త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Income Tax | ఈ 10 మార్గాల నుంచి వ‌చ్చే ఆదాయానికి ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.. ఏవి అంటే..?

Income Tax | ఆదాయపు పన్ను విషయంలో చాలా మంది డిడక్షన్లు, ఎగ్జెంప్షన్లపైనే దృష్టి పెడతారు. అయితే భారతీయ పన్ను చట్టాల ప్రకారం కొన్ని రకాల ఆదాయాలు పూర్తిగా పన్ను రహితంగా ఉంటాయి. వీటి గురించి అవగాహన ఉంటే ఆర్థిక ప్రణాళికను మెరుగ్గా రూపొందించుకోవడంతోపాటు ఐటీఆర్ దాఖలు సమయంలో పొరపాట్ల‌ను కూడా నివారించవచ్చు.

S

Business | Published On Jun 17, 2026, 10.48 am IST

Income Tax | ఈ 10 మార్గాల నుంచి వ‌చ్చే ఆదాయానికి ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.. ఏవి అంటే..?
Advertisement

Income Tax | ఆదాయపు పన్ను విషయంలో చాలా మంది డిడక్షన్లు, ఎగ్జెంప్షన్లపైనే దృష్టి పెడతారు. అయితే భారతీయ పన్ను చట్టాల ప్రకారం కొన్ని రకాల ఆదాయాలు పూర్తిగా పన్ను రహితంగా ఉంటాయి. వీటి గురించి అవగాహన ఉంటే ఆర్థిక ప్రణాళికను మెరుగ్గా రూపొందించుకోవడంతోపాటు ఐటీఆర్ దాఖలు సమయంలో పొరపాట్ల‌ను కూడా నివారించవచ్చు. దేశంలోని వ్యవసాయ భూమి నుంచి వచ్చే వ్యవసాయ ఆదాయం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(1) కింద పూర్తిగా పన్ను మినహాయింపు పొందుతుంది. ఇందులో పంటల సాగు ద్వారా వచ్చే ఆదాయం, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం, అలాగే వ్యవసాయ భూమి అద్దె ద్వారా వచ్చే ఆదాయం కూడా ఉంటాయి. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) నుంచి సభ్యులకు పంపిణీ చేసే ఆదాయం కూడా పన్ను రహితమే. హెచ్‌యూఎఫ్ ను ఒక ప్రత్యేక పన్ను చెల్లించే సంస్థగా పరిగణించడం వల్ల, దాని ఆదాయం నుంచి సభ్యులకు అందే మొత్తంపై మరోసారి పన్ను విధించరు.

కుటుంబ సభ్యుల నుంచి వ‌చ్చే సొమ్ము..

పార్ట్‌నర్‌షిప్ ఫర్మ్ లేదా ఎల్‌ఎల్‌పీ నుంచి భాగస్వామికి లాభాల వాటాగా వచ్చే ఆదాయం సెక్షన్ 10(2ఏ) కింద పన్ను మినహాయింపు పొందుతుంది. అయితే అదే సంస్థ నుంచి జీతం లేదా వడ్డీ రూపంలో పొందే ఆదాయం మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, సహోదరులు, చట్టం పేర్కొన్న ఇతర బంధువుల నుంచి పొందే బహుమతులు పూర్తిగా పన్ను రహితంగా ఉంటాయి. మొత్తానికి ఎలాంటి పరిమితి ఉండదు. అలాగే వారసత్వంగా పొందిన ఆస్తులపై కూడా పన్ను ఉండదు. విద్యా ఖర్చుల కోసం విద్యార్థులకు మంజూరు చేసే స్కాలర్‌షిప్‌లు పూర్తిగా పన్ను మినహాయింపు పొందుతాయి. విద్యార్థులకు వీటిని ముఖ్యమైన ఆర్థిక సహాయ వనరుగా పరిగణిస్తారు. ఉద్యోగ విరమణ సమయంలో పొందే గ్రాట్యుటీపై కూడా పన్ను రాయితీలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ మొత్తానికి పూర్తి మినహాయింపు లభిస్తుంది. ప్రభుత్వేతర ఉద్యోగులు నిర్దిష్ట నిబంధనల ప్రకారం ప్రస్తుతం రూ.20 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందవచ్చు.

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) వంటి పథకాలలో లభించే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తాలు, ఆయా పథకాల నిబంధనలు పాటించినట్లయితే పూర్తిగా పన్ను రహితంగా ఉంటాయి. ఉద్యోగ విరమణ సమయంలో పొందే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కూడా పన్ను మినహాయింపు పొందుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి మినహాయింపు లభిస్తే, ప్రభుత్వేతర ఉద్యోగులు నిర్దిష్ట షరతుల మేరకు రూ.25 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల నుంచి తీసుకునే ఉపసంహరణలు కూడా సాధారణంగా పన్ను రహితంగా ఉంటాయి. ఇందుకు ఉద్యోగి కనీసం ఐదేళ్ల నిరంతర సేవ పూర్తి చేసి ఉండాలి లేదా ఇతర నిర్దిష్ట అర్హతలను కలిగి ఉండాలి. జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీ మొత్తాలు, బోనస్‌లతో సహా, సెక్షన్ 10(10డి) కింద నిర్దిష్ట ప్రీమియం పరిమితులకు లోబడి పన్ను మినహాయింపు పొందుతాయి. అయితే పాలసీదారుడు మరణించిన సందర్భంలో లభించే డెత్ బెనిఫిట్స్ మాత్రం మొత్తంతో సంబంధం లేకుండా పూర్తిగా పన్ను రహితంగా ఉంటాయి.

Advertisement
Advertisement