త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deepika Padukone | మ‌ళ్లీ తెర‌పైకి స్పిరిట్ వివాదం.. ఒక్క లైక్‌తో సందీప్‌రెడ్డి వంగాకు కౌంట‌ర్ ఇచ్చిన దీపికా!

Deepika Padukone | ప్రభాస్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్‌’. ఈ సినిమా నుంచి బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె తప్పుకోవడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఏడాది దాటినా ఈ వ్యవహారంపై చర్చ మాత్రం కొనసాగుతూనే ఉన్న‌ది.

P

Entertainment | Published On Aug 22, 2026, 3.51 pm IST

Deepika Padukone | మ‌ళ్లీ తెర‌పైకి స్పిరిట్ వివాదం.. ఒక్క లైక్‌తో సందీప్‌రెడ్డి వంగాకు కౌంట‌ర్ ఇచ్చిన దీపికా!
Advertisement

Deepika Padukone | ప్రభాస్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్‌’. ఈ సినిమా నుంచి బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె తప్పుకోవడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఏడాది దాటినా ఈ వ్యవహారంపై చర్చ మాత్రం కొనసాగుతూనే ఉన్న‌ది. తాజాగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్‌ వంగా చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ‘స్పిరిట్‌’ లాభాల్లో 10 శాతం వాటా కావాలని దీపిక డిమాండ్‌ చేశారని.. అందుకు తాము అంగీకరించకపోవడంతోనే ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఓ నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది.

నెటిజ‌న్ పోస్టుకు లైక్‌..

ప్ర‌ణ‌య్ వంగా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఓ నెటిజన్‌ సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. ‘‘స్పిరిట్‌’ లాభాల్లో 10 శాతం వాటా దీపిక అడిగారంటున్నారు. హీరోలు ఏళ్లుగా ఇలాంటి డీల్స్‌ చేసుకుంటున్న విషయాన్ని మనం మర్చిపోయామా? ఒక మహిళ అడిగితే మాత్రం ఎందుకు వార్తగా అవుతోంది? అంటూ ప్రశ్నించారు. ఇండస్ట్రీలో మహిళలు తమకు అనుకూలంగా ష‌ర‌తులు పెడితే దాన్ని మరో కోణంలో చూడడం స‌రైంది కాదని ఆ పోస్టులో పేర్కొన్నారు. ‘‘ఒక మహిళ ఆ డీల్‌ను తిరస్కరించింది. ఒక మహిళ ‘నో’ చెప్పడాన్ని పురుషాధిక్య ఆలోచనా విధానం తట్టుకోలేకపోయింది’’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ పోస్టుకు దీపికా పదుకొణె లైక్‌ కొట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో ప్ర‌ణ‌య్ వంగా వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చిన‌ట్లుగా భావిస్తున్నారు.

ప్రణయ్‌ వంగా ఏమన్నారు?

సందీప్‌రెడ్డి వంగా సుమారు ఏడాదిన్నర పాటు దీపికా పదుకొణెతో సంప్రదింపులు జరిపారని ప్రణయ్‌ వంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్‌ విజయాలతో దీపిక తన పారితోషికం, ఇతర షరతుల విషయంలో బేరసారాలు చేసే స్థితిలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే సినిమా లాభాల్లో 10 శాతం వాటాను ఆమె కోరారని తెలిపారు. అయితే, సినిమా బడ్జెట్‌, ఇతర లెక్కలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆ డిమాండ్‌ను అంగీకరించడం సాధ్యం కాదని తాము భావించామని.. దీంతో ఇతర అవకాశాలను పరిశీలించాల్సి వచ్చిందని ప్రణయ్‌ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే, దీపిక ‘స్పిరిట్‌’ నుంచి తప్పుకోవడం సమయంలో మరో అంశం కూడా చర్చకు వచ్చింది. తాను రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తానని, మహిళా నటులు కూడా తమ పని వేళల విషయంలో ఇలాంటి పరిమితులు పెట్టుకోవచ్చని ఆమె అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి. అగ్ర హీరోలు తమ పని వేళలను పరిమితం చేసుకుంటూ, వారంలో కొన్ని రోజులు మాత్రమే షూటింగ్‌కు కేటాయిస్తున్నప్పుడు.. హీరోయిన్లు అలాంటి షరతులు పెట్టుకోవడంలో తప్పేముందని ఆమె ప్రశ్నించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ వ్య‌వ‌హారం త‌ర్వాత స్పిరిట్ మూవీలో ప్ర‌భాస్‌కు జోడీగా యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రిని తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ వ‌చ్చే ఏడాది మార్చిలో విడుద‌ల కానుంది.

Advertisement
Advertisement