త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వ‌శి మేన‌క రివ్యూ – విష్ణుప్రియ‌, రాశీసింగ్‌ల‌తో అల్ల‌రి న‌రేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?

సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించే వారు మాత్ర‌మే కాదు..జీవితంలో క‌ష్టాన్ని న‌మ్ముకుంటూ పైకి ఎదిగిన ప్ర‌తి ఒక్క‌రూ హీరోలే అనే కాన్సెప్ట్‌తో రంభ ఊర్వ‌శి మేన‌క మూవీ రూపొందింది. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న‌ పాయింట్ మంచిదే. కానీ స్ఫూఫ్‌లు, పంచ్‌ల , పేర‌డీ సాంగ్స్ మ‌ధ్య అస‌లు క‌థ దారిత‌ప్పింది. గ‌జిబిజిగా మారింది.

N

Entertainment | Published On Sep 4, 2026, 8.37 pm IST

Rambha Oorvasi Menaka Review |  రంభ ఊర్వ‌శి మేన‌క రివ్యూ –  విష్ణుప్రియ‌, రాశీసింగ్‌ల‌తో అల్ల‌రి న‌రేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
Advertisement

Rambha Oorvasi Menaka Review |  బ‌తుకు అంటే గెలుపు....గెలుపు కొర‌కే బ‌తుకు అని ఓ సినీ క‌వి అన్నాడు. ఈ క్ర‌మంలో ఎన్ని క‌ష్టాలు, క‌న్నీళ్లు వ‌చ్చిన ఎదురీదాల్సిందేన‌ని చెప్పాడు. జీవితంలో పైకి రావ‌డానికి షార్ట్‌క‌ట్‌లు ఉండ‌వు. చివ‌ర‌కు దేవుడు కూడా క‌ష్టాల నుంచి గ‌ట్టెక్క‌డానికి మ‌న‌కు మార్గాన్ని సూచించే దిక్సూచిలానే ఉంటాడు. వాటిని మాయం చేయ‌లేడు...రంభ ఊర్వ‌శి మేన‌క ఇదే మెసేజ్‌తో రూపొందింది.
ఇప్పుడు సినిమాల్లో ట్రెండ్ మారింది. ఎంత సీరియ‌స్ క‌థ‌ను అయినా కామెడీతో చెబుతున్నారు ద‌ర్శ‌కులు. రంభ ఊర్వ‌శి మేన‌క‌తో ద‌ర్శ‌కుడు ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాడు.

అప్స‌ర‌స‌ల కోసం పూజ‌లు

సూరి తండ్రి హీరో కావాల‌ని క‌ల‌లు కంటాడు. ఆర్థిక ప‌రిస్థితులు స‌హ‌క‌రించ‌క ఊళ్లోనే నాట‌కాలు వేసుకుంటూ బ‌తుకుతుంటాడు. తాను హీరోగా మారి తండ్రి క‌ల‌ను తీర్చాల‌ని సూరి అనుకుంటాడు. వారి కుటుంబం త‌ర‌త‌రాలుగా అప్స‌ర‌స‌లైన రంభ ఊర్వ‌శి మేన‌క‌ల‌ను దేవ‌త‌లుగా పూజిస్తుంటారు. ఇంట్లో ఓ పురాత‌న కాలం నాటి గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథాన్ని తెరిచి రంభ ఊర్వ‌శి మేన‌క‌ల‌ను భూమిపైకి దించాల‌ని సూరి 30 ఏళ్లుగా ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాడు. ఈ క్ర‌మంలో ఆస్తులు క‌రిగిపోయి అప్పులు పెరుగుతాయి.
చిన్ని...సూరి క్లాస్‌మేట్‌. అత‌డిలోని క‌ళాకారుడికి ఫ్లాట్ అవుతుంది. సూరినే పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటుంది. జులాయిగా తిరిగే సూరికి త‌న కూతురిని ఇచ్చేది లేద‌ని చిన్ని తండ్రి కండీష‌న్ పెడ‌తాడు. నెల రోజుల్లోపు చేసిన అప్పుల‌న్నీ తీర్చేయాల‌ని అంటాడు. అప్పుడే కూతురిని ఇచ్చి పెళ్లిచేస్తాన‌ని సూరితో చెబుతాడు. సూరి త‌ల్లి హాస్పిట‌ల్ పాల‌వుతుంది. ఆమెను బ‌తికించుకోవాలంటే ల‌క్ష‌లు అవ‌స‌ర‌మ‌వుతాయి.

ఇంద్ర‌లోకం...

చేతిలో చిల్లిగ‌వ్వ‌లేని సూరి...బుక్ తెరిచి రంభ ఊర్వ‌శి మేన‌క‌ల‌ను ఇంద్ర‌లోకం నుంచి కిందికి దించుతాడు. ఇంద్రుడి శాపం కార‌ణంగా వారి మ‌హిమ‌లు పోతాయి. వ‌రాల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే ఈ ముగ్గురు అప్స‌ర‌స‌ల కార‌ణంగా సూరికి కొత్త క‌ష్టాలు వ‌చ్చిప‌డ‌తాయి. అవేమిటి? ఊరివాళ్ల‌కంట‌ప‌డ‌కుండా రంభ ఊర్వ‌శి మేన‌క‌ల‌ను సూరి ఎందుకు దాచిపెట్టాడు? త‌న త‌ల్లిని కాపాడుకున్నాడా? చిన్నిని పెళ్లిచేసుకున్నాడా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

అస‌లు క‌థ సైడ్ ట్రాక్‌...

సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించే వారు మాత్ర‌మే కాదు..జీవితంలో క‌ష్టాన్ని న‌మ్ముకుంటూ పైకి ఎదిగిన ప్ర‌తి ఒక్క‌రూ హీరోలే అని ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో చెప్పాల‌ని అనుకున్నాడు. ద‌ర్శ‌కుడు రాసుకున్న పాయింట్ మంచిదే. కానీ స్ఫూఫ్‌లు, పంచ్‌ల , పేర‌డీ సాంగ్స్ మ‌ధ్య అస‌లు క‌థ దారిత‌ప్పింది.

య‌మ‌లీల‌....

హీరో కోసం దేవుళ్లు భూమిపైకి దిగిరావ‌డం అనే పాయింట్‌తో తెలుగులో చాలానే సినిమాలు వ‌చ్చాయి. కానీ ఇందులో దేవుళ్లు కాకుండా రంభ ఊర్వ‌శి మేన‌క దిగొస్తారు. అదొక్క‌టే వెరైటీ. 1990 ద‌శ‌కంలో అలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన య‌మ‌లీల పెద్ద హిట్ట‌య్యింది. త‌ల్లి ప్రాణం కోసం హీరో య‌ముడితో ఫైట్ చేస్తాడు. ఆ క‌థ‌లోనే మార్పులు చేర్పులు చేసి రంభ ఊర్వ‌శి మేన‌క తీసిన‌ట్లుగా అనిపిస్తుంది.

రాజ‌మౌళి, బోయ‌పాటి...

సినిమా నిండా స్ఫూఫ్‌లే క‌నిపిస్తాయి. ఒక‌దాని వెనుక ఒక‌టి వ‌స్తూనే ఉంటాయి. రాజ‌మౌళి, బోయ‌పాటి శ్రీను నుంచి జేమ్స్ కామెరూన్ వ‌ర‌కు అంద‌రిని వాడుకున్నాడు డైరెక్ట‌ర్‌. చివ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కూడా వ‌ద‌ల‌లేదు. స్ఫూఫ్‌ల ట్రెండ్ ఔట్‌డేటెడ్ కావ‌డంతో ఏది న‌వ్వించ‌లేక‌పోయాయి.

బ్యాచ్‌ల‌ర్స్ క‌ష్టాలు...

ఉన్నంత‌లో సీనియ‌ర్ న‌రేష్ ఒక్క‌డే రంభ ఊర్వ‌శి మేన‌క సినిమాకు కాస్తో కూస్తో రిలీఫ్‌గా నిలిచాడు. విచిత్ర‌మైన ఇంగ్లీష్‌తో అత‌డు మాట్లాడే తీరు...బ్యాచ్‌ల‌ర్స్ క‌ష్టాలు అంటూ హీరోయిన్ల‌పై అత‌డు వేసిన పంచ్‌లు న‌వ్వించాయి. అల్ల‌రి న‌రేష్‌లో మునుప‌టి జోష్ లేదు. హీరోయిన్ సుర‌భి గెస్ట్‌లా అప్పుడ‌ప్పుడు సినిమాలో క‌నిపిస్తుంది. రంభ ఊర్వ‌శి మేన‌క పాత్ర‌ల విష‌యంలో హ‌ద్దులు దాటితే వివాదాలు ఎదుర‌వుతానే భ‌యంతో సినిమా మొత్తం వారిని దాచిపెట్టేశారు డైరెక్ట‌ర్‌. ఓ పాట‌లో మాత్ర‌మే కాస్తంత గ్లామ‌ర్ ఒలికించారు. ఒకే ఒక్క పాట‌తో సూరి సెలిబ్రిటీగా మార‌డం, ఏకంగా హీరోగా సినిమాలో ఛాన్స్ రావ‌డం కాస్తంత లాజిక్‌లెస్‌గానే అనిపిస్తుంది.

రంభ ఊర్వ‌శి మేన‌క అటు కామెడీతో న‌వ్వించ‌లేక...గ్లామ‌ర్‌తో మెప్పించ‌లేక మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

Advertisement
Advertisement