త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pattaya Suitcase Murder | బ్యాంకాక్‌లో ఆస్ట్రేలియా టూరిస్ట్ కిరాతకం: 17 ఏళ్ల బాలికను హత్య చేసి సూట్‌కేసులో కుక్కి

థాయ్‌లాండ్‌లో దారుణం! 17 ఏళ్ల బాలికను హత్య చేసి సూట్‌కేసులో కుక్కిన ఆస్ట్రేలియా టూరిస్ట్‌ను బ్యాంకాక్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

J

Crime | Published On Jun 27, 2026, 4.12 pm IST

Pattaya Suitcase Murder | బ్యాంకాక్‌లో ఆస్ట్రేలియా టూరిస్ట్ కిరాతకం: 17 ఏళ్ల బాలికను హత్య చేసి సూట్‌కేసులో కుక్కి
Advertisement
  • థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పట్టాయాలో 17 ఏళ్ల బాలిక దారుణ హత్య
  • బాలిక మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి రైల్వే ట్రాక్ సమీపంలో పడేసిన నిందితుడు
  • స్వదేశానికి పారిపోయేందుకు యత్నిస్తుండగా బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డ ఆస్ట్రేలియా జాతీయుడు సైమన్ కార్మన్ (45)
  • సీసీటీవీ ఫుటేజ్, హోటల్ గదిలో లభించిన ఆధారాలతో కేసును ఛేదించిన థాయ్ పోలీసులు

Pattaya Suitcase Murder | త్రినేత్ర.న్యూస్ : థాయ్‌లాండ్‌ (Thailand) వెళ్లిన ఓ ఆస్ట్రేలియా (Australia) టూరిస్ట్ కిరాతకానికి ఒడిగట్టాడు. 17 ఏళ్ల స్థానిక బాలికను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేసులో (Suitcase) కుక్కి పడేశాడు. నేరం చేసిన తర్వాత ఏమీ ఎరగనట్లు దేశం విడిచి పారిపోయేందుకు యత్నించిన నిందితుడిని శుక్రవారం రాత్రి బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే..

పోలీసుల కథనం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన సైమన్ కార్మన్ (45) థాయ్‌లాండ్‌కు టూరిస్ట్‌గా వచ్చాడు. గురువారం వేకువజామున 3:30 గంటల సమయంలో పట్టాయా (Pattaya) లోని తన హోటల్‌లో 17 ఏళ్ల తుంచనోక్ డాన్‌హోమ్లా అనే బాలికతో అతడు కలిసి ఉన్నాడు. ఆ తర్వాత గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో ఒక పెద్ద బ్లాక్ కలర్ సూట్‌కేస్‌ను తన స్కూటర్‌పై కట్టుకుని హోటల్ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డయ్యాయి.

ట్రాక్ పక్కన సూట్‌కేస్‌లో డెడ్‌బాడీ..

నిందితుడు స్కూటర్ పై వెళ్లిన మార్గంలో.. హోటల్‌కు పది నిమిషాల దూరంలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఆ నల్లటి సూట్‌కేస్‌ను పోలీసులు గుర్తించారు. అందులో బాలిక మృతదేహం నగ్నంగా లభ్యమైంది. ఆమె ముఖంపై తీవ్రమైన గాయాలు, రక్తస్రావం అయిన ఆనవాళ్లు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం బాలిక కనిపించడం లేదని ఆమె స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చేపట్టగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

ఎయిర్‌పోర్ట్‌లో ఎస్కేప్ ప్లాన్.. అడ్డుకున్న పోలీసులు

బాలిక చివరిసారిగా సైమన్‌తో కనిపించడంతో పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. అప్పటికే అతడు పట్టాయా నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్ (Perth) నగరానికి పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నాడు. జెట్‌స్టార్ (Jetstar) ఫ్లైట్ ఎక్కేందుకు బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన థాయ్ పోలీసులు.. ఇమ్మిగ్రేషన్ అధికారుల సహాయంతో అతడిని విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు.

సాలీడు కుట్టిందంటూ కట్టుకథలు..

విచారణలో నిందితుడు సైమన్ పొంతన లేని సమాధానాలు చెప్పాడు. తాను నిద్రపోతున్న సమయంలోనే బాలిక గదిలో నుంచి వెళ్లిపోయిందని తొలుత బుకాయించాడు. ఆ తర్వాత.. బాలిక తన వద్ద డబ్బులు డిమాండ్ చేసిందని, కత్తితో బెదిరించిందని ఆరోపించాడు. ఆ పెనుగులాటలోనే మరణించిందని చెప్పుకొచ్చాడు. తన మెడపై ఉన్న గోర్ల గాయాలు సాలీడు కుట్టడం వల్ల అయ్యాయని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు.

అయితే, సీసీటీవీ ఫుటేజ్, హోటల్ గదిలోని ఆధారాలతో పోలీసులు అతడిని ప్రధాన నిందితుడిగా తేల్చారు. సైమన్‌పై మర్డర్ (Murder), మృతదేహాన్ని దాచడం, అసభ్యకరమైన ప్రయోజనాల కోసం మైనర్‌ను కిడ్నాప్ చేయడం వంటి తీవ్రమైన అభియోగాలు నమోదు చేశారు. థాయ్‌లాండ్ చట్టాల ప్రకారం ఈ నేరాలకు మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల శాఖ సైమన్‌కు కాన్సులర్ సహాయం అందిస్తున్నట్లు ధృవీకరించింది.

Advertisement
Advertisement