త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Akka Web Series Review | అక్క వెబ్ సిరీస్ రివ్యూ – హీరో పాత్ర లేకుండా క‌థ – లేడీ గ్యాంగ్‌స్ట‌ర్‌గా కీర్తి సురేష్ – విల‌న్‌గా రాధిక ఆప్టే!

గ్యాంగ్‌స్ట‌ర్ క‌థ‌ల‌న్నీ హీరోల చుట్టూనే తిరుగుతాయి. ఈ ట్రెండ్‌ను తిర‌గ‌రాస్తూ రూపొందిన వెబ్‌సిరీస్ అక్క‌. కీర్తి సురేష్‌, రాధికా ఆప్టే ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ హిందీ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

N

Entertainment | Published On Oct 31, 2026, 7.37 pm IST

Akka Web Series Review | అక్క వెబ్ సిరీస్ రివ్యూ – హీరో పాత్ర లేకుండా క‌థ – లేడీ గ్యాంగ్‌స్ట‌ర్‌గా కీర్తి సురేష్ – విల‌న్‌గా రాధిక ఆప్టే!
Advertisement

Akka Web Series Review | సినిమా ఇండ‌స్ట్రీలో హీరోల‌దే డామినేష‌న్‌. హీరో లేకుండా సినిమా, వెబ్ సిరీస్‌ల‌ను ఊహించ‌డం క‌ష్ట‌మే. ఫైట్, కామెడీ, ఎమోష‌న్స్ ఏదైనా హీరో పండించాల్సిందే. అస‌లు క‌థానాయ‌కుడి క్యారెక్ట‌ర్ లేకుండా ఓ క‌థ రాసుకుంటే...ఐడియానే కొత్త‌గా ఉంది. అంద‌రూ ఆడ‌వాళ్లే...అందులోనూ గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ... కీర్తి సురేష్‌ (Keerthy Suresh), రాధిక ఆప్టే (Radhika Apte) లాంటి టాలెంటెడ్ యాక్ట‌ర్లు ఇందులో భాగం కావ‌డంతో అక్క వెబ్‌సిరీస్ అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. బాలీవుడ్ (Bollywood) అగ్ర నిర్మాణ య‌శ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు ధ‌ర్మ‌రాజ్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ హిందీ వెబ్‌సిరీస్ రిలీజైంది.

పేర్నూర్‌లో...

పేర్నూరును ఒక‌ప్పుడు రాజులే పాలించేవారు కానీ యుద్దానికి వెళ్లిన వారు తిరిగిరాక‌పోవ‌డంతో రాజ్య‌పాల‌న బాధ్య‌త‌ల‌ను మ‌హిళ‌లు తీసుకుంటారు. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత కూడా ఇదే సంప్ర‌దాయం కొన‌సాగుతోంటుంది. రాణుల‌ను అక్క అనే పేరుతో పిలుస్తుంటారు. అక్క చెప్పిందే పేర్నూరులో వేదం. అక్క‌గా బాధ్య‌త‌లు చెప‌ట్టేవారు .పేర్నూరును మ‌లేమార్‌, ప‌ర్‌ప్లాడీ, హ‌ర‌క్క‌డ అనే మూడు సామ్రాజ్యాలుగా విభ‌జిస్తారు. మ‌లేమార్‌కు ముత్త‌క్క రాణిగా ఉంటుంది. ఆమె త‌ర్వాత అక్క‌గా భ‌వానీ (కీర్తి సురేష్‌) పేరును ప్ర‌క‌టిస్తారు. మ‌లేమార్‌లో జ‌రిగే సారా, బంగారం వ్యాపార వ్య‌వ‌హారాలు భ‌వానీ చూసుకుంటుంది. నంద‌ను ప్రేమిస్తుంది భ‌వానీ. అక్క‌గా సింహాస‌నాన్ని అదిష్టించేవారు పెళ్లిచేసుకోకూడ‌ద‌నే నిబంధ‌న వారి ప్రేమ‌కు అడ్డంకిగా మారుతుంది. అదే టైమ్‌లో ముంబై నుంచి పేర్నూర్‌లో రుద్ర (రాధిక ఆప్టే) అడుగుపెడుతుంది. భ‌వానీతో పాటు మిగిలిన అక్క‌ల‌ అధికారాన్ని, ఆధిప‌త్యాన్ని అంతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటుంది రుద్ర‌. మ‌హిళాధిప‌త్యాన్ని స‌హించ‌ని శ‌త్రువులంద‌రిని ఒక చోటుకి చేర్చుతుంది. రుద్ర చేసిన కుట్ర‌ల వ‌ల్ల భ‌వానీ మిన‌హా పేర్నూర్‌తో పాటు పార్‌ప్లాడీ, హ‌ర‌క్క‌డ‌లోని రాణులంద‌రూ చ‌నిపోతారు. ఆ త‌ర్వాత ఏమైంది? భ‌వానీతో రుద్ర‌కు ఉన్న శ‌త్రుత్వం ఏమిటి? అక్క‌ల కార‌ణంగా రుద్ర కుటుంబానికి ఎలాంటి అన్యాయం జ‌రిగింది? రుద్ర వేసిన ఎత్తుల‌ను భ‌వానీ ఏ విధంగా తిప్పికొట్టింది? అన్న‌దే ఈ వెబ్‌సిరీస్ క‌థ‌.

త‌డ‌బాటు...

కొన్ని ఐడియాలు పేప‌ర్‌పై రాసుకున్న‌ప్పుడు భ‌లేగా అనిపిస్తాయి. కానీ స్క్రీన్‌పై తీసుకురావ‌డంలోనే త‌డ‌బాటు క‌నిపిస్తుంది. అక్క విష‌యంలో అదే జ‌రిగింది. మాతృస్వామ్య వ్య‌వ‌స్థ ఇప్ప‌టికీ కొన్ని ప్రాంతాల్లో కొన‌సాగుతుంద‌ని చెబుతుంటారు. ఆ పాయింట్ చుట్టూ ద‌ర్శ‌కుడు కొత్త‌గా ఈ వెబ్‌సిరీస్ క‌థ‌ను రాసుకున్నాడు. రాణులే పాల‌కులు, గ్యాంగ్‌స్ట‌ర్లు అని, మ‌గ‌వాళ్లు వారు ఆజ్ఞ‌ల‌ను పాటించ‌డం త‌ప్పితే ఏం చేయ‌లేరంటూ పేర్నూరు ప్ర‌పంచంలోకి ఆడియెన్స్‌ను తీసుకెళ్లిన విధానం బాగుంది. త‌న వ్యాపారానికి అడ్డొచ్చిన శ‌త్రువును కీర్తి సురేష్ చంపే సీన్‌తోనే ఆమెలోని మాస్ కోణాన్ని చూపించారు.

క‌మ‌ర్షియ‌ల్ రూట్‌...

పేర్నూర్ క‌ట్టుబాటు, వారి వేష‌ధార‌ణ‌, ఆ ప్రాంతం ఆచారాలు, సంప్ర‌దాయాల‌ను డిఫ‌రెంట్‌గా సిరీస్‌లో చూపించారు. అక్క‌డి వ‌ర‌కు సిరీస్ ఎలాంటి లోపాలు లేకుండా సాఫీగా సాగిపోయింది. ఎప్పుడైతే అస‌లైన క‌థ మొద‌ల‌వుతుందో అక్క‌డి నుంచే క‌మ‌ర్షియ‌ల్ రూట్‌ను ఫాలో అయ్యారు డైరెక్ట‌ర్‌.

హీరో లేదంటే హీరోయిన్ కార‌ణంగా విల‌న్ కుటుంబానికి అన్యాయం జ‌ర‌గ‌డం, ఆ ప‌గ‌తో పెరిగిన విల‌న్‌...ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి దొంగ‌దెబ్బ తీయ‌డం, చివ‌ర‌కు విల‌న్ ఎత్తుల‌ను హీరో తిప్పికొట్ట‌డం అనే పాయింట్‌తో బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి బాలీవుడ్, టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు వ‌చ్చాయి. అక్క క‌థ కూడా ఇదే. ప‌గ‌లు, ప్ర‌తీకారాలు, అధికారం కోసం సాగే పోరాట‌ల నేప‌థ్యంలో న‌డుస్తుంది.

లాజిక్‌లెస్‌...

భ‌వానీ, రుద్ర పోరాటాన్ని ద‌ర్శ‌కుడు ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌లేక‌పోయారు. భ‌వానీని జైలుకు పంపిస్తుంది రుద్ర‌. కానీ ఆమె ఎలా రిలీజైంది అన్న‌ది చూపించ‌రు. భ‌వానీ చాలా ధైర్య‌వంతురాలు అన్న‌ట్లుగా ప‌రిచ‌యం చేస్తారు. కానీ కంటికి ఎదురుగానే శ‌త్రువు ఉన్న చివ‌రి వ‌ర‌కు ఏం చేయ‌కుండా ఎదురుచూస్తూ ఉండ‌టం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది.

లేడీ గ్యాంగ్‌స్ట‌ర్‌...

లేడీ గ్యాంగ్‌స్ట‌ర్‌గా కీర్తి సురేష్ గెట‌ప్‌, లుక్ బాగున్నాయి. మాస్ పాత్ర‌కు స‌రిగ్గా ఫిట్ కాలేద‌నిపించింది. ఆటూ ఇటూ న‌డ‌వ‌టం, కోపంగా చూడ‌టం త‌ప్పితే కీర్తి సురేష్ చేసిందేమి లేదు. కీర్తి సురేష్‌ను రాధికా ఆప్టే చాలా చోట్ల డామినేట్ చేసింది. క‌ళ్లు, ఎక్స్‌ప్రెష‌న్స్‌తోనే న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. వీరిద్ద‌రి చుట్టే క‌థ మొత్తం న‌డుస్తుంది. వెబ్‌సిరీస్‌లో చాలా మంది యాక్ట‌ర్లు క‌నిపిస్తారు. కానీ ఎవ‌రూ పెద్ద‌గా ఎలివేట్ కాలేదు. టెక్నిక‌ల్ వాల్యూస్ సినిమాల‌కు మించి ఉన్నాయి. కాస్ట్యూమ్ డిజైన‌ర్స్‌, సినిమాటోగ్ర‌ఫీ, ఆర్ట్ డైరెక్ట‌ర్లు ప్ర‌తి ఒక్క‌రూ త‌మ విభాగానికి న్యాయం చేశారు.

అక్క ఐడియా వ‌ర‌కే బాగుంది. కీర్తి సురేష్ యాక్టింగ్ కోసం ఓ సారి చూడొచ్చు.

 

 

 

ట్యాగ్స్:

Akka Web SeriesAkka Web Series Telugu ReviewBollywood Web SeriesDhramaraj ShettyGangstar Web SeriesKeerthy SureshRadhika ApteYashraj Films
Advertisement
Advertisement