త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dolby Cinema Theatre | బెంగళూరులో డాల్బీ సినిమా థియేట‌ర్‌.. ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

Dolby Cinema Theatre | డాల్బీ ల్యాబొరేటరీస్, ఏఎంబీ సినిమాస్ సంయుక్తంగా బెంగళూరులో డాల్బీ సినిమా థియేటర్‌ను ప్రారంభించాయి. కపాలి ప్రాంతంలోని ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్‌లో ఏర్పాటైన ఈ థియేటర్‌తో.. భారత్‌లో డాల్బీ సినిమా ఫార్మాట్ అందుబాటులో ఉన్న‌ రెండో నగరంగా బెంగళూరు నిలిచింది.

S

Entertainment | Published On Jan 19, 2026, 1.00 pm IST

Dolby Cinema Theatre | బెంగళూరులో డాల్బీ సినిమా థియేట‌ర్‌.. ప్ర‌త్యేక‌త‌లు ఇవే..
Advertisement

Dolby Cinema Theatre | డాల్బీ ల్యాబొరేటరీస్, ఏఎంబీ సినిమాస్ సంయుక్తంగా బెంగళూరులో డాల్బీ సినిమా థియేటర్‌ను ప్రారంభించాయి. కపాలి ప్రాంతంలోని ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్‌లో ఏర్పాటైన ఈ థియేటర్‌తో.. భారత్‌లో డాల్బీ సినిమా ఫార్మాట్ అందుబాటులో ఉన్న‌ రెండో నగరంగా బెంగళూరు నిలిచింది. ఐదు నెలల క్రితం పుణెలో ఈ ఫార్మాట్ తొలిసారిగా ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టును ప్రపంచ ప్రఖ్యాత ఆడియో, విజువల్ టెక్నాలజీ సంస్థ డాల్బీ, నటుడు మహేష్ బాబు భాగస్వాములుగా ఏషియన్ గ్రూప్ మల్టీప్లెక్స్ సంస్థ స‌హ‌కారంతో పూర్తి చేశారు.

డాల్బీ విజ‌న్‌, డాల్బీ అట్మాస్‌..

ఈ కొత్త డాల్బీ సినిమా థియేట‌ర్‌ పూర్తిగా ప్రత్యేకంగా నిర్మించబడింది. మొత్తం 588 సీట్ల సామర్థ్యంతో, 9 స్క్రీన్‌లు క‌లిగిన‌ ఏఎంబీ సినిమాస్ కాంప్లెక్స్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. నిర్మాతల సృజనాత్మక దృష్టిని పూర్తిగా ప్రేక్షకులకు చేరవేయాలనే లక్ష్యంతో అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలతో దీనిని రూపొందించారు. డాల్బీ విజన్ (Dolby Vision) టెక్నాల‌జీని ఈ థియేట‌ర్‌లో ఆస్వాదించ‌వ‌చ్చు. డ్యుయల్ లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీతో డీప్ బ్లాక్ క‌ల‌ర్స్‌, అధిక బ్రైట్ నెస్‌, అనేక రంగుల శ్రేణితో ఈ టెక్నాల‌జీ ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల ప్రేక్ష‌కుల‌కు తెర‌పై అద్భుత‌మైన దృశ్యాలు క‌నిపిస్తాయి. అలాగే డాల్బీ అట్మాస్ (Dolby Atmos) ద్వారా చుట్టూ, పై నుంచి కూడా వినిపించే 3డీ సౌండ్ వ్యవస్థను థియేటర్ అంతటా ఏర్పాటు చేశారు.

ఏ సీట్లో కూర్చున్నా స్ప‌ష్ట‌మైన వీక్ష‌ణ‌..

గోడ నుంచి పైకప్పు వరకు వంపుతో ఉన్న భారీ స్క్రీన్, ప్రత్యేక ఆకౌస్టిక్ ట్రీట్‌మెంట్, ప్రతి సీటు నుంచి స్పష్టమైన వీక్షణకు అనువైన నిర్మాణాన్ని ఈ థియేట‌ర్ క‌లిగి ఉంటుంది. ఇక ఈ థియేట‌ర్ తాజాగా అందుబాటులోకి రాగా ఇందులో ప్ర‌స్తుతం చిరంజీవి న‌టించిన మ‌న శంకర వర ప్రసాద్ గారు సినిమాను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ సినిమాను డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఫార్మాట్‌లో ప్రేక్ష‌కులు వీక్షించ‌వ‌చ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే సుమారుగా 800కుపైగా సినిమాలను ఈ ఫార్మాట్‌లో విడుదల చేశారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే రిలీజైన ప‌లు మూవీల‌ను ఈ ఫార్మాట్‌లో మళ్లీ రిలీజ్ చేయ‌నున్నారు. వాటిల్లో బాహుబ‌లి, కాంతారా, పుష్ప వంటి మూవీలు ఉన్నాయి.

త్వ‌ర‌లో ఇత‌ర న‌గ‌రాల్లో..

2018లో స్థాపితమైన ఏఎంబీ సినిమాస్, ఏషియన్ గ్రూప్‌తో పాటు మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని భాగస్వామ్యంలో ప్రారంభమైంది. నారాయణదాస్ నారంగ్ మార్గదర్శకత్వంలో ఈ సంస్థ దక్షిణ భారతదేశంలో సూపర్‌ప్లెక్స్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. కాగా డాల్బీ సినిమా ఫార్మాట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా ఏఎంబీ సినిమాస్ ఇప్పుడు 15 దేశాల్లో ఉన్న గ్లోబల్ ఎగ్జిబిటర్ నెట్‌వర్క్‌లో భాగమైంది. కపాలి ఏఎంబీ సినిమాస్‌లోని డాల్బీ సినిమా థియేట‌ర్‌ టికెట్లను అధికారిక AMB Cinemas వెబ్‌సైట్, BookMyShow సైట్‌లో విక్ర‌యిస్తున్నారు. ఇక ప్రారంభం సందర్భంగా ప్రత్యేక ప్రివ్యూలు, ఆఫర్లు కూడా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. త్వరలో మరిన్ని నగరాల్లో డాల్బీ సినిమా థియేటర్ల‌ను ప్రారంభిస్తామ‌ని తెలిపారు. ట్రికీ (ఎల్ఏ సినిమాస్‌), హైద‌రాబాద్ (అల్లు సినీప్లెక్స్‌), కొచ్చి (ఈవీఎం సినిమాస్‌), ఉలిక్క‌ల్ (జీ సినీప్లెక్స్) ల‌లో డాల్బీ సినిమా థియేట‌ర్లు ప్రారంభం కానున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement