త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Missing Medical Student Mumbai | 47 రోజులుగా మిస్సింగ్.. ముంబై వీధుల్లో బిచ్చగాడిగా మెడికల్ స్టూడెంట్.. గుండెల్ని పిండేసే విషాదం

47 రోజుల క్రితం అదృశ్యమైన ఓ మెడికల్ స్టూడెంట్ ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ పోలీసులకు చిక్కాడు. డాక్టర్ చదవాల్సిన యువకుడికి ఈ దుస్థితి ఎందుకు పట్టింది?

J

Crime | Published On May 26, 2026, 4.33 pm IST

Missing Medical Student Mumbai | 47 రోజులుగా మిస్సింగ్.. ముంబై వీధుల్లో బిచ్చగాడిగా మెడికల్ స్టూడెంట్.. గుండెల్ని పిండేసే విషాదం
Advertisement

Missing Medical Student Mumbai | త్రినేత్ర.న్యూస్ : సమాజంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. డాక్టర్ అయ్యి నలుగురి ప్రాణాలు కాపాడాల్సిన ఓ మెడికల్ స్టూడెంట్.. విధి ఆడిన వింత నాటకంలో ముంబై వీధుల్లో బిచ్చగాడిగా మారాడు. 47 రోజుల క్రితం అదృశ్యమైన 25 ఏళ్ల బీహెచ్ఎంఎస్ (BHMS) విద్యార్థిని.. ముంబై పోలీసులు మే 21న మలాడ్ ప్రాంతంలో 'యాంటీ-బెగ్గింగ్ డ్రైవ్' చేస్తుండగా గుర్తించి రక్షించారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది.

అసలేం జరిగిందంటే?

నాందేడ్‌కు చెందిన అభయ్ సురేష్ బేల్కోని.. జల్గావ్‌లో హోమియోపతి మెడిసిన్ (BHMS) మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఏప్రిల్ 4న కాలేజీకి వెళ్లేందుకు ట్రైన్ ఎక్కిన అభయ్.. ప్రయాణంలో తన లగేజ్ బ్యాగ్, మొబైల్ ఫోన్, ఐడీ కార్డులు అన్నీ పోగొట్టుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, ఎవరినీ సంప్రదించే దారి తెలియకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ముంబైకి చేరుకున్నాడు. క్రమంగా మానసిక స్థితి దెబ్బతినడంతో.. కడుపు నింపుకోవడానికి రోడ్లపై యాచించడం మొదలుపెట్టాడు.

పోలీసుల విచారణలో వెలుగులోకి

ముంబైలోని మలాడ్ ఎస్వీ రోడ్ (SV Road) వద్ద పోలీసులు యాచకుల కోసం డ్రైవ్ చేస్తుండగా అభయ్ కనిపించాడు. అప్పటికే శారీరకంగా బాగా నీరసించిపోయిన అతడు.. పోలీసుల ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడు. కానీ, తన పేరు, సొంత ఊరి వివరాలను మాత్రం అతికష్టం మీద చెప్పగలిగాడు. దీంతో అలెర్ట్ అయిన ముంబై పోలీసులు నాందేడ్‌లోని తాంసా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగా.. అప్పటికే అక్కడ అతనిపై 'మిస్సింగ్ కేసు' నమోదైనట్లు తేలింది.

47 రోజుల కుటుంబ సభ్యుల ఆవేదన

ఏప్రిల్ 6న ఒక రైల్వే వెండర్ మొబైల్ ఫోన్ నుంచి అభయ్ తన ఫ్యామిలీకి కాల్ చేశాడు. కానీ, తన పరిస్థితి చెప్పేలోపే కాల్ కట్ అయింది. కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆ నంబర్‌కు తిరిగి కాల్ చేయగా, అభయ్ అప్పటికే అక్కడినుంచి వెళ్లిపోయాడని ఆ వెండర్ చెప్పాడు. రోజుల తరబడి ఎంత వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో.. విసిగిపోయిన కుటుంబ సభ్యులు మే 16న నాందేడ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు మే 21న ముంబై పోలీసులు అతడిని సురక్షితంగా రక్షించి, తండ్రికి అప్పగించడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement