త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | కులం అనే ఇరుకు గదిలో.. ఊపిరాడక మగ్గుతున్న తెలుగు సినిమా

మనం లాజిక్కులు వెతకడంలో దిట్టలం. కానీ ఆ లాజిక్ ఎవరి మీద వాడాలో మనకు స్పష్టమైన లెక్కలు ఉన్నాయి. యానిమల్ సినిమాలో గొడ్డలి పట్టుకుని వందల మందిని నరుక్కుంటూ పోతే, అబ్బా ఏం తీశాడ్రా అని చొక్కాలు చించుకుంటాం. అక్కడ హింస మనకు ఎలివేషన్. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాల్లో రక్తం ఏరులై పారితే దాన్ని డార్క్ సినిమాటిక్ వరల్డ్ అని పొగడ్తలతో ముంచెత్తుతాం.కానీ కాలా, కబాలి, తంగలాన్ లాంటి సినిమాలు వచ్చేసరికి మనలోని విమర్శకుడు నిద్రలేస్తాడు. ప్యారడైజ్ సినిమాలో అసలు లాజిక్ లేదంటారు

N

Entertainment | Published On Sep 28, 2026, 8.14 pm IST

Tollywood | కులం అనే ఇరుకు గదిలో.. ఊపిరాడక మగ్గుతున్న తెలుగు సినిమా
Advertisement

Tollywood | తెరపై గొడ్డలితో వంద మందిని నరికితే "మాస్ ఎలివేషన్".. అదే ఒక అణగారిన వాడు ఆత్మగౌరవంతో కారు దిగితే మాత్రం "లాజిక్కులు" వెతికే కుహనా మేధావితనం మనది!
'యానిమల్', 'సలార్' రక్తపాతాన్ని చొక్కాలు చించుకుని ఆస్వాదించే మన కళ్లు, దళిత అస్తిత్వం తెరపైకి రాగానే ఉలిక్కిపడటం మన కుల అహంకారానికి పరాకాష్ట.
"కళకు కులం లేదు" అనేది టాలీవుడ్ చెప్పే పచ్చి అబద్ధం... ఈ రంగుల ప్రపంచాన్ని తెర వెనుక శాసిస్తున్న ఆ చీకటి చట్రం బద్దలయ్యేది ఎప్పుడు?
కళకు కులం అంటదు. ఎంత అద్భుతమైన అబద్ధం! వినడానికి చెవులకు ఎంత ఇంపుగా ఉందో. మన తెలుగు సమాజం తనను తాను చాలా ప్రగతిశీలమైనదిగా ఊహించుకుంటుంది. అమెరికా వెళ్తాం. ఐటీ కంపెనీలు నడుపుతాం. ప్రపంచస్థాయి టెక్నాలజీ గురించి గొప్పలు చెబుతాం. కానీ మన మెదళ్లలో ఇంకా ఆ పాత కులపు మురుగు అలాగే పేరుకుపోయి ఉంది. తెరపై బొమ్మ మారినా, ఆ బొమ్మను చూసే మన కళ్లల్లో రంగు మారలేదు. మనిషి పుట్టుకను బట్టి వాడి స్థానాన్ని నిర్ణయించే సమాజంలో కళ స్వచ్ఛంగా ఎలా పుడుతుంది? టాలీవుడ్ అనే రంగుల ప్రపంచం వెనుక ఉన్నది ఒకే ఒక్క చీకటి వర్ణం. అదే కులం. దశాబ్దాలు గడుస్తున్నా ఈ కుల చట్రాన్ని దాటలేని మన ప్రేక్షకుల ప్రగతిశీలత ఒక పెద్ద బూటకం. ఇదొక చేదు నిజం.

మనం లాజిక్కులు వెతకడంలో దిట్టలం. కానీ ఆ లాజిక్ ఎవరి మీద వాడాలో మనకు స్పష్టమైన లెక్కలు ఉన్నాయి. యానిమల్ సినిమాలో గొడ్డలి పట్టుకుని వందల మందిని నరుక్కుంటూ పోతే, అబ్బా ఏం తీశాడ్రా అని చొక్కాలు చించుకుంటాం. అక్కడ హింస మనకు ఎలివేషన్. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాల్లో రక్తం ఏరులై పారితే దాన్ని డార్క్ సినిమాటిక్ వరల్డ్ అని పొగడ్తలతో ముంచెత్తుతాం. హిట్ 3లో నరికినా మనకు అభ్యంతరం లేదు. అక్కడ మనకు ఏ విలువలూ గుర్తుకు రావు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం, అల్లూరి సీతారామరాజు చరిత్రను ఇష్టం వచ్చినట్లు కలిపేసినా మనకు ఏ ఇబ్బందీ లేదు. బాహుబలిలో పచ్చటి అడవుల పక్కనే మంచు కొండలు ఉండి, ఆ పక్కనే మాహిష్మతి ఎడారి కనిపించినా మన మేధావులు భౌగోళిక శాస్త్రాన్ని నిలదీయరు. అవన్నీ సినిమాటిక్ లిబర్టీలు అని చాలా తేలికగా సర్దుకుపోతాం.
కానీ కాలా, కబాలి, తంగలాన్ లాంటి సినిమాలు వచ్చేసరికి మనలోని విమర్శకుడు నిద్రలేస్తాడు. ప్యారడైజ్ సినిమాలో అసలు లాజిక్ లేదంటారు. కాలా సినిమాలో మురికివాడలో ఉండే నల్లటి హీరో కారులో ఎందుకు తిరుగుతున్నాడు అని సాహిత్యకారులు సైతం సూటిపోటి మాటలు అంటారు. తెర నిండా ఆ నల్ల రంగు ఏంటని ముఖం చిట్లిస్తారు. అసలు సమస్య కథలో లేదు. సినిమా తీసిన విధానంలో అంతకన్నా లేదు. నరకడం, హింస అసలు అడ్డంకే కావు. దశాబ్దాలుగా మనకు అణగిమణిగి ఉండాల్సిన వాడు, ఊరి బయట బతికేవాడు తెరమీద హీరోగా కనిపించడం మన అహంకారానికి నచ్చదు. వాడు అగ్ర వర్ణాలను ఎదిరించి కారు దిగితే మన కళ్లు తట్టుకోలేవు. ఉలిక్కిపడతాం.
ఒకప్పుడు ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలు ఘన విజయం సాధించాయి. అందులో పీడితుల కష్టం ఉంటుంది. దాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాం. ఎందుకు? అక్కడ వాళ్లు దళితులు అనే స్పష్టమైన సింబాలిజం ఉండదు. అది ఒక వర్గ పోరాటం. కమ్యూనిస్టు భావజాలం ఉన్న సమాజానికి అది ఇట్టే నచ్చుతుంది. కానీ దళిత్ అనే పదం వాడినా, జై భీమ్ అని పేరు పెట్టినా చాలు. మనలో కంపరం మొదలవుతుంది. అందులో ఉన్నది గిరిజన పోరాటమే. కానీ ఆ టైటిల్ చూసి సోషల్ మీడియాలో ఎంత విషం కక్కారు? చిల్లర వాదనలు చేసి ఆ సినిమాను ఎలా బద్నాం చేశారో మనం చూశాం. దళిత అస్తిత్వం అనగానే ఎందుకింత ఉలిక్కిపాటు?
సమాజంలో మన ద్వంద్వ వైఖరి ఎలా ఉంటుందో తెర ముందు కూడా మన ప్రవర్తన అలాగే ఉంటుంది. మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగినప్పుడు హంతకులకు బాహాటంగా మద్దతు పలికిన సోకాల్డ్ ప్రగతిశీల సమాజం మనది. అదే దిశ ఘటన జరిగితే మాత్రం నడిరోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలని ఆవేశంగా ఊగిపోయాం. ఈ పక్షపాత బుద్ధే సినిమా చూసేటప్పుడు కూడా బయటకు వస్తుంది. దళితులంటే తేరగా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారనే ఒక కుళ్లు, ఒక అహంకారం మనలో పాతుకుపోయాయి. బీసీలు ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నా వారిమీద మనకు ఈ ద్వేషం ఉండదు. తమిళంలో అద్భుతమైన విజయం సాధించిన అసురన్ సినిమాను ఇక్కడ నారప్పగా మార్చారు. కానీ అందులో ఆ దళిత సింబాలిజం తీసేశారు. ఫేక్ మేకప్ వేశారు. మన వాళ్లకు దళిత నేపథ్యం ఉన్న కథను చూసే ఉద్దేశం లేదు అని చెప్పడానికి ఇంతకంటే పచ్చి నిజం కావాలా? ప్యారడైజ్ గొప్ప సినిమా కాకపోవచ్చు. అందులో లోపాలు ఉండొచ్చు. కానీ దాన్ని ప్లాప్ అని ముద్ర వేసి పనిగట్టుకుని తొక్కేయడానికి అసలు కారణం ఆ సినిమాలో ఉన్న దళిత అస్తిత్వమే. నీకు ఇష్టం లేనిదానికి నువ్వు కనెక్ట్ కాలేవు.
పరిశ్రమ లోపలికి వెళితే పరిస్థితి మరింత దిగజారిపోయి ఉంటుంది. టాలీవుడ్ పుట్టినప్పటి నుండి నేటి దాకా నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్, థియేటర్ల వ్యవస్థ అంతా రెండు మూడు అగ్ర వర్ణాల గుప్పిట్లోనే బందీ అయి ఉంది. ఇక్కడ టాలెంట్ అనేది ఒక భ్రమ. కులమే అసలైన పెట్టుబడి. ఒక పెద్ద హీరో కొడుకు లేదా మనవడు చాలా సులభంగా హీరో అయిపోతాడు. దీనికి కారణం వారి వెనుక ఉన్న కుల బలం. ఆ కులానికి చెందిన వ్యాపారవేత్తల అండదండలు తెరవెనుక పుష్కలంగా దొరుకుతాయి. దీన్నే మనం నెపోటిజం అని ఇంగ్లీషులో ముద్దుగా పిలుచుకుంటాం. కానీ తెలుగునాట దాని అసలు పేరు కుల పిచ్చి. సోషల్ మీడియాలో రోజూ జరిగే ఫ్యాన్ వార్స్ చూడండి. అవి హీరోల మీద ప్రేమతో జరిగేవి కావు. అవి రెండు సామాజిక వర్గాల మధ్య జరిగే ఆధిపత్య పోరాటాలు. తమ కులపు హీరో సినిమా కలెక్షన్లను తమ అస్తిత్వానికి ప్రతీకగా భావించే దౌర్భాగ్య స్థితిలో మన బతుకులు ఉన్నాయి.
సినిమా కథల్లో పాత్రల చిత్రణ కూడా అత్యంత దారుణంగా ఉంటుంది. దశాబ్దాలుగా వస్తున్న మన కమర్షియల్ సినిమాల్లో హీరోలకు చౌదరి, నాయుడు, రెడ్డి, రాజు లాంటి పేర్లే ఉంటాయి. వాళ్లు చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తారు. ఆ యాసకు ఒక గంభీరత ఆపాదిస్తారు. వాళ్లు చంపినా, నరికినా అది ధర్మమే. అదే వెనుకబడిన వర్గాలు, దళిత పాత్రలు ఎక్కడుంటాయి? హీరో పక్కన నిలబడి దెబ్బలు తినడానికి పనికివస్తాయి. లేదా హాస్యం పండించడానికి బలైపోతాయి. పలాస, దసరా లాంటి సినిమాలు అడపాదడపా వచ్చి కుల వివక్షను ప్రశ్నించినా ఆ మార్పు సముద్రంలో నీటిబొట్టు లాంటిదే. రాజకీయాలకు, సినిమాకు ఉన్న బంధం కూడా ఈ కులపు పునాదుల మీదే నడుస్తోంది. ఎన్నికల సమయంలో ఈ నిజస్వరూపాలు మరింత బట్టబయలు అవుతాయి.
ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎంత మేకప్ వేసినా అసలు రంగు దాగదు. మనం ఎంత ఎదిగినా, ఎంత చదువుకున్నా మన మూలాలు మారకపోతే ఆ చదువుకు, ఆ ఎదుగుదలకు అర్థం లేదు. కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తోంది. ఆస్కార్ అవార్డులు తెచ్చుకుంటున్నాం. కానీ తెలుగు సినిమా ఇంకా కులం అనే ఇరుకు గదిలోనే ఊపిరాడక మగ్గుతోంది. మనిషిని మనిషిగా చూడలేని అహంకారపు సమాజం అద్భుతమైన కళను ఎలా సృష్టించగలదు? డిజిటల్ యుగంలో కొత్తవాళ్లు వస్తున్నారు కదా అని మనం ఆశ పడతాం. ఓటీటీల రాకతో విప్లవం వస్తుందని నమ్ముతాం. కానీ పాతుకుపోయిన ఈ రాతి పునాదులు అంత తేలికగా కదలవు. కళ అంటేనే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను కులం అనే ఉక్కు గొలుసులతో బంధించినంత కాలం మన సినిమాలు నిజమైన జీవితాలను చూపించలేవు. ఈ నిజం మనకు మింగుడుపడదు. అయినా సరే మనల్ని మనం నిలదీసి అడగాల్సిన ప్రశ్న ఇది. రేపటి ఆశాకిరణం కోసమైనా మన మెదళ్లలో ఉన్న ఈ కుల చట్రాన్ని బద్దలు కొట్టాల్సిన సమయం ఎప్పుడో దాటిపోయింది. ఆ చీకటి గీతను చెరిపేసినప్పుడే తెలుగు సినిమాకు, తెలుగు ప్రేక్షకుడికి అసలైన విముక్తి.
1. హింసను, రక్తపాతాన్ని 'మాస్ ఎలివేషన్' పేరుతో ఆస్వాదించే మనం... తెరపై ఒక అణగారిన వాడు ఆత్మగౌరవంతో కనిపిస్తే మాత్రం లాజిక్కులు ఎందుకు వెతుకుతున్నాం? మనకు నచ్చనిది ఆ సినిమానా, లేక ఆ వర్గపు అస్తిత్వమా?
2. "కళకు కులం లేదు" అని గొప్పలు చెప్పుకుంటాం కదా... మరి దశాబ్దాలుగా రెండు మూడు సామాజిక వర్గాల చేతుల్లోనే బందీ అయిన టాలీవుడ్ ఆధిపత్యాన్ని 'వారసత్వం' అనే ముద్దు పేరుతో ఇంకా ఎంతకాలం గుడ్డిగా ఆరాధిస్తాం?
3. ఆధునిక ప్రపంచంలో బతుకుతూ, ప్రగతిశీలురం అని గర్వపడే మనం... సినిమా కలెక్షన్ల దగ్గరకు వచ్చేసరికి 'మా కులం హీరో' అంటూ ఫ్యాన్ వార్స్ పేరుతో కుమ్ములాడుకోవడం మనలో పేరుకుపోయిన కులజాడ్యానికి నిదర్శనం కాదా?

 

నంబూరి చంద్రశేఖర్
రేడియో ఫిజిసిస్ట్

Advertisement
Advertisement