త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhagyashri Borse | స‌మంత మా అంద‌రికి ఓ దారి చూపించింది – భాగ్య‌శ్రీ బోర్సే కామెంట్స్‌…

రీసెంట్‌గా చూసిన సినిమాల్లో మా ఇంటి బంగారం చాలా బాగా న‌చ్చింద‌ని భాగ్య‌శ్రీ బోర్సే అన్న‌ది. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో సినిమా చేయాల‌న్న‌ది త‌న డ్రీమ్ అని వెల్ల‌డించింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టించిన లెనిన్ మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ స‌క్సెస్‌ను ఆస్వాదిస్తోంది ఈ బ్యూటీ.

N

Entertainment | Published On Jul 13, 2026, 7.39 pm IST

Bhagyashri Borse | స‌మంత మా అంద‌రికి ఓ దారి చూపించింది – భాగ్య‌శ్రీ బోర్సే కామెంట్స్‌…
Advertisement

Bhagyashri Borse | హీరోయిన్‌గా త‌న జ‌ర్నీ తెలుగు సినిమాల‌తోనే మొద‌లైంద‌ని భాగ్య‌శ్రీ బోర్సే అన్న‌ది. ఐదు సినిమాల‌తోనే అచ్చ తెలుగు అమ్మాయిలా ప్రేక్ష‌కులు త‌న‌ను అభిమానిస్తున్నార‌ని చెప్పింది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల‌న్న‌ది త‌న డ్రీమ్ అని పేర్కొన్న‌ది. భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టించిన లెనిన్ మూవీ ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన ఈ సినిమాకు ముర‌ళీ కృష్ణ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. లెనిన్ సినిమాకు వ‌స్తోన్న రెస్పాన్స్‌పై సోమ‌వారం హైద‌రాబాద్‌లో పాత్రికేయుల‌తో భాగ్య‌శ్రీ బోర్సే ముచ్చ‌టించింది. ఆమె చెప్పిన సంగ‌తులివే

న‌మ్మ‌కం నిజ‌మైంది...

లెనిన్ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ సినిమాను, నా న‌ట‌న‌ను ప్ర‌శంసిస్తూ మెసేజ్‌లు పంపుతున్నారు. ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని విజ‌య‌మిది. ప్రతి సినిమాను ఎంతో ఇష్టంతో చేస్తాం. విజ‌యం ద‌క్కిన‌ప్పుడే ఆ క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం దొరుకుతుంది లెనిన్ హిట్ట‌వుతుంద‌ని బ‌లంగా న‌మ్మాను. నా నమ్మకం నిజం కావడంతో స‌క్సెస్ మీట్‌లో ఎమోష‌న‌ల్ అయ్యాను. లెనిన్ స‌క్సెస్ న‌టిగా నా బాధ్య‌త‌ను పెంచింది. మంచి పాత్ర‌లు ఎంచుకోవ‌డానికి స్ఫూర్తిగా నిలిచింది.

క‌నెక్ట్ అయ్యా...

దర్శకుడు లెనిన్‌ కథ చెప్పినప్పుడే భార‌తి పాత్ర‌కు క‌నెక్ట్ అయ్యాను. ఈ పాత్రలో నటనకు మంచి అవకాశం ఉందని అప్పుడే అనిపించింది. కెరీర్ ఆరంభంలోనే యాక్టింగ్‌కు ప్రాధాన్య‌మున్న మంచి పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భార‌తిగానే న‌న్ను ప్రేక్ష‌కులు త‌మ మ‌న‌సుల్లో నిలుపుకుంటున్నారు.

తొలి అవ‌కాశం...

తెలుగు ఇండ‌స్ట్రీనే న‌టిగా న‌న్ను ఆద‌రించింది. అద్భుత‌మైన అవ‌కాశాలు ఇచ్చింది. నా తొలి సినిమా ప్రయాణం హైదరాబాద్ నుంచే ప్రారంభమైంది. ఐదు సినిమాల‌తోనే తెలుగు అమ్మాయిలాగే నన్నుఅభిమానులు చూసుకుంటున్నారు. అందుకే హైదరాబాద్ తో పాటు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ తో ఏర్ప‌డిన ఈ అనుబంధం జీవితాంతం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.

నాగార్జున ప్ర‌శంస‌...

లెనిన్ విష‌యంలో నాగార్జున నుంచి వ‌చ్చిన ప్ర‌శంస‌ను మ‌ర్చిపోలేను. ఆయ‌న‌ను నా న‌ట‌న‌తో మెప్పించ‌డం ఆనందంగా అనిపించింది. మా అమ్మ‌కు సినిమా చాలా నచ్చింది. నా పాత్ర ముగించి చూసి ఎమోష‌న‌ల్ అయ్యింది. అలాంటి ముగింపును ఏ తల్లి కూడా కోరుకోదు. రిజ‌ల్ట్ విష‌యంలో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు.

రాజ‌మౌళితో సినిమా...

లార్జర్ దాన్ లైఫ్ , హిస్టారిక‌ల్ క‌థ‌ల‌తో సినిమాలు చేయాల‌న్న‌ది నా డ్రీమ్‌. మహారాణి, యువరాణి లాంటి పాత్ర‌ల్లో క‌నిపించాల‌నుంది. అలాంటి సినిమాల‌ విషయంలో డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ఓ లెజెండ్ . ఆయన దర్శకత్వంలో సినిమా చేయాల‌న్న‌ది నా కల‌. రీసెంట్‌గా చూసిన సినిమాల్లో 'మా ఇంటి బంగారం చాలా న‌చ్చింది. స‌మంత అద్భుతంగా నటించారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల విష‌యంలో మాలాంటి కొత్త నటీమణులకు ఆమె ఒక దారి చూపించారు. అవకాశం వస్తే మా ఇంటి బంగారం లాంటి ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేయాలని ఉంది.

సీయోన్‌...

ప్రస్తుతం త‌మిళంలో శివకార్తికేయన్‌తో 'సీయోన్' సినిమా చేస్తున్నాను. షూటింగ్ దశలో ఉంది. మరో కొన్ని ప్రాజెక్టులు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. తెలుగులో కూడా కథలు వింటున్నాను.

Advertisement
Advertisement