Sankranthi Movies |సంక్రాంతి అంటేనే టాలీవుడ్‌లో అంతులేని జోష్ కనిపిస్తుంది. ప్రతి ఏటా సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల పోటాపోటీ ప్రమోషన్లు, బాక్సాఫీస్ రికార్డుల గురించిన చర్చలు, అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు కనిపించేవి. కానీ ఈ సారి సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కోర్టు కేసులు, వాయిదాలు, టికెట్ ధరల పెంపుల జీవోల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటితో పాటు థియేటర్ల సమస్య కొత్తగా మొదలైంది. జననాయగన్ పోస్ట్‌పోన్... ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన దళపతి విజయ్ తమిళ మూవీ జననాయగన్ మూవీ సెన్సార్ ఇబ్బందుల కారణంగా వాయిదాపడింది. ఈ సినిమాలోని పొలిటికల్ డైలాగ్స్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు కూడా శుక్రవారం రానుండటంతో మేకర్స్ జననాయగన్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రిలీజ్ ముగింట ఈ సినిమా పోస్ట్‌పోన్ కావడం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు నిర్మాతలు తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల కోసం కోర్టు వరకు వెళ్లారు. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకపోవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో రాజాసాబ్ ప్రీమియర్స్ ఉంటాయా? లేదా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏపీలో మాత్రం టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతులు వచ్చాయి. థియేటర్ల కోసం పోటీ... సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజ్ కాబోతుండటంతో థియేటర్ల కొరత ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ థియేటర్ల సమస్య కారణంగా తెలుగులో రిలీజ్ కావాల్సిన డబ్బింగ్ మూవీ పరాశక్తి వాయిదాపడినట్లు సమాచారం. మరోవైపు హక్కులను కొన్న డిస్ట్రిబ్యూటర్లు తమ సినిమాల కోసం థియేటర్లను బ్లాక్ చేస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ రాజాసాబ్ లాంటి పెద్ద సినిమాకే థియేటర్ల సమస్య ఎదురైనట్లు టాక్ వినిపిస్తోంది. రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి. రాజాసాబ్‌కు సహకరించకుండా థియేటర్ల ఇవ్వని వారి బండారాన్ని సంక్రాంతి తర్వాత ఓ ప్రెస్‌మీట్ పెట్టి బయటపెడతానని ఎస్‌కేఎన్ కామెంట్స్ చేశారు. ప్రమోషన్లలో కనిపించని హీరోలు మరోవైపు సంక్రాంతి ప్రమోషన్స్‌లో హీరోలు పెద్దగా కనిపించడం లేదు. రాజాసాబ్ రిలీజ్ ముగింట ప్రభాస్ అమెరికా వెళ్లారు. మన శంకర వరప్రసాద్‌గారు ప్రమోషన్స్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌తోనే చిరంజీవి, వెంకటేష్ మొదలుపెట్టారు. శర్వానంద్, రవితేజ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమాల ప్రమోషన్స్‌ను పక్కనపెట్టి కొత్త సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.