త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivasa Mangapuram Review | శ్రీనివాస మంగాపురం రివ్యూ – మ‌హేష్ బాబు అన్న కొడుకు మూవీ హిట్టా? ఫ‌ట్టా?

సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌న‌వ‌డు జై కృష్ణ హీరోగా న‌టించిన శ్రీనివాస మంగాపురం మూవీ గురువారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ర‌వీనా టాండ‌న్ కూతురు ర‌షా త‌డానీ హీరోయిన్‌గా న‌టించిన ఈ ల‌వ్‌స్టోరీ ఎలా ఉందంటే?

N

Entertainment | Published On Jul 30, 2026, 1.47 pm IST

Srinivasa Mangapuram Review | శ్రీనివాస మంగాపురం రివ్యూ – మ‌హేష్ బాబు అన్న కొడుకు మూవీ హిట్టా? ఫ‌ట్టా?
Advertisement

Srinivasa Mangapuram Review |  శ్రీనివాస మంగాపురం మూవీతో మ‌హేష్‌బాబు అన్న కొడుకు జై కృష్ణ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆర్ఎక్స్ ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ర‌వీనా టాండ‌న్ కూతురు ర‌షా త‌డానీ హీరోయిన్‌గా న‌టించింది. యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీ గురువారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. శ్రీనివాస మంగాపురం ఎలా ఉంది? ఈ సినిమాతో జై కృష్ణ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడా? లేదా? అంటే?

శీను...మంగ ప్రేమ‌క‌థ‌...

శీను (జై కృష్ణ‌) తిరుప‌తిలోకి కొత్త‌గా అడుగుపెడ‌తాడు. తిరుప‌తినే గ‌డ‌గ‌డ‌లాడించే పెద్ది రెడ్డి (కిక్ శ్యామ్‌) కూతురు మంగ‌తో (ర‌షా త‌డానీ)తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. మంగ‌కు అప్ప‌టికే మ‌రో అబ్బాయితో పెళ్లి ఫిక్స‌వుతుంది. అయినా శీను... మంగ త‌న‌కే ద‌క్కాల‌ని ప‌ట్టుప‌డ‌తాడు. ఆమె మెడ‌లో తాళిప‌డేవ‌ర‌కు త‌న ప్ర‌య‌త్నాలు ఆప‌డు. అప్పుడే ఇంట‌ర్‌మీడియ‌ట్ అయిన‌ట్లుగా క‌నిపించే శీనుకు బాషా రేంజ్ ఫ్లాష్‌బ్యాక్ ఉంద‌ని తెలుస్తుంది. బ‌ళ్లారికి కింగ్ మేక‌ర్ అయిన వెంక‌ట‌ప్ప‌య్య‌నాయుడు (మోహ‌న్‌బాబు) మ‌న‌వ‌డు అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. బ‌ళ్లారిలో వాసుబాబుగా ఫేమ‌స్ అయిన శీను...ఓ అమ్మాయి కోసం తిరుప‌తి ఎందుకొచ్చాడు? కూతురి ప్రేమ‌కు పెద్దిరెడ్డి ఎందుకు అడ్డుచెప్పాడు? శీను ప్రేమ మంగ మ‌నుసు మార్చిందా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

హీరోహీరోయిన్లు కొత్త కానీ...

శ్రీనివాస మంగాపురం మూవీతో సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌న‌వ‌డు, మ‌హేష్ బాబు అన్న కొడుకు జై కృష్ణ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదే సినిమాతో బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ ర‌వీనా టాండ‌న్ కూతురు కూడా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది. ఒకే సినిమాతో టాలీవుడ్‌, బాలీవుడ్ వార‌సులు ఎంట్రీ ఇవ్వ‌డం అరుదు. అందుకే శ్రీనివాస మంగాపురంపై అంచ‌నాలు భారీగానే ఏర్ప‌డ్డాయి. కానీ ఆ అంచ‌నాల‌కు అందుకోవ‌డంలో మాత్రం పూర్తిగా విఫ‌ల‌మైంది. ఈ సినిమాలో హీరోహీరోయిన్ల ఎంపిక‌లోనే ద‌ర్శ‌కులు కొత్త‌గా ఆలోచించారు. మిగిలిన క‌థ‌, క‌థ‌నాలు, కామెడీ , ల‌వ్‌స్టోరీ....ప్ర‌తి విష‌యంలో అడుగ‌డుగునా పాత వాస‌న‌ల‌తో ఈ సినిమా నిండిపోయింది. హీరోయిన్‌ను చూడ‌గానే హీరో ప్రేమ‌లో ప‌డిపోవ‌డం...హీరోయిన్ తండ్రి పెద్ద రౌడీ కావ‌డం... అయినా హీరో ధైర్యంగా ఎదురించ‌డం...జ‌న‌రేష‌న్లు మారిన తెలుగు ద‌ర్శ‌కులు మాత్రం ఇంకా ఈ మూస‌నే ఫాలో అవుతున్నారు. శ్రీనివాస మంగాపురం కూడా అలాంటి టెంప్లేట్ ఫార్మెట్‌తోనే మొద‌ల‌వుతుంది. శీను...మంగ‌ గ‌తంలోనే ప్రేమించుకున్నారు...కానీ ఓ ప్ర‌మాదంలో మంగ త‌న గ‌తం మ‌ర్చిపోయిందంటూ చూపిస్తూ పోను పోను క‌థ‌ను బ్లాక్ అండ్ వైట్ కాలంలోకి తీసుకెళ్లిపోయారు.

ఓపిక‌కు ప‌రీక్ష

ఓటీటీ రాక‌తో వ‌ర‌ల్డ్ సినిమానే అర‌చేతిలోకి వ‌చ్చింది. కొత్త‌ద‌నం ఉంటేనే కానీ జెన్‌జీ ఆడియెన్స్ థియేట‌ర్ల‌వైపు క‌న్నెత్తి చూడ‌టం లేదు. ఇలాంటి టైమ్‌లో ఇంకా అరిగిపోయిన పాత క‌థ‌ల‌నే తిప్పి ఇంకా ఏ ధైర్యంతో సినిమాలు తీస్తున్నారో అర్థం కాదు.
పాత క‌థ‌ను చెప్పాల‌ని అనుకున్న‌ప్పుడు సీన్లు, స్క్రీన్‌ప్లేలోనే కొత్త‌గా ఆలోచించాలి. అదీ లేదు. సినిమా క్లైమాక్స్ ఏమిటో ఫ‌స్ట్ సీన్‌తోనే తెలిసిపోతుంది. స‌మ‌యం సంద‌ర్భం లేకుండా ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి వ‌చ్చే పాట‌లు, కామెడీ పేరుతో చిరాకు పుట్టించే క్యారెక్ట‌ర్లు.....ఎందుకున్నారో కూడా తెలియ‌ని విల‌న్లు... ఇలా శ్రీనివాస మంగాపురం అడుగ‌డుగునా ఓపిక‌కు ప‌రీక్ష పెడుతుంది. ఎప్పుడైపోతుందా అని ఎదురుచూసేలా చేస్తుంది.

ఒకే ఎక్స్‌ప్రెష‌న్‌...

జై కృష్ణ‌కు హీరోగా ఇదే డెబ్యూ మూవీ. సినిమా మొత్తం ఒకే ఎక్స్‌ప్రెష‌న్‌తో క‌నిపించాడు. ల‌వ్‌, ఎమోష‌న‌ల్‌, సెంటిమెంట్‌.. సీన్ ఏదైనా అత‌డి ఎక్స్‌ప్రెష‌న్ మాత్రం మార‌లేదు. డ్యాన్సుల్లో తేలిపోయాడు. ఒక్క యాక్ష‌న్ సీన్ల‌లో ఒకే అనిపించాడు. హీరోయిన్ ర‌షా త‌డానీ న‌ట‌న‌లో జై కృష్ణ‌ను మించి పోయింది. ఏ సీన్‌కు ఎలాంటి ఎక్స్‌ప్రెష‌న్ ఇవ్వాలో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్‌లో సినిమాను కంప్లీట్ చేసింది. మోహ‌న్‌బాబు లాంటి సీనియ‌ర్ యాక్ట‌ర్‌ను డైరెక్ట‌ర్ స‌రిగ్గా వాడుకోలేదు. నాలుగైదు సీన్ల‌కు ఆయ‌న‌ను ప‌రిమితం చేశారు.కిక్ శ్యామ్‌, సీనియ‌ర్ న‌రేష్‌, వాసుకి, బ్ర‌హ్మాజీ...అంద‌రి ఇంట్ర‌డ‌క్ష‌న్లు అదిరిపోతాయి. ఆ క్యారెక్ట‌ర్ గ్రాఫ్‌ను మెయింటేన్‌చేయ‌లేక‌పోయారు.

సంబంధం లేదు...

రొటీన్ స్టోరీని ఎంచుకోవ‌డంలోనే ద‌ర్శ‌కుడిగా స‌గం ఫెయిల‌య్యాడు అజ‌య్ భూప‌తి. ఆర్ఎక్స్ 100 లాంటి ల‌వ్‌స్టోరీ తీసిన డైరెక్ట‌రేనా శ్రీనివాస మంగాపురం తీసింది అనే అనుమానం క‌లుగుతుంది. టైటిల్‌కు సినిమా క‌థ‌కు ఎక్క‌డ సంబంధం క‌నిపించ‌దు. జీవీ ప్ర‌కాష్ కుమార్ పాట‌లు ఇది వ‌ర‌కు విన్న‌ట్లుగానే అనిపిస్తాయి. లైవ్ లోకేష‌న్ల‌లో సినిమాను షూట్ చేయ‌డం ప్ల‌స్స‌య్యింది. గురువు ఆర్‌జీవీ టెక్నిక్‌ను ఫాలో అయ్యాడు. అదొక్క‌టి బాగుంది. మిగిలిన విష‌యాల్లో సినిమా తేలిపోయింది. తిరుప‌తి బ్యాక్‌డ్రాప్ నిర్మాత‌ అశ్వ‌నీద‌త్‌కు అచ్చిరాలేదు. అప్ప‌ట్లో తిరుప‌తి పైనే గోవిందా గోవిందా తీశాడు. ఇప్పుడు శ్రీనివాస మంగాపురం. రెండింటి రిజ‌ల్ట్ సేమ్‌.

శ్రీనివాస మంగాపురం అనే క్లాస్ టైటిల్ చూసి మంచి ల‌వ్‌స్టోరీ అనుకొని థియేట‌ర్‌కు వెళితే మోస‌పోయిన‌ట్లే. కంప్లీట్ ఔట్‌డేటెడ్ మూవీ. చివ‌రి వ‌ర‌కు చూడ‌టం అంటే సాహ‌స‌మే.

Advertisement
Advertisement