భారీ సంఖ్యలో ఓట్లను తొలగించడం ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నారనే అనుమానం వ్య‌క్తం చేశారు. జ్ఞానేశ్ కుమార్ స్వ‌తంత్రంగా ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం లేద‌ని.. వాటికి ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

సీఈసీ తొల‌గింపున‌కు ప్ర‌తిప‌క్షాల‌ నోటీసు

ఓటర్ల జాబితా సవరణ (SIR)పై వివాదాలు, కమిషనర్ల మధ్య అంతర్గత విభేదాలు, ఏకపక్ష నిర్ణయాల నేప‌థ్యంలో ఈసీ తీరును వ్య‌తిరేకిస్తూ.. చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ క‌మార్‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ విప‌క్ష పార్టీలు పార్ల‌మెంట్‌లో ఇప్ప‌టికే తీర్మానం నోటీసు ఇచ్చాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) కింద దాదాపు 65 మంది ఎంపీలు సంత‌కాల‌తో కూడిన నోటీసును రాజ్య‌స‌భ చైర్మ‌న్ సీపీ రాధాకృష్ణ‌న్‌కు అంద‌జేశారు. స‌ర్ ప్ర‌క్రియ‌లో ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు, భారీ సంఖ్య‌లో ఓట‌ర్ల పేర్లు తొల‌గింపు, విధుల్లో ప‌క్ష‌పాత వైఖ‌రి వంటి అంశాల‌ను ఇందులో పేర్కొన్నారు. ఈ ప‌రిణామాల‌తో ఈసీ విశ్వ‌స‌నీయ‌త‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read..

సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్‌ల‌పై ఇక ఆకుప‌చ్చ‌, ఎరుపు రంగు చుక్క‌లు.. కొత్త నిబంధనలు..

సెల‌వుల‌కు ఇంటికి వ‌చ్చి.. అనుమానాస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని మృతి

2019 ఈస్టర్ ఆత్మాహుతి దాడుల కేసు.. 15 మందికి 200 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

Advertisement
Advertisement