త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ర‌హ్మ‌త్ పాషాను అభినందించిన కేటీఆర్

KTR | ఆస్ట్రేలియాలోని బోండీ ఘటనలో ప్రాణాలను పణంగా పెట్టి పలువురిని కాపాడిన రహ్మత్ పాషాను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు.

S

Telangana | Published On Aug 4, 2026, 5.37 pm IST

KTR | ర‌హ్మ‌త్ పాషాను అభినందించిన కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : ఆస్ట్రేలియాలోని బోండీ ఘటనలో ప్రాణాలను పణంగా పెట్టి పలువురిని కాపాడిన రహ్మత్ పాషాను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. బోండీ ప్రాంతంలో జరిగిన విషాద ఘటన సమయంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి దాదాపు 20 మంది ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్‌కు చెందిన భారతీయ మూలాల వ్యక్తి రహ్మత్ పాషాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శాశ్వత నివాస హోదా (Permanent Residency) కల్పించడం ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా తెలుగు సమాజానికి గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రహ్మత్ పాషాను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. బోండీ బీచ్ సమీపంలో ఒక ప్రయాణికుడిని దింపిన అనంతరం పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడంతో మొదట వాటిని బాణాసంచా శబ్దాలుగా భావించిన రహ్మత్ పాషా, వెంటనే వాహనం నుంచి దిగి చూడగా దుండగుడు దాడికి పాల్పడుతున్న దృశ్యాన్ని గమనించారు. ఆ సమయంలో వందలాది మంది ప్రాణభయంతో పరుగులు తీస్తుండగా, అక్కడి నుంచి వెళ్లిపోకుండా ఏమాత్రం వెనుకాడకుండా గాయపడిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, అనేక మంది ప్రాణాలను కాపాడేందుకు విశేష కృషి చేశారు.

రహ్మత్ పాషా చూపిన అసాధారణ ధైర్యాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనకు ప‌ర్మినెంట్ రెసిడెన్సీ మంజూరు చేయడమే కాకుండా, ప్రభుత్వ బ్రేవ‌రి అవార్డుకు కూడా నామినేట్ చేసినట్లు సమాచారం. అలాగే ఆయన సేవలను ఆయన పనిచేసిన రైడ్-షేరింగ్ సంస్థ కూడా ప్రత్యేకంగా గుర్తించి అభినందించింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి ఖ్యాతిని మరింత పెంచేలా రహ్మత్ పాషా చేసిన సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని కేటీఆర్ పేర్కొన్నారు. సమాజం కోసం నిస్వార్థంగా సేవ చేయాలనే సందేశాన్ని ఆయన తన ఆచరణ ద్వారా చాటిచెప్పారని కొనియాడారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, నిశీధర్ బొర్రా, వేణు తదితరులు పాల్గొని రహ్మత్ పాషాను ఘనంగా అభినందించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement