త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. పూణెలో సీనియర్ సిటిజన్లకు రూ.100 కోట్లు న‌ష్టం..

Digital Arrest | పూణెలో సీనియర్ సిటిజన్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలకు భారీగా బలవుతున్నారు. 2025 జనవరి నుంచి 2026 జూలై వరకు 19 నెలల వ్యవధిలో పూణెలో నమోదైన 136 డిజిటల్ అరెస్ట్ కేసుల్లో బాధితులు దాదాపు రూ.100 కోట్లను కోల్పోయినట్లు పూణె సైబర్ పోలీసుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

S

Crime | Published On Sep 21, 2026, 3.25 pm IST

Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. పూణెలో సీనియర్ సిటిజన్లకు రూ.100 కోట్లు న‌ష్టం..
Advertisement

Digital Arrest | పూణెలో సీనియర్ సిటిజన్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలకు భారీగా బలవుతున్నారు. 2025 జనవరి నుంచి 2026 జూలై వరకు 19 నెలల వ్యవధిలో పూణెలో నమోదైన 136 డిజిటల్ అరెస్ట్ కేసుల్లో బాధితులు దాదాపు రూ.100 కోట్లను కోల్పోయినట్లు పూణె సైబర్ పోలీసుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2025లో 85 కేసులు నమోదు కాగా, బాధితులు రూ.53.52 కోట్లను కోల్పోయారు. 2026లో తొలి ఏడు నెలల్లో 51 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బాధితుల నుంచి రూ.46.27 కోట్లు కాజేశారు. అంటే 2026లో కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, కేవలం ఏడు నెలల్లోనే గతేడాది మొత్తంలో కోల్పోయిన మొత్తానికి దాదాపు సమానంగా డబ్బు పోయింది.

ప్ర‌భుత్వ అధికారులుగా న‌టిస్తూ..

పూణె సైబర్ పోలీస్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ స్వప్నాలి షిండే తెలిపిన వివరాల ప్రకారం.. మోసగాళ్లు పోలీసు, కేంద్ర దర్యాప్తు సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థల అధికారులుగా నటిస్తున్నారు. బాధితులకు ఫోన్ లేదా సందేశం పంపి వారి ఆధార్, సిమ్ కార్డు, బ్యాంకు ఖాతా లేదా ఇతర గుర్తింపు వివరాలు నేరానికి సంబంధం ఉన్నాయని చెబుతున్నారు. అనంతరం తీవ్రమైన నేరంపై దర్యాప్తు జరుగుతోందని, తాము అరెస్టు చేయబోతున్నామని భయపెడుతున్నారు. తమ మాటలను నిజమైనవిగా నమ్మించేందుకు నకిలీ పత్రాలను కూడా చూపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మోసగాళ్లు వీడియో కాల్‌లో పోలీసు అధికారులు లేదా ప్రభుత్వ అధికారులుగా కనిపిస్తున్నారు. బాధితులను అరెస్టు చేయకుండా ఉండాలంటే దర్యాప్తుకు సహకరించాలని, ధ్రువీకరణ లేదా కేసు పరిష్కారం కోసం డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసు యూనిఫాం ధరించి వీడియో కాల్‌లో కనిపించడం, వెనుక పోలీస్ స్టేషన్ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ కార్యాలయంలా కనిపించే నకిలీ నేపథ్యాలను ఏర్పాటు చేయడం వంటి పద్ధతులను కూడా మోసగాళ్లు ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు.

రూ.10.75 కోట్లు కోల్పోయిన బాధితుడు..

సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని మనీలాండరింగ్, బాలల అశ్లీలత, ఉగ్రవాద కేసులకు సంబంధించిన నకిలీ సిమ్ కార్డులు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, బెదిరింపు లేదా అసభ్యకరమైన కాల్స్ వంటి కల్పిత ఆరోపణలు చేస్తున్నారు. బాధితులే నేరానికి పాల్పడినట్లు నమ్మించి, వారిపై తీవ్రమైన కేసు నమోదైందనే భయాన్ని సృష్టించి డబ్బు బదిలీ చేయిస్తున్నారు. పూణె సైబర్ పోలీసులు వెల్లడించిన కేసుల్లో భండార్కర్ రోడ్డుకు చెందిన 82 ఏళ్ల వృద్ధుడి కేసు అత్యంత భారీ నష్టాల్లో ఒకటిగా ఉంది. 2026 జనవరి 23 నుంచి 31 మధ్య జరిగిన ఈ మోసంలో ఆయన సుమారు రూ.10.75 కోట్లను కోల్పోయారు. సుమారు 15 ఏళ్ల క్రితం ఉత్తర భారతదేశం నుంచి పూణెకు వచ్చిన ఆయన తన పొదుపు మొత్తంతోపాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా ఈ మోసంలో కోల్పోయినట్లు తెలిపారు. మరో కేసులో 87 ఏళ్ల రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్‌ను మోసగాళ్లు సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించినట్లు పూణె సైబర్ పోలీసులు తెలిపారు. 2026 మేలో జరిగిన ఈ ఘటనలో ఆయన రూ.3.46 కోట్లను కోల్పోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.

డిజిట‌ల్ అరెస్ట్ ప్ర‌క్రియ లేదు..

ఇటీవల 74 ఏళ్ల రిటైర్డ్ టీచర్, ఆమె భర్త కూడా ఇలాంటి మోసానికి గురయ్యారు. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఈ దంపతులను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. సీనియర్ పోలీసు అధికారులుగా నటించిన నిందితులు దంపతులను దాదాపు నెల రోజుల పాటు డిజిటల్ అరెస్ట్‌లో ఉన్నట్లు నమ్మించారు. ఈ మోసంలో వారు రూ.68.8 లక్షలను కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. సైబర్ ఫోరెన్సిక్ నిపుణుడు సందీప్ గాడియా తెలిపిన ప్రకారం దేశంలో డిజిటల్ అరెస్ట్ అనే చట్టపరమైన ప్రక్రియే లేద‌ని అన్నారు. నిజమైన దర్యాప్తు సంస్థలు వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్టు చేయవని, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు డబ్బు చెల్లించాలని కోరవని ఆయన స్పష్టం చేశారు.

మ్యూల్ ఖాతాల‌కు డ‌బ్బు బ‌దిలీ..

మోసగాళ్లు కాజేసిన డబ్బును అనేక మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేస్తుండడంతో ఆ మొత్తాన్ని గుర్తించడం కష్టమవుతోందని గాడియా తెలిపారు. ఇలాంటి నెట్‌వర్క్‌లకు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, రాజస్థాన్ వంటి ప్రాంతాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని, కొంత మొత్తాన్ని క్రిప్టోకరెన్సీగా కూడా మార్చుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా పూణె సైబర్ పోలీసులు సీనియర్ సిటిజన్ సంఘాలు, హౌసింగ్ సొసైటీల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా తాము పోలీసులమని, ప్రభుత్వ అధికారులమని చెప్పే వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు బదిలీ చేయవద్దని, బ్యాంకు లేదా ఆర్థిక వివరాలను పంచుకోవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

Advertisement
Advertisement