త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | ఆ ఓట్లను తొలగించకూడదా? కాంగ్రెస్‌కు బండి సంజయ్ సూటి ప్రశ్నలు

SIR | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తప్పుబట్టారు. చనిపోయిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, అక్రమ వలసదారుల పేర్లను జాబితా నుంచి తొలగించకూడదా? అని ప్రశ్నించారు.

P

Telangana | Published On Oct 31, 2026, 7.11 pm IST

SIR | ఆ ఓట్లను తొలగించకూడదా? కాంగ్రెస్‌కు బండి సంజయ్ సూటి ప్రశ్నలు
Advertisement

SIR | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తప్పుబట్టారు. చనిపోయిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, అక్రమ వలసదారుల పేర్లను జాబితా నుంచి తొలగించకూడదా? అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించారంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం విడుదలైంది ముసాయిదా ఓటర్ల జాబితా మాత్రమేనని తెలిపారు. ఇందులో 2.8 కోట్ల మంది మరణించిన ఓటర్లు, కోటి మందికిపైగా డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. మరో 6.30 కోట్ల మంది శాశ్వతంగా వలస వెళ్లారని, వారి ఆచూకీ తెలియకపోవడంతో ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చినా స్పందన రాలేదన్నారు. ఇలాంటి పేర్లను జాబితాలో కొనసాగించాలా? అని కాంగ్రెస్ నేతలను నిలదీశారు.

గతంలో పదిసార్లు కాంగ్రెస్ హయాంలోనే..

1952 నుంచి 2025 వరకు దేశంలో 12 సార్లు స‌ర్ ప్రక్రియ చేపట్టగా.. అందులో పదిసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జరిగిందని బండి సంజయ్ గుర్తుచేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ పాలనలోనూ ఈ ప్రక్రియ అమలైందన్నారు. అప్పుడు అభ్యంతరం చెప్పని కాంగ్రెస్.. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిస్తే ఈసీ పనితీరు బాగుందని, ఓడిపోతే ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలోనూ ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు. 2004 నుంచి ఇప్పటివరకు 18.07 లక్షల మంది మరణించారని, మరో 6.70 లక్షల ఓట్లు పేరు, ఊరు వివరాలు లేని డూప్లికేట్ నమోదులుగా ఉన్నాయని చెప్పారు. పాతబస్తీ, మహేశ్వరం నియోజకవర్గాల్లో విదేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారి పేర్లతోనూ వేల సంఖ్యలో ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఇలాంటి పేర్లను తొలగించడాన్ని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు.

సిక్కులకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి

కాంగ్రెస్ పార్టీ ముందుగా సిక్కులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 1984లో కాంగ్రెస్ పాలనలో జరిగిన సిక్కుల ఊచకోత ఘటనను ప్రస్తావిస్తూ.. ఆ విషాదంపై దేశం చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు రాష్ట్రంలో రైతులు పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సైనికుల త్యాగాలను అవమానించడం, మీడియా, సుప్రీంకోర్టు వంటి వ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రజాస్వామ్య సంస్థలపై విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో పేరు తొలగినంత మాత్రాన ఓటు హక్కు శాశ్వతంగా పోదని, అవసరమైన ఆధారాలు సమర్పించి తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని బండి సంజయ్ తెలిపారు. నిజంగానే 13 కోట్ల ఓట్లు తొలగించారని కాంగ్రెస్ భావిస్తే.. సంబంధిత ఓటర్ల వివరాలు, ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, బీజేపీ నేతలు బండారి శాంతికుమార్, ప్రకాశ్ రెడ్డి, ఎన్వీ సుభాష్, జె. సంగప్ప, సునీత పాల్గొన్నారు.

ట్యాగ్స్:

Bandi SanjayCongress PartyDuplicate VotersElection Commission Of IndiaElectoral RollsIllegal ImmigrantsSpecial Intensive RevisionTelugu NewsVoter List Revision
Advertisement
Advertisement