త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anbil Avan Review | ఎమ్మెల్యే ఫ్లెక్సీ చింపి ప్రాణాల మీద‌కు తెచ్చుకున్న జంట – క‌న్న‌ప్ప హీరోయిన్ త‌మిళ మూవీ ఎలా ఉందంటే?

ఓం భీమ్ బుష్, క‌న్న‌ప్ప సినిమాల ఫేమ్ ప్రీతి ముకుంద‌న్ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ అన్బిల్ అవ‌న్ థియేట‌ర్ల‌లో పెద్ద హిట్టుగా నిలిచింది. అశోక్ సెల్వ‌న్ హీరోగా న‌టించిన ఈ రొమాంటిక్ యాక్ష‌న్ మూవీ ఇటీవ‌లే ఓటీటీలోకి వ‌చ్చింది. సోనీలివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లో అవుతోంది.

N

Entertainment | Published On Nov 24, 2026, 8.18 pm IST

Anbil Avan Review |  ఎమ్మెల్యే ఫ్లెక్సీ చింపి ప్రాణాల మీద‌కు తెచ్చుకున్న జంట – క‌న్న‌ప్ప హీరోయిన్ త‌మిళ మూవీ ఎలా ఉందంటే?
Advertisement

Anbil Avan Review |  అశోక్ సెల్వ‌న్‌, ప్రీతి ముకుంద‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించిన అన్బిల్ అవ‌న్ మూవీ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు కార్తికేయ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. థియేట‌ర్ల‌లో సూప‌ర్ హిట్‌గా నిలిచిన ఈ త‌మిళ మూవీ ఎలా ఉందంటే?

సూర్య , ఇందు ప్రేమ‌క‌థ‌...

సూర్య (అశోక్ సెల్వ‌న్‌), ఇందు (ప్రీతి ముకుంద‌న్‌) పెద్ద‌ల‌ను ఎదురించి ప్రేమ వివాహం చేసుకుంటారు. హోట‌ల్ మేనేజ్‌మెంట్ పూర్తిచేస్తారు. ఇద్ద‌రు వేర్వేరు ఫైవ్‌స్టార్ హోట‌ల్స్‌లో ప‌నిచేస్తుంటారు. చేస్తున్న ఉద్యోగాల్లో సంతృప్తి లేక‌పోవ‌డం, ప‌ని ఒత్తిడిల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. జాబ్‌ల‌కు రిజైన్ చేసి కొండ ప్రాంతాల్లో హోమ్ స్టే బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని క‌ల‌లు కంటారు. ఓ హిల్ స్టేష‌న్‌లో వారి అభిరుచుల‌కు అనుగుణంగా పాత‌కాలం నాటి బంగ‌ళా క‌నిపిస్తుంది. ఇంటిని అమ్మ‌డానికి ఓన‌ర్ రాణి ప‌ద్మిణి (రేవ‌తి) అంగీక‌రించ‌దు. క‌ష్ట‌ప‌డి సూర్య ఆమెను ఒప్పిస్తాడు. త‌మ‌ ద‌గ్గ‌రున్న ఆస్తులు అమ్మేసి...అప్పులు చేసి ఆ ఇంటిని కొంటారు. అప్ప‌టి నుంచే సూర్య‌, ఇందుకు క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. ప‌ర్మిష‌న్ల పేరుతో అడుగ‌డుగునా వారి క‌ల‌ల‌కు అడ్డంకులు ఎదుర‌వుతాయి. ఆ ఇబ్బందుల వెనుక ఎమ్మెల్యే రంగ‌నాయ‌కులు ఉన్నాడ‌ని సూర్య క‌నిపెడ‌తాడు. ఆ ఇంటికి క‌బ్జా చేయాల‌నే ఇదంతా చేస్తున్నాడ‌ని తెలుసుకుంటాడు. మ‌రోవైపు ఆ ఏరియా పోలీస్ ఆఫీస‌ర్ కూడా ఇందు, సూర్య‌ల‌ను టార్గెట్ చేస్తాడు. ఓ రోజు ఎమ్మెల్యే, పోలీస్ ఆఫీస‌ర్‌తో పాటు వారి మ‌నుషులు సూర్య ఇంటిపై దాడిచేస్తారు? వారి బారి నుంచి ఇందును సూర్య ఎలా కాపాడుకున్నాడు? సూర్య‌ను ఎమ్మెల్యే ఎందుకు చంపాల‌ని అనుకున్నాడు? అన్న‌దే అన్బిల్ అవ‌న్ మిగిలిన క‌థ‌.

సామాన్యుడు యోధుడిగా...

కొన్ని సార్లు అనుకోని ప‌రిస్థితులు సామాన్యుడిని సైతం యోధుడిగా మారుస్తాయి. అవినీతి, అన్యాయాలు తారాస్థాయికి చేరుకున్న‌ప్పుడు అవ‌స‌ర‌మైతే హింసామార్గాన్ని అనుస‌రించ‌డంలో త‌ప్పులేద‌నే పాయింట్‌తో అన్బిల్ అవ‌న్ సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు. వ్య‌వ‌స్థ‌లోని త‌ప్పుల‌ను ఎదురించిన ఓ యువ జంట జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరిగాయ‌న్న‌ది చాలా వ‌య‌లెంట్‌గా చూపించాడు.

ట్రెండ్‌...

ప్ర‌స్తుతం హింస‌, ర‌క్త‌పాతంతో కూడిన‌ క‌థ‌ల ట్రెండ్ బాగా న‌డుస్తోంది. సినిమాలో వ‌య‌లెన్స్ ఎంత ఎక్కువ‌గా ఉంటే అంత ఆడియెన్స్‌కు సినిమా చేరువ అవుతుంద‌నే భావ‌న‌తో ద‌ర్శ‌కులు క‌థ‌లు రాస్తున్నారు. అదే ఫార్ములాను ఈ సినిమాలో ఫాలో అయ్యారు డైరెక్ట‌ర్‌. చివ‌రి అరంగంట స్క్రీన్‌పై ర‌క్తం ఏరులై పారుతుంది.

ఫ్లాష్‌బ్యాక్‌లో...

ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో హీరోహీరోయిన్లు ఉద్యోగాలు చేస్తూ ఇబ్బందులు ప‌డే సీన్‌తో ఈ సినిమా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత ఫ్లాష్‌బ్యాక్‌లో వారి ల‌వ్‌స్టోరీని చూపించారు. కొండ ప్రాంతంలో హోమ్ స్టే కొన‌డానికి వారు చేసే ప్ర‌య‌త్నాల‌తో ఫ‌స్ట్ హాఫ్ సాగుతుంది. పెద్ద‌గా ట్విస్ట్‌లు, ట‌ర్న్‌లు లేకుండా సాగిపోతుంది.

హీరో...విల‌న్ ఫైట్‌...

ఎమ్మెల్యే ఫ్లెక్సీని హీరోయిన్ చింపేసి కారులోని సామాన్లు మూట‌గ‌ట్ట‌డానికి వాడే సీన్‌తో హీరో, విల‌న్ మ‌ధ్య గొడ‌వ మొద‌లైన‌ట్లుగా చూపించే సీన్ బాగుంది. విల‌న్ ఎత్తులు వేయ‌డం...వాటిని హీరో త‌న తెలివితేట‌ల‌తో తిప్పికొట్టే సీన్ల‌తో సెకండాఫ్ ఉత్కంఠ‌గా న‌డిపించారు. హీరో బిల్డింగ్‌పై గుంపులుగుంపులుగా విల‌న్ల గ్యాంగ్ ఎటాక్ చేయ‌డం, వారంద‌రిని హీరో ఒక్క‌డే ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నాడ‌న్న‌ది క్లైమాక్స్‌లో చూపించారు. కార్తీ ఖైదీ సినిమా క్లైమాక్స్‌ను ఆ సీన్ గుర్తుకు తెస్తుంది.

హాలీవుడ్ మూవీ....

హాలీవుడ్ మూవీ స్ట్రేడాగ్స్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఈ మూవీని రూపొందించారు. అశోక్ సెల్వ‌న్‌, ప్రీతి ముకుంద‌న్ జోడీ క్యూట్‌గా ఉంది. రొమాంటిక్ సీన్ల‌లో మెప్పించారు. రొమాంటిక్‌, యాక్ష‌న్ సీన్ల‌కు త‌గ్గ‌ట్లుగా చ‌క్క‌టి వేరియేష‌న్ చూపించాడు అశోక్ సెల్వ‌న్‌. విల‌న్లుగా క‌థిరావ‌న్ బాలు, మ‌హా ఢిల్లీ గ‌ణేష్ న‌ట‌న రొటీన్‌గా సాగింది. గోవింద్ వ‌సంత మ్యూజిక్ చాలా చోట్ల ఈ సినిమాను కాపాడింది.

యాక్ష‌న్‌, రొమాంటిక్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డేవారిని అన్బిల్ అవ‌న్ మెప్పిస్తుంది. సోనీలివ్ ఓటీటీలో తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

 

 

Advertisement
Advertisement