త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Golla Ramavva Review | గొల్ల రామ‌వ్వ రివ్యూ – తెలంగాణ క‌థకు, భాషకు అవమానం

దివంగ‌త ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు రాసిన గొల్ల రామ‌వ్వ క‌థ‌తో ఇటీవీ విన్‌లో ఇటీవ‌ల ఓ మినీ మూవీ రిలీజైంది. గొల్ల రామ‌వ్వ పేరుతోనే తెర‌కెక్కిన ఈ సినిమాకు ముళ్ల‌పూడి వ‌రా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మినీ మూవీలో ఎలా ఉందంటే?

N

Entertainment | Published On Jan 28, 2026, 1.02 pm IST

Golla Ramavva Review |   గొల్ల రామ‌వ్వ రివ్యూ – తెలంగాణ క‌థకు, భాషకు అవమానం
Advertisement

Golla Ramavva Review | తెలంగాణ చ‌రిత్ర గతిని మ‌లుపుతిప్పిన వాటిలో తెలంగాణ సాయుధ పోరాటం ఒక‌టి. నిజాం నిరంకుశ పాల‌న‌కు వ్య‌తిరేకంగా త‌మ భూమి, భుక్తి, విముక్తితో పాటు యాస‌, భాష‌ల‌ను కాపాడుకోవ‌డానికి సామాన్య ప్ర‌జ‌లు చేసిన ఈ అసామాన్య పోరాటం ఎంతో మందికి స్ఫూర్తిదాయ‌కంగా నిలిచింది. నిజాం వ్య‌తిరేక పోరాటంతో.. అందులోని క‌థ‌లు, వ్య‌థ‌లు, గాథ‌ల‌తో తెలంగాణ‌లోని కొన్ని త‌రాల‌కు విడదీయరాని అనుబంధముంది. ఈ పోరాటంలో తెలంగాణ ప్ర‌జ‌లు చూపించిన తెగువ‌, పరాకమ్రం గురించి త‌లుచుకుంటే చాలా ఉద్వేగం, ఉక్రోషం క‌లుగుతుంటాయి. ఒక ప్రాంతీయ అస్థిత్వాన్ని, క‌న్నీటి వ్య‌థ‌ల‌ను చాటిచెప్పే తెలంగాణ సాయుధ పోరాటం నేప‌థ్యంలో ఎన్నో క‌థ‌లు, న‌వ‌ల‌లు వ‌చ్చాయి. వాటిలో మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు రాసిన గొల్ల రామ‌వ్వ క‌థ ఒక‌టి.

నాట‌కీయ‌త‌...

నిజాం సైనికుల‌ను హ‌త‌మార్చి త‌ప్పించుకొని పారిపోతున్న ఓ యువ‌కుడికి ఓ వృద్ధురాలు ఆశ్ర‌యం ఇవ్వ‌డం... అత‌డిని నిజాం సైనికుల బారి నుంచి ఎలా కాపాడుతుంది అన్న‌దే గొల్ల రామ‌వ్వ క‌థ‌. ఈ చిన్న సంఘ‌ట‌న‌కు నాట‌కీయత‌ను జోడించి మంచి క‌థ‌గా మ‌లిచారు పీవీ న‌ర‌సింహారావు. ఆనాటి సామాజిక ప‌రిస్థితులు, నిజాం పాల‌న‌లో ప్ర‌జ‌లు ప‌డే అగ‌చాట్ల‌ను త‌న ర‌చ‌న శైలి ద్వారా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా చూపించారు. అచ్చ‌మైన తెలంగాణ యాస‌తో ఇక్క‌డి మ‌ట్టి వాస‌న‌ను, జీవ‌న సంస్కృతిని, మ‌నుషుల్లోని మాన‌వ‌త్వాన్ని ప్ర‌తిబింబిస్తూ ఈ క‌థ‌ను సాగుతుంది.

గొల్ల రామ‌వ్వ క‌థ‌తో ఈటీవీ విన్‌లో ఇటీవ‌ల ఓ మినీ మూవీ రిలీజైంది. పీవీ న‌ర‌సింహారావు క‌థ‌తోనే ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ మినీ మూవీకి ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత ముళ్ల‌పూడి ర‌మ‌ణ త‌న‌యుడు ముళ్ల‌పుడి వ‌రా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఫిక్ష‌న‌ల్ పేరుతో వ‌క్రీక‌ర‌ణ‌...

గొల్ల రామ‌వ్వ మినీ మూవీలో తెలంగాణ ఆన‌వాళ్లు మ‌చ్చుకైనా లేవు. తెలంగాణ డైలాగ్ ఒక్క‌టంటే ఒక్క‌టి వినిపించ‌దు. గొల్ల రామ‌వ్వ క‌థ‌కు.. మినీ మూవీకి ఎక్క‌డ పోలిక క‌నిపించ‌దు. య‌థార్థ గాథ‌ను ఉన్న‌ది ఉన్న‌ట్లుగా తెర‌కెక్కించ‌డం ఎవ‌రికీ సాధ్యం కాక‌పోవ‌చ్చు. కొంత ఫిక్ష‌న‌ల్ అంశాలు జోడించ‌డం త‌ప్ప‌నిస‌రి. కానీ ఫిక్ష‌న‌ల్ పేరుతో అస‌లు క‌థ‌ను వ‌క్రీక‌రించ‌డం మాత్రం క్ష‌మార్హం కాదు.

తెలంగాణ యాస‌ను, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ పోరాటాన్ని అప‌హాస్యం చేసిన‌ట్లుగానే ఈ సినిమా క‌నిపిస్తుంది. గొల్ల రామ‌వ్వ క‌థ‌లోని ఆత్మను ప‌ట్టుకోలేక‌లేక‌పోయారు మేక‌ర్స్‌. ఈ క‌థ‌ను బ‌లంగా చెప్పాల‌నే త‌ప‌న మేక‌ర్స్‌లో క‌నిపించ‌లేదు. ముళ్ల‌పూడి వ‌రా టాలెంట్ డైరెక్ట‌ర్.. అయినా గొల్ల రామ‌వ్వ క‌థ‌ను ఓన్ చేసుకోలేక‌పోయాడ‌నే భావ‌న క‌లుగుతుంది.

స‌హ‌జ‌త్వం లేదు...

గొల్ల రామ‌వ్వ క‌థ‌ను నేటి ఆడియెన్స్ అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లుగా మ‌రింత ఉద్వేగంగా చెప్పాల‌నే ఆలోచ‌న‌తో మేక‌ర్స్ కొన్ని మార్పులు చేశారు. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించారు. కానీ అవే ఈ సినిమాకు మైన‌స్‌గా మారాయి. గొల్ల రామ‌వ్వ‌ ప్రామాణిక‌త‌ను దెబ్బ‌తీసిన‌ట్లుగా అనిపించాయి.

గొల్ల రామ‌వ్వ క‌థ‌కు తెలంగాణ భాష వ‌ల్లే ప్ర‌త్యేక‌త వ‌చ్చింది. ఆ యాస లేకుండా సినిమా తెర‌కెక్కించ‌డంతో జీవమే లేకుండాపోయింది. తెలంగాణ నేల‌పై పుట్టిన వారే ఇక్క‌డి యాస‌ను స్వ‌చ్ఛంగా మాట్లాడ‌గ‌ల‌రు. ప్రాంతీయేత‌రుల్లో ఆ స‌హ‌జ‌త్వం క‌నిపించ‌దు. గొల్ల రామ‌వ్వ‌లో న‌టించిన వారెవ‌రూ తెలంగాణ వాళ్లు కాదు. వారు చెప్పిన డైలాగ్స్‌లో తెలంగాణ‌త‌నం ఎక్క‌డ క‌నిపించ‌లేదు.

తెలంగాణ వారే తీయాల‌ని లేదు...

తెలంగాణ క‌థ‌లతో తెలంగాణ వారే సినిమాలు తీయాల‌ని లేదు. మృణాల్ సేన్ వంటి ప‌రాభాషా ద‌ర్శ‌కులు తెలంగాణ క‌ల్చ‌ర్‌ను, ఇక్క‌డి సామాజిక అంత‌రాల‌ను త‌మ సినిమాల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారు. తెలంగాణ నేలను, ఇక్క‌డ జీవ‌నాన్ని త‌మ సినిమాలో చూపించారు. అంతేకానీ క్రియేటివిటీ పేరుతో లేనిది ఉన్న‌ట్లుగా చూపించలేదు. ఆంధ్ర ద‌ర్శ‌కులు మాత్రం తెలంగాణ యాస‌, ఇక్క‌డి క‌థ‌ల‌ను ఓన్ చేసుకోలేక‌పోవ‌డం నిజంగా దుర‌దృష్ట‌క‌రం. దీనికి గొల్ల రామ‌వ్వ సినిమా మ‌రో ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement