Biggest flop Movie | సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్స్ సహజం. ఎప్పుడు సక్సెసుల్లోనే కొనసాగడం ఏ హీరోహీరోయిన్లకు, డైరెక్టర్లకు ఎవరికి సాధ్యం కాదు. అలాగని కెరీర్ మొత్తం ఫ్లాప్‌లతోనే సాగుతుందని అనుకోలేము. ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన అగ్ర హీరోల కెరీర్లలో డిజాస్టర్లు చాలానే ఉంటాయి. ఓ సినిమా ఎంత డిజాస్టర్ అయినా పెట్టిన పెట్టుబడిలో సగం వరకు లేదంటే ఇంకొంచెం తక్కువే కలెక్షన్లను రాబడుతుంటాయి. కానీ ఓ బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ పెట్టిన బడ్జెట్లో కనీసం ఒక్క శాతం కూడా వెనక్కి రాబట్టలేకపోయింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన సినిమాగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ సినిమానే ది లేడీ కిల్లర్. 293 టికెట్లు మాత్రమే... అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్ హీరోహీరోయిన్లుగా నటించిన ది లేడీ కిల్లర్ మూవీ 2023లో థియేటర్లలో రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అజయ్ భల్ దర్శకత్వం వహించారు. దాదాపు 45 కోట్ల బడ్జెట్‌తో మేకర్స్ ది లేడీ కిల్లర్ మూవీని రూపొందించారు. మొదటి రోజు మార్నింగ్ షోతోనే ఈ సినిమాను డిజాస్టర్‌గా ఆడియెన్స్ తేల్చేశారు. దాంతో పట్టుమని మూడు రోజులు కూడాథియేటర్లలో కనిపించలేదు. తొలిరోజు ది లేడీ కిల్లర్ మూవీ 38 వేల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఇండియా వైడ్‌గా ఫస్ట్ డే కేవలం 293 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. 12 షోలు మాత్రమే పడ్డాయి. మొత్తంగా థియేటర్లలో ఈ మూవీ లక్ష రూపాయల లోపే కలెక్షన్స్ దక్కించుకుని నిర్మాతలను నిండా ముంచేసింది. షూటింగ్ కంప్లీట్ కాకుండానే... నిర్మాతలతో ఏర్పడిన విభేదాల కారణంగా ఈ సినిమాను షూటింగ్ కంప్లీట్ కాకముందే రిలీజ్ చేయాల్సివచ్చిందని దర్శకుడు అజయ్భల్ అప్పట్లో ఆరోపణలు చేశారు. ఇంకా షూట్ చేయాల్సిన సీన్లు చాలానే ఉన్నాయట. కానీ అప్పటికే అనుకున్న బడ్జెట్ దాటిపోవడంతో వాయిస్ ఓవర్‌తో వాటిని మ్యానేజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ వారి ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే నిర్మాతకు అత్యధిక నష్టాలను తీసుకొచ్చిన మూవీగా లేడీ కిల్లర్ నిలిచింది. కనీసం ఓటీటీలో రిలీజ్ చేసి నష్టాలను కొంత వరకు అయినా తగ్గించుకోవాలని నిర్మాతలు చాలానే ప్రయత్నాలు చేశారు. కానీ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లేడీ కిల్లర్ సినిమాను కొనడానికి సాహసం చేయలేదు. దాంతో యూట్యూబ్‌లో ఈ సినిమాను రిలీజ్ చేశారు.