త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Andre Russell | ఆండ్రే రస్సెల్‌కు గౌరవార్థం జెర్సీ నంబర్ 12ను రిటైర్ చేసిన కేకేఆర్

Andre Russell | కోల్‌క‌తా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు తమ లెజెండరీ ఆల్‌రౌండర్ ఆండ్రే రస్సెల్‌కు గౌరవార్థంగా అతని జెర్సీ నంబర్ 12ను రిటైర్ చేయాలని నిర్ణయించింది. తాజాగా నిర్వహించిన ప్రీసీజన్ ఈవెంట్ నైట్స్ అన్‌ప్లగ్డ్ 3.0లో ఈ ప్రత్యేక ప్రకటనను జట్టు వెల్ల‌డించింది.

S

Cricket | Published On Mar 25, 2026, 12.42 pm IST

Andre Russell | ఆండ్రే రస్సెల్‌కు గౌరవార్థం జెర్సీ నంబర్ 12ను రిటైర్ చేసిన కేకేఆర్
Advertisement

Andre Russell | కోల్‌క‌తా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు తమ లెజెండరీ ఆల్‌రౌండర్ ఆండ్రే రస్సెల్‌కు గౌరవార్థంగా అతని జెర్సీ నంబర్ 12ను రిటైర్ చేయాలని నిర్ణయించింది. తాజాగా నిర్వహించిన ప్రీసీజన్ ఈవెంట్ నైట్స్ అన్‌ప్లగ్డ్ 3.0లో ఈ ప్రత్యేక ప్రకటనను జట్టు వెల్ల‌డించింది. ప్రస్తుతం రస్సెల్ కేకేఆర్ కోచింగ్ బృందంలో భాగంగా కొనసాగుతూ, కొత్త సీజన్‌కు ముందు పవర్ కోచ్ గా సేవలు అందించనున్నాడు. 2014 నుంచి 2025 వరకు ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున 12 సంవత్సరాల పాటు ఆడిన అతను, తన అద్భుత ప్రదర్శనలతో జట్టులో కీలక ఆటగాడిగా నిలిచాడు. 2014, 2024లో కేకేఆర్ రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకోవడంలో అతని పాత్ర అత్యంత ముఖ్యమైనది.

కేకేఆర్‌లో కీల‌క ప్లేయ‌ర్‌గా..

రస్సెల్ ఐపీఎల్‌లో మొత్తం 140 మ్యాచ్‌లు ఆడి, 174.17 స్ట్రైక్‌రేట్‌తో 2,651 పరుగులు చేయడంతో పాటు 123 వికెట్లు తీశాడు. ఐపీఎల్ చరిత్రలో 2000కు పైగా పరుగులు, 100కి పైగా వికెట్లు సాధించిన రెండో ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. 2019 సీజన్‌లో 204.81 స్ట్రైక్‌రేట్, 56.66 సగటుతో 510 పరుగులు చేసి మోస్ట్ వ్యాల్యూయబుల్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు. అంతేకాకుండా 2012, 2016లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్లలో భాగమైన రస్సెల్, 2021లో ముంబై ఇండియన్స్‌పై 5/15 గణాంకాలతో కేకేఆర్ తరఫున ఐపీఎల్ చరిత్రలో ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. కేకేఆర్ తరఫున అతను సాధించిన 122 వికెట్లు జట్టు చరిత్రలో రెండవ అత్యధికంగా నిలిచాయి. ఈ జాబితాలో సునీల్ నరైన్ (192 వికెట్లు) మొదటి స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్ గెల‌వ‌డం భిన్న‌మైన అనుభ‌వం: ర‌స్సెల్

ఈ సందర్భంగా కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ ఆండ్రే రస్సెల్‌తో త‌మ‌కు కేవలం జట్టు పరంగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా దీర్ఘకాలిక అనుబంధం ఉంద‌ని తెలిపారు. అతను మైదానంలో చూపించిన ప్రదర్శనలు త‌మ‌కు ఎన్నో విజయ క్షణాలను అందించాయ‌ని, అతను ఎప్పుడూ గర్వంగా ధరించిన నంబర్ 12 అతనికి ప్రత్యేక గుర్తింపు అని అన్నారు. అందుకే కేకేఆర్ సంప్రదాయంలో భాగంగా ఈ నంబర్‌ను రిటైర్ చేయాలని నిర్ణయించామ‌ని తెలిపారు. అనంత‌రం ర‌స్సెల్ మాట్లాడుతూ ఈ ఫ్రాంచైజీతో త‌న‌ ప్రయాణం పదేళ్లకు పైగా అద్భుత విజయాలతో సాగింద‌ని అన్నాడు. ఈ వీడియో చూసినప్పుడు కొంచెం భావోద్వేగానికి గురయ్యాన‌ని, కేకేఆర్‌తో రెండు ఛాంపియన్‌షిప్‌లు గెలవడం, అది అందరికీ ఎంత ముఖ్యమో చూడడం గొప్ప అనుభూతి అని అన్నాడు. వరల్డ్ కప్ గెలవడం ప్రత్యేకమే కానీ ఐపీఎల్ గెలవడం మాత్రం భిన్నమైన అనుభవం అని, ఈ ప్రయాణాన్ని ఎంతో ప్రత్యేకంగా మార్చిన కేకేఆర్‌కు త‌న‌ కృతజ్ఞతలు అని అన్నాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement