త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tirumala Brahmotsavam | తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. ఆ వైభవం వెనుక అసలు కథ!

Tirumala Brahmotsavam | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతుంది. ఏటా జరిగే ఈ మహోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాయి. వివిధ వాహనాలపై శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో విహరిస్తుండగా గోవింద నామస్మరణతో సప్తగిరులు మార్మోగుతాయి.

P

Devotional | Published On Oct 11, 2026, 6.30 pm IST

Tirumala Brahmotsavam | తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. ఆ వైభవం వెనుక అసలు కథ!
Advertisement

Tirumala Brahmotsavam | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. ఏటా జరిగే ఈ మహోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాయి. వివిధ వాహనాలపై శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో విహరిస్తుండగా గోవింద నామస్మరణతో సప్తగిరులు మార్మోగుతాయి. విద్యుద్దీపాల వెలుగులు, పుష్పాలంకరణలు, వేదమంత్రాల పఠనం, భక్తి సంకీర్తనలు ఉత్సవాల శోభను ఇనుమడింపజేస్తాయి. దేశవిదేశాల నుంచి తరలివచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అధిక మాసం కావ‌డంతో ఈ సారి రెండుసార్లు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌డం విశేషం. ఇటీవ‌ల సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు జ‌ర‌గ్గా.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌వి బ్ర‌హ్మోత్స‌వాలు అధిక మాసం ఉత్స‌వాలు.

తొమ్మిది రోజుల వేడుకల వెనుక..

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పురాణాల్లో విశిష్ట స్థానం ఉంది. సృష్టికర్త బ్రహ్మ స్వయంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందునే వీటికి బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు పేర్కొంటున్నాయి. పరబ్రహ్మ స్వరూపుడైన వేంకటేశ్వరునికి నిర్వహించే మహోత్సవం కావడంతో ఈ పేరు స్థిరపడిందనే మరో వివరణ కూడా ప్రచారంలో ఉంది. పురాణాల ప్రకారం.. త్రేతాయుగంలో వేదవతికి శ్రీమహావిష్ణువు వరమిచ్చిన నేపథ్యంలో, కలియుగంలో భక్తుల పాపాలను తొలగించి వారిని అనుగ్రహించేందుకు శ్రీవారు వేంకటాచలంపై వెలిశారు. స్వామివారి అవతారంతో సంతోషించిన దేవతలు ఆయనను సేవించేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలో బ్రహ్మకు ఉత్సవాలు నిర్వహించాల్సిందిగా శ్రీహరి ఆదేశించినట్లు భవిష్యోత్తర పురాణం వివరిస్తోంది. దీంతో చతుర్ముఖ బ్రహ్మ తొలిసారిగా అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించినట్లు ఐతిహ్యం.

కన్యామాసంలోనే ఎందుకు?

స్కాందపురాణంలోని వేంకటాచల మాహాత్మ్యం ప్రకారం.. బ్రహ్మ కన్యామాసంలో ధ్వజారోహణంతో ఉత్సవాలను ప్రారంభించి తొమ్మిది రోజులపాటు నిర్వహించారు. అప్పటి సౌరమాన గణనలో సూర్యుడు కన్యారాశిలో సంచరించే కాలానికి ఈ పేరు ఉండేది. చాంద్రమానంలో ఇది సాధారణంగా ఆశ్వయుజ మాసంతో అనుసంధానమవుతుంది. ఈ సంప్రదాయమే వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రాతిపదికగా మారిందని పురాణ కథనాలు చెబుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సాధారణంగా కన్యామాసంలో నిర్వహిస్తారు. అధికమాసం వచ్చిన సంవత్సరాల్లో రెండు బ్రహ్మోత్సవాలు జరపడం ఆనవాయితీ. చారిత్రకంగా వివిధ రాజులు తమ విజయాలు, భక్తి ప్రపత్తులకు గుర్తుగా ఉత్సవాలను నిర్వహించిన సందర్భాలూ ఉన్నాయి.

ధ్వజారోహణంతో ఆరంభం

బ్రహ్మోత్సవాల నిర్వహణలో ఆలయ శుద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఉత్సవాలకు ముందు నిర్వహించే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ద్వారా ఆలయాన్ని శుభ్రపరిచి, పవిత్ర వాతావరణాన్ని కల్పిస్తారు. అనంతరం ఆలయాన్ని, తిరుమాడ వీధులను సుందరంగా అలంకరిస్తారు. తొలిరోజు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. గరుడ ధ్వజాన్ని ఎగురవేసి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానించడం ఈ క్రతువులోని అంతరార్థం. అనంతరం సేనాధిపతి విష్వక్సేనుడి ఊరేగింపు వంటి వైదిక సంప్రదాయాలు కొనసాగుతాయి. ఆదిశేషుడిపై స్వామివారి దర్శనం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తొమ్మిది రోజులపాటు ఉదయం, సాయంత్రం వేర్వేరు వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి వాహనసేవ వెనుక ఒక ఆధ్యాత్మిక అంతరార్థం ఉందని భక్తులు విశ్వసిస్తారు. ఈ సేవలను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు.

అధిక మాసంలో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండ‌వు..

బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానానికి విశేష ప్రాధాన్యం ఉంది. స్వామివారి సుదర్శన చక్రానికి పుష్కరిణిలో స్నానం చేయించే ఈ కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఆ పవిత్ర సమయంలో పుష్కరిణిలో స్నానమాచరిస్తే పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. అనంతరం ధ్వజావరోహణంతో ఉత్సవాలకు అధికారికంగా ముగింపు పలుకుతారు. అధికమాసంలో నిర్వహించే రెండో బ్రహ్మోత్సవానికి మాత్రం సాధారణంగా ధ్వజారోహణ, ధ్వజావరోహణ కార్యక్రమాలు ఉండవు. ఈ సారి అధికమాసం కావడంతో బ్రహ్మోత్సవాలు రెండుసార్లు జరుగుతున్నాయి. వార్షిక సాలకట్ల బ్రహ్మత్సోవాలు సెప్టెంబర్‌లో జరిగాయి. ఈ నెల 12 నుంచి మరోసారి బ్రహ్మోత్సాలు జరుగనున్నాయి.

భక్తికి మించిన సందేశం

బ్రహ్మోత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలకే పరిమితం కావు. భక్తి, సంప్రదాయం, సామూహిక భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించడం, పుట్టిన నేల అభివృద్ధికి తోడ్పడటం వంటి విలువలను కూడా ఈ ఉత్సవాల నేపథ్యం గుర్తుచేస్తుంది. దైవారాధనతోపాటు మానవ సంబంధాల పట్ల బాధ్యతను చాటిచెప్పే ఈ సందేశం నేటి సమాజానికీ ప్రాసంగికమే. తొమ్మిది రోజులపాటు సాగే వాహనసేవలు, వేదఘోషలు, గోవింద నామస్మరణతో తిరుమల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. స్వామివారి కృపను కోరుతూ తరలివచ్చే భక్తులకు బ్రహ్మోత్సవాలు భక్తిపారవశ్యాన్ని పంచుతూనే, తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వైభవాన్ని చాటిచెబుతాయి.

వాహన సేవల వివరాలు

  • అక్టోబరు 11 : అంకురార్పణం రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
  • అక్టోబరు 12 : బంగారు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 9 గంటలకు, పెద్దశేష వాహనం – రాత్రి 7 గంటలకు.
  • అక్టోబరు 13 : చిన్నశేష వాహనం – ఉదయం 8 గంటలకు, హంస వాహనం – రాత్రి 7 గంటలకు.
  • అక్టోబరు 14 : సింహ వాహనం – ఉదయం 8 గంటలకు, ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 గంటలకు.
  • అక్టోబరు 15 : కల్పవృక్ష వాహనం – ఉదయం 8 గంటలకు, సర్వభూపాల వాహనం – రాత్రి 7 గంటలకు.
  • అక్టోబరు 16 : మోహినీ అవతారం – ఉదయం 8 గంటలకు, గరుడ వాహనం – సాయంత్రం 6.30 గంటలకు.
  • అక్టోబరు 17 : హనుమంత వాహనం – ఉదయం 8 గంటలకు, పుష్పక విమానం – సాయంత్రం 4 గంటలకు, గజ వాహనం - రాత్రి 7 గంటలకు
  • అక్టోబరు 18 : సూర్యప్రభ వాహనం – ఉదయం 8 గంటలకు, చంద్రప్రభ వాహనం – రాత్రి 7 గంటలకు.
  • అక్టోబరు 19 : స్వర్ణరథం – ఉదయం 7 గంటలకు, అశ్వ వాహనం – రాత్రి 7 గంటలకు.
  • అక్టోబరు 20 : చక్రస్నానం – ఉదయం 6 గంటలకు.
Advertisement
Advertisement