త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT Review | కేస్ ఆఫ్ కొండాన రివ్యూ – తెలుగులో రిలీజైన క‌న్న‌డ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

క‌న్న‌డ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ కేస్ ఆఫ్ కొండాన తెలుగులో ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాలో విజ‌య్ రాఘ‌వేంద్ర‌, భావ‌న‌, ఖుషి ర‌వి హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ క‌న్న‌డ డ‌బ్బింగ్ మూవీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా? అంటే?

N

Entertainment | Published On Jul 25, 2026, 8.01 pm IST

OTT Review | కేస్ ఆఫ్ కొండాన రివ్యూ – తెలుగులో రిలీజైన క‌న్న‌డ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?
Advertisement

OTT Review |  విజ‌య్ రాఘ‌వేంద్ర‌, భావ‌న , ఖుషి ర‌వి హీరోహీరోయిన్లుగా న‌టించిన క‌న్న‌డ మూవీ కేస్ ఆఫ్ కొండాన అదే పేరుతో తెలుగులోకి వ‌చ్చింది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దేవిప్ర‌సాద్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఎలా ఉందంటే?

విల్స‌న్ వ‌ర్సెస్ ల‌క్ష్మి...

కొండ‌న ఫారెస్ట్ ఏరియాలో వ‌రుస‌గా హ‌త్య‌లు జ‌రుగుతుంటాయి. హంత‌కుడిని ప‌ట్టుకోవ‌డంలో ఏసీపీ ల‌క్ష్మి (భావ‌న ) విఫ‌ల‌మైందంటూ విమ‌ర్శ‌ల వ‌స్తుంటాయి. అదే పోలీస్ స్టేష‌న్‌కు కొత్త‌గా విల్స‌న్ (విజ‌య్ రాఘ‌వేంద్ర‌) ఎస్ఐగా వ‌స్తాడు. విల్స‌న్‌కు దూకుడు ఎక్కువ‌. డ్యూటీలో జాయిన్ అయిన రోజే లోక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్‌తో గొడ‌వ‌ప‌తాడు. విల్స‌న్‌కు అప్పులు పెరిగిపోతాయి. డాక్ట‌ర్‌గా ప‌నిచేసే ప్రియురాలు స‌హాన (ఖుషి ర‌వి) ఇచ్చిన డ‌బ్బుతో అప్పులు తీర్చేయాల‌ని అనుకుంటాడు. ఆ డ‌బ్బు తీసుకొని వ‌స్తోండ‌గా విల్స‌న్‌ కారుకు యాక్సిడెంట్ అవుతోంది. అదే టైమ్‌లో పానీపూరి బండి న‌డుపుకునే రాజు విల్స‌న్ కారులో నుంచి డ‌బ్బు దొంగిలిస్తాడు. ఈ క్ర‌మంలో జ‌రిగిన గొడ‌వ‌లో అనుకోకుండా విల్స‌న్ చేతిలో రాజు చ‌నిపోతాడు. ఆ శ‌వాన్ని మాయం చేసే క్ర‌మంలో ఏసీపీ ల‌క్ష్మి తండ్రితో పాటు మ‌రో ఇద్ద‌రు పోలీసులు కూడా మ‌ర‌ణిస్తారు. ఈ క్రైమ్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి విల్స‌న్ ఏం చేశాడు? తండ్రిని చంపిన హంత‌కుడిని ల‌క్ష్మి ప‌ట్టుకుందా? కొండ‌న ఏరియాలో వ‌రుస హ‌త్య‌లు చేస్తోన్న సీరియ‌ల్ కిల్ల‌ర్ సెల్వ‌న్‌ను ల‌క్ష్మి ప‌ట్టుకుందా? సెల్వ‌న్ మ‌నుషులు చేసిన దాడి నుంచి ల‌క్ష్మిని విల్స‌న్ ఎలా కాపాడాడు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ఒక్క రాత్రిలోొ...

అనుకోకుండా చేసిన త‌ప్పులు కొన్నిసార్లు జీవితాన్ని ఎలా ఇబ్బందుల్లో ప‌డేస్తాయి? వాటిని దాచే క్ర‌మంలో మ‌రికొన్ని పొర‌పాట్లు ఎలా జ‌రుగుతుంటాయ‌నే కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు దేవిప్ర‌సాద్ శెట్టి కేస్ ఆఫ్‌ కొండ‌న సినిమాను తెర‌కెక్కించారు. క‌ష్ట‌ప‌డి పోలీస్‌గా ఉద్యోగం సాధించిన ఓ యువ‌కుడు...అప్పుల‌న్నీ తీర్చేసి ...తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టాల‌ని ఎన్నో క‌ల‌లు కంటాడు. కానీ ఒక్క రాత్రి అత‌డి జీవితాన్ని ఎలా అత‌లాకుత‌లం చేసింది...చ‌ట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ చివ‌ర‌కు హంత‌కుడిగా ఏ విధంగా మారాడ‌న్న‌ది ఉత్కంఠ‌భ‌రితంగా ఈ సినిమాలో చూపించాడు.

మూడు ఉప‌క‌థ‌ల‌తో...

కొండ‌న ఏరియాలో సీరియ‌ల్ కిల్ల‌ర్స్‌...వారిని ప‌ట్టుకునేందుకు ఏసీపీ ల‌క్ష్మి సాగించే అన్వేష‌ణ‌...మ‌రోవైపు విల్స‌న్ క‌ష్ట‌ప‌డి సాధించిన ఉద్యోగం, అత‌డి ప్రేమ‌క‌థ‌....రెండు ఉప‌క‌థ‌ల‌ను స‌మాంత‌రంగా చూపిస్తూ క‌థ‌ను మొద‌లుపెట్టారు డైరెక్ట‌ర్‌. వాటికి తోడు రాజు అనే నార్త్ ఇండియ‌న్ కూలీ...త‌న కొడుకును కాపాడుకోవ‌డం చేసే ప్ర‌య‌త్నాల‌తో మ‌రో స్టోరీని సాగుతుంది. ఓ చిన్న యాక్సిడెంట్‌తో మూడు స్టోరీల‌ను లింక్ చేసి ఇంట‌ర్వెల్‌లో ట్విస్ట్ ఇచ్చారు. సెకండాఫ్ తాను చేసిన హ‌త్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు విల్స‌న్ చేసే ప్ర‌య‌త్నాలు...మ‌రోవైపు హంత‌కుడిని ప‌ట్టుకోవ‌డానికి ల‌క్ష్మి అండ్ టీమ్ వేసే ఎత్తుల‌తో సినిమా ఆస‌క్తిని పంచుతుంది.
క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. విల్స‌న్‌ను చంపాల‌ని ల‌క్ష్మి అండ్ టీమ్ అనుకుంటారు. కానీ ఊహించిన విధంగా విల్స‌న్ వ‌ల్లే వారు ప్రాణాల‌తో ఎలా బ‌య‌ట‌ప‌డ్డార‌న్న‌ది థ్రిల్లింగ్‌గా చూపించారు.

నాచుర‌ల్ యాక్టింగ్‌...

పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో భావ‌న స్టైలిష్‌గా క‌నిపించింది. సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించింది. అనుకోకుండా చేసిన త‌ప్పు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నించే పోలీస్ ఆఫీస‌ర్‌గా విజ‌య్ రాఘ‌వేంద్ర నాచుర‌ల్ యాక్టింగ్‌ను క‌న‌బ‌రిచాడు. ఖుషి ర‌వి ఓ రెండు పాట‌ల‌తో పాటు కొన్ని సీన్ల‌కే ప‌రిమిత‌మైంది.

క్రైమ్ థ్రిల్ల‌ర్ ల‌వ‌ర్స్‌ను కేస్ ఆఫ్ కొండాన మెప్పిస్తుంది. తెలుగు డ‌బ్బింగ్ బాగుంది.

Advertisement
Advertisement