త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IT Returns | ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేస్తున్నారా.. అయితే ఈ డాక్యుమెంట్ల‌ను సిద్ధంగా ఉంచుకోవాల్సిందే..

IT Returns | ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫైలింగ్ సీజన్ ప్రారంభమైంది. లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే ప్రతి ఏడాది తొందరపాటు లేదా అసంపూర్ణ సమాచారం కారణంగా చాలామంది తప్పుగా ఐటీఆర్ ఫైల్ చేస్తుంటారు.

S

Business | Published On May 26, 2026, 3.51 pm IST

IT Returns | ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేస్తున్నారా.. అయితే ఈ డాక్యుమెంట్ల‌ను సిద్ధంగా ఉంచుకోవాల్సిందే..
Advertisement

IT Returns | ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫైలింగ్ సీజన్ ప్రారంభమైంది. లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే ప్రతి ఏడాది తొందరపాటు లేదా అసంపూర్ణ సమాచారం కారణంగా చాలామంది తప్పుగా ఐటీఆర్ ఫైల్ చేస్తుంటారు. దీంతో నోటీసులు రావడం, రీఫండ్ ఆలస్యం కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 కోసం ఐటీఆర్ ఫైల్ చేయాలని భావిస్తున్న వారు ముందుగా అవసరమైన డాక్యుమెంట్ల పూర్తి జాబితాను సిద్ధం చేసుకోవాలి. సరైన పత్రాలు ముందుగానే సిద్ధంగా ఉంటే ఐటీఆర్ ఫైలింగ్ సులభమవుతుంది. అలాగే పొరపాట్ల అవకాశాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు, ట్రేడర్లు, పెన్షన్ పొందేవారు ఇలా ప్రతి పన్ను చెల్లింపుదారుడికి కొన్ని కీలక డాక్యుమెంట్లు తప్పనిసరిగా అవసరం అవుతాయి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రాలుగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. పాన్ కార్డ్‌కు ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి. లింక్ చేయకపోతే ఐటీఆర్ ఫైలింగ్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి వివరాల‌ను రెండు రికార్డుల్లోనూ ఒకేలా ఉండేలా చూసుకోవాలి.

ఉద్యోగుల‌కు ఫామ్ 16 త‌ప్ప‌నిస‌రి..

ఉద్యోగులు తమ సంస్థ నుంచి ఫామ్ 16 తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో మొత్తం ఏడాది జీతం, టీడీఎస్ వివరాలు ఉంటాయి. ఫామ్ 16లో పార్ట్-ఎ లో ఉద్యోగి, కంపెనీ వివరాలు ఉంటాయి. పార్ట్-బిలో జీత విభజన, మినహాయింపులు, డిడక్షన్ల సమాచారం ఉంటుంది. ఏడాది మధ్యలో ఉద్యోగం మార్చిన వారు అన్ని కంపెనీల నుంచి ఫామ్ 16 తీసుకోవాలి. నెలవారీ శాలరీ స్లిప్‌లు కూడా చాలా ఉపయోగపడతాయి. వీటి ద్వారా జీతం, పీఎఫ్ కాంట్రిబ్యూషన్, అలవెన్సులు, బోనస్‌లు, రీయింబర్స్‌మెంట్లు వంటి వివరాల‌ను సరిచూసుకోవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేయడానికి ముందు ఫామ్ 26ఏఎస్, ఏఐఎస్‌ను జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం. ఈ డాక్యుమెంట్లలో టీడీఎస్, వడ్డీ ఆదాయం, డివిడెండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్ల సమాచారం ఉంటుంది. ఆదాయం వివరాలు, ఏఐఎస్ సమాచారం మధ్య తేడాలు ఉంటే స్క్రూటినీ లేదా నోటీసుల అవకాశాలు పెరుగుతాయి. అన్ని యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ల‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. సేవింగ్స్ అకౌంట్ వడ్డీ, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ, అద్దె ఆదాయం, ఇతర లావాదేవీల వివరాలు ఇందులో ఉంటాయి. బ్యాంకులు, పోస్టాఫీసులు జారీ చేసే ఇంటరెస్ట్ సర్టిఫికెట్లు కూడా పన్ను లెక్కింపులో కీలకంగా ఉంటాయి.

షేర్ల‌లో పెట్టుబ‌డులు పెడితే..

షేర్లు, ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్లు లేదా ప్రాపర్టీలో పెట్టుబడులు పెట్టిన వారు క్యాపిటల్ గెయిన్స్ స్టేట్‌మెంట్ తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి. దీని ద్వారా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌ను సరిగ్గా లెక్కించవచ్చు. ఇంట్రాడే ట్రేడింగ్, డెరివేటివ్స్ ట్రేడింగ్ చేసే వారు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్‌మెంట్ ను కూడా సిద్ధంగా ఉంచాలి. హోమ్ లోన్ తీసుకున్న వారు లెండర్ నుంచి ఇంటరెస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి. దీని ఆధారంగా సెక్షన్ 24(బి), సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపులు క్లెయిం చేయవచ్చు. పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్‌పీఎస్, సుకన్య సమృద్ధి యోజన, ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలు, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి పెట్టుబడుల డాక్యుమెంట్ల‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. పిల్లల ట్యూషన్ ఫీజు రశీదులు, ఇతర పెట్టుబడి ఆధారాలు కూడా అవసరం అవుతాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రశీదులు సెక్షన్ 80డి కింద డిడక్షన్ క్లెయిం చేయడానికి అవసరం అవుతాయి. హెచ్ఆర్ఏ క్లెయిం చేసే ఉద్యోగులు రెంట్ రశీదులు, రెంట్ అగ్రిమెంట్, అవసరమైతే ఇంటి యజమాని పాన్ వివరాల‌ను కూడా సమర్పించాలి.

ఫ్రీలాన్స‌ర్లు అయితే..

ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు, వ్యాపారులు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్‌మెంట్, జీఎస్టీ రిటర్నులు, బిల్లులు, ఇన్‌వాయిస్‌లు, ఖర్చుల రికార్డులు, ఆడిట్ రిపోర్టుల‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. గతేడాది ఐటీఆర్ కాపీ కూడా దగ్గర ఉంచుకోవడం మంచిది. పాత డిస్‌క్లోజర్లు, క్యారీ ఫార్వర్డ్ లాస్‌లను వెరిఫై చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఫామ్ 16 అందుకున్న తర్వాతే ఐటీఆర్ ఫైల్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా తర్వాత సవరణలు చేయాల్సిన అవసరం తగ్గుతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement