త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sudha Kongara | రెమ్యూన‌రేష‌న్ కోసం కోర్టులో కేసు వేసిన‌ త‌మిళ డైరెక్ట‌ర్ – వివాదంలో శ్రీలీల‌ సినిమా

త‌న‌కు రావాల్సిన రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌కుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ శివ‌కార్తికేయ‌న్ ప‌రాశ‌క్తి మేక‌ర్స్‌పై డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర మ‌ద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. ప‌రాశ‌క్తి సినిమాకు సంబంధించి ఒప్పుకున్న ప‌దిహేడు కోట్ల రెమ్యూన‌రేష‌న్‌లో ఇంకా ఎనిమిది కోట్లు బాకీ ఉన్నార‌ని త‌న పిటిష‌న్‌లో పేర్కొన్న‌ది.

N

Entertainment | Published On Jun 30, 2026, 1.59 pm IST

Sudha Kongara | రెమ్యూన‌రేష‌న్ కోసం కోర్టులో కేసు వేసిన‌ త‌మిళ డైరెక్ట‌ర్ – వివాదంలో  శ్రీలీల‌ సినిమా
Advertisement

Sudha Kongara | త‌న‌కు రావాల్సిన‌ రెమ్యూన‌రేష‌న్‌ను కోసం నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ త‌మిళ డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించింది. ప‌రాశ‌క్తి సినిమా నిర్మాత‌పై కేసు పెట్టింది. శివ‌కార్తికేయ‌న్ హీరోగా సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప‌రాశ‌క్తి ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. జ‌యం ర‌వి విల‌న్‌గా న‌టించిన ఈ సినిమాలో అధ‌ర్వ ముర‌ళి ఓ కీల‌క పాత్ర పోషించారు. శ్రీలీల హీరోయిన్‌గా న‌టించింది. సుధా కొంగర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

భారీ న‌ష్టాలు...

దాదాపు 250 కోట్ల బ‌డ్జెట్‌తో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. వంద కోట్ల లోపే వ‌సూళ్ల‌ను సాధించి నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది. తాజాగా ఈ సినిమా నిర్మాత ఆకాష్ భాస్క‌ర‌ణ్‌పై ద‌ర్శ‌కురాలు సుధా కొంగ‌ర కోర్టులో కేసు వేసింది. త‌న‌కు రావాల్సిన‌ 8.39 కోట్ల రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌కుండా ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని మ‌ద్రాస్ హైకోర్టులో పిటిష‌న్ వేసింది. త‌న‌ రెమ్యూన‌రేష‌న్ సెటిల్ చేసే వ‌ర‌కు ఆకాష్ భాస్క‌ర‌ణ్ త‌దుప‌రి సినిమా ఇద‌యం ముర‌ళి రిలీజ్ చేయ‌డానికి వీలులేదంటూ పిటిష‌న్‌లో పేర్కొన్న‌ది. ఇద‌యం ముర‌ళి మూవీ జూలై 10న రిలీజ్ కానుంది. సుధా కొంగ‌ర కేసుతో ఈ సినిమా విడుద‌ల అనుమానంగా మారింది.

పదిహేడు కోట్లు...

ప‌దిహేను కోట్ల రెమ్యూన‌రేష‌న్‌తో ప‌రాశ‌క్తి సినిమా చేయ‌డానికి సుధా కొంగ‌ర అంగీకారం తెలిపింద‌ట‌. జీఎస్‌టీతో క‌లిపి 17.70 కోట్లు చెల్లించ‌డానికి నిర్మాతతో అగ్రిమెంట్ చేసుకున్నార‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు 9.31 కోట్ల రెమ్యూన‌రేష‌న్‌ను సుధా కొంగ‌ర‌కు నిర్మాత చెల్లించార‌ట‌ సినిమా ఫెయిల‌వ్వ‌డంతో మిగిలిన 8.39 కోట్లు చెల్లించ‌కుండా కాల‌యాప‌న చేస్తున్నార‌ట‌. రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో నిర్మాత నుంచి స‌రైన రెస్పాన్స్ రాక‌పోవ‌డంతోనే సుధా కొంగ‌ర కోర్టులో కేసు వేసిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే సుధా కొంగ‌ర పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్‌...

హిందీ వ్య‌తిరేక ఉద్య‌మం నేప‌థ్యానికి రివేంజ్ యాక్ష‌న్ డ్రామాను జోడించి సుధా కొంగ‌ర ఈ సినిమాను తెర‌కెక్కించారు. సుధా కొంగ‌ర గ‌త మూవీ ఆకాశం నీ హ‌ద్దురా నేష‌న‌ల్ అవార్డును ద‌క్కించుకోవ‌డంతో ప‌రాశ‌క్తిపై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కార‌ణంగా ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

 

Advertisement
Advertisement